అవసరాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, అవకాశాల మేరకు జీవితాన్ని మలుచుకోవడం నా అలవాటు.ఇది ఈనాటిది కాదు. తెలిసీ తెలియని వయసు నుంచే అని జ్ఞాపకం! కాకపోతే ఉద్యోగంలోచేరినప్పట్నుంచే జీవితానికి కావల్సిన అవసరాలని రూపాయి పైసల్తో సర్దుకొస్తున్నాను.చిన్నప్పట్నుంచీ తినీతినకా చాలీచాలక గడిచిన ఒంటరి జీవితం. అష్ట కష్టాలు పడి బి.ఏ. దాకా వారాలకు బ్రతుకులో నెగ్గుకొచ్చి నిరుద్యోగం విసిరిన వలలో విసుగెత్తి, తప్పించుకుని జీవితంలో రాజీపడడం కోసం చిల్లరబతుకు గడిపి, కొండరాళ్ళలోంచి దాటిన నది మైదానంలో ప్రశాంతంగా, నిలకడగా నడిచినట్టుగా ఇదిగో - ఈ నాలుగొందల గుమాస్తా జీవితానికి జతకలిపేసాను.సర్దుకుపోవడం నా జీవితం!ఈ దేశంలో ఎంత చదివినా, ఎంత మేధావి అయినా, ఏ నాయకుడు పోయి, ఏ ప్రభుత్వమొచ్చినా - ఏ భద్రతాలేని ప్రజల బ్రతుకే నాకు ఈ సర్దుకుపోవడం అనే అలవాటుని నేర్పింది.అందుకే...ఏ పనిచేసినా - ఓ పద్ధతి. ఓ లెక్క, ఓ ప్లాను ప్రకారం చెయ్యడం అలవాటు చేసుకున్నాను.ఏదో ఓ గడ్డు క్షణాన ఎదురయ్యే ఇబ్బందికోసం - ఇల్లంటున్నపుడే బావితవ్వే రిస్కు తీసుకోవడం కన్నా ఈ ముందు చూపు నయం.ప్రభుత్వం మారిపోయిందని చంకలు గుద్దుకుంటున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు.

 ఎవరి నోటవిన్నా ఒకేమాట. రామరాజ్యం వచ్చిందని!నాకు నవ్వొచ్చింది!అయిదేళ్ళకో, లేక వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడో ఎన్నికలు జరిపి, ప్రభుత్వం మారి పోయినంత మాత్రాన ఏం వొరుగుతోంది. తిండి గింజలు చవకయి పోయినాయా? కాలేజీలో సీట్లు సులభంగా దొరుకుతున్నాయా? డిగ్రీ తీసుకోగానే లేదనకుండా ఉద్యోగాలిస్తున్నారా? వ్యాపారులు లాభాలు తగ్గించుకుని అమ్మకాలు చేస్తున్నారా? పంచదార, కిరోసిన్‌ లాంటివి బ్లాకులో కాకుండా విరివిగా కంట్రోలు రేటుకే దొరుకుతున్నాయా?మరెందుకీ హడావుడి?నిజానికి ప్రభుత్వాలు ఎన్నిమారినా సామాన్యునికి ఒరిగేదేమీ లేదని క్రితం నెల నా బడ్జెట్‌ చూస్తే తెలుస్తుంది.బస్సుఛార్జీలు పెంచడం వల్ల నాకు ఆ ఖర్చు పద్దెనిమిది నించి ఇరవై మూడు రూపాయలకి తేలింది. కిరోసిన్‌ లీటర్‌కి ఏభై పైసలు పెంచారు. అంటే ప్రతినెల పదిహేను అయ్యేది ఇప్పుడు అదనంగా రెండు రూపాయల ఏభై పైసలు పెరిగింది. ఉల్లిపాయల ధరలు పెరిగాయి.వీటన్నింటివల్లా ఇప్పుడు నా ఆదాయంలో దాదాపు పదిహేను రూపాయల లోటు కనిపిస్తోంది.అందుకే సాధ్యమయినంత వరకు ఖర్చులు తగ్గించాను.రెండు కిలోల బియ్యం తగ్గించాను. రెండే బట్టల సుబ్బులు వాడు తున్నాను. సరుకులన్నీ వంద, రెండు వందల గ్రాములు తగ్గించాను. పెరిగిన బస్సు ఛార్జీలు దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యానికి మంచిదన్న వంక పెట్టుకుని రెండు స్టేజీలు ముందే దిగి నడుస్తున్నాను. ఒక లీటర్‌ కిరోసిన్‌ తగ్గించేసి వంట తగ్గించేసాను, సిగరెట్లు తగ్గించాను.