‘‘ఏవిటో! కాళ్ళూ చేతులూ ఆడట్లేదు. ఇంక మిగిలిన ఈ కూర కూడా పోపున పడేస్తే ఓ పనయిపోతుంది. ఆదరువులు అన్నీ కారియర్లో సర్ది ఇస్తే వెళ్ళగానే ఇబ్బంది పడకుండా ఉంటారు. బయల్దేరే టైమవుతున్నట్లుంది. వర్జ్యం వచ్చేలోపల అక్కడికి చేరాలంటారు కదా’’ అని తనలో తనే మాట్లాడుకుంటూ సీతమ్మ ఒకటే హడావిడి పడిపోతోంది.వంటింటి గుమ్మంలో నిలబడ్డ రామశర్మగారు ‘‘ఇదుగో! గోలచెయ్యకు. వాళ్ళెళ్ళేది మాదాపూరు. అమెరికా కాదు. ప్రతి శనివారమూ కనపడుతూనే వుంటార్లే. నువ్వూరికే బెంగపెట్టుకుంటే వాళ్ళకి జయం కాదు. సంతోషంగా పంపించు’’ అని అంటూ భార్యని హెచ్చరించారు.‘‘ఏదో ఇద్దరివీ బోలెడేసి సంపాదనలు! సొమ్ము పల్లాములైపోకుండా పదును చేసుకుంటారని ఒక ఇల్లమర్చుకోండిరా అన్నాను గానీ జై పరమేశ్వరా అంటూ ఏకంగా కాపురం పెట్టమన్నానా? ఇంక ఇప్పుడు లంకంత ఈ కొంప మనిద్దరం ఏం చేసుకుంటాం? బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చెయ్యాలి. 

సందడీ, సరదా అన్నీ ఇంక చెల్లు’’ అంటూ సీతమ్మ కళ్ళు తుడుచుకుంది.‘‘అందుకే మరి, ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు ముందూ వెనకా ఆలోచించుకోవాలంటారు. వాళ్ళ ఆఫీసులకి అర మైలు దూరంలో కోటి రూపాయలు పోసి ఎయిర్‌ కండిషన్డు ప్లాటు కొన్నాక దాన్ని ఎవరికో అద్దెకిచ్చి ఇక్కడే మనతో వుండమనడం న్యాయం కాదు. ఇల్లు ఇంద్రలోకంలాగా, అచ్చం అమెరికా ఇళ్ళల్లాగా మెరిసిపోతోందని నువ్వే ఎంతగానో మురిసిపోయినప్పుడు, మరి అక్కడుండాలని వాళ్ళకుండదా? వెళ్ళనీ! సందడి లేకపోవడమేమిటి? మనమే రోజూ మంచి మంచి పాటలూ, పద్యాలూ పాడుకుంటూ సందడి చేద్దాం.‘‘అఘోరించినట్లుంది మీ సంబడం. చంటిది పుట్టాక దాన్ని ఒక్కరోజు వదిలుండలేదు. మీకేం! ఇక్కడో ప్రవచనం, అక్కడో సన్మానం అంటూ తిరుగుతారు. పిల్ల లేకపోతే చెయ్యి విరగ్గొట్టినట్లు పనేం వుంటుంది. మరీ వాళ్ళని ఇలా పంపించేయాల్సొస్తుందనుకోలేదు. కుదురుగా వున్న వాళ్ళని నేనే నేరకపోయి వేధించేశాను. సంపాయించుకుంటున్న వాళ్ళకి దాచుకోడం తెలీదా? నా సలహా ఎందుకు? పెద్దాడిలాగా ముందు నుంచీ ఎడంగానే వుండుంటే ఏ బాధా వుండేది కాదు. ఏవిటో చేతులారా చేసుకున్నాను. అంతా స్వయంకృతం...’’ అనుకుంటూ అవీ ఇవీ సవరించసాగింది.