ఆలస్యమైనా, హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ పోలీస్‌ కమీషనర్‌గా పని చేస్తున్న చైతన్య సంబంధం కుదిరింది లహరికకు. పాతికేళ్ళొచ్చినా కూతురికి పెళ్ళికాలేదనే దిగులు మాయమైంది ఆమె తల్లికి.పెళ్ళిచూపుల్లో చైతన్యను చూసిన ఆమె ఫ్రెండ్స్‌ ‘నీ కాబోయే శ్రీవారు ఆరడగుల బుల్లెట్టే’ అని ఆట పట్టిస్తుంటే, గర్వంతో ఆమె హృదయం వరద గోదారిలా ఉప్పొంగింది.

కళ్యాణపురంలో కొత్తగా కట్టిన కల్యాణ మండపంలో చైతన్య, లహరికల పెళ్ళి వైభవంగా జరిగింది. పెళ్ళయిన తర్వాత అత్తగారింటికి చేరు కున్న చైతన్యకు వాళ్ళ పాత ఇల్లు నచ్చలేదు. ‘ఆ రాత్రికి ఇంట్లో శోభనం అస్సలు కుదరదన్నాడు. లహరికను మనతో తీసుకెళ్దాం’ అని పేచీ పెట్టాడు. ‘అత్తారింట్లో కొత్తల్లుడు మూడు నిద్రలు చేయడం సంప్రదాయం రా’ అని తల్లి చీవాట్లు పెట్టింది. అయితే మూడు రోజులూ హోటల్లో ఉంటా నన్నాడు చివరికి. ఇంక తప్పక హోటల్లోనే శోభనం ఏర్పాట్లు జరిగాయి.చైతన్య తల్లిదండ్రులు, బంధువులంతా స్పెషల్‌ బస్సులో బయల్దేరి హైదరాబాద్‌ వెళ్ళిపోయారు.ఆ రాత్రి శోభనం.కళ్యాణపురంలో ఈ మధ్యనే ఒక హోటల్‌ని అధునాతనంగా నిర్మించారు. కారు పోర్టికోలో ఆగింది. లహరిక కారు దిగింది.

అప్పటికే ముత్తైదువలు అక్కడికి చేరుకున్నారు.‘‘రావే! శోభనం పెళ్ళికూతురా!’’ అని మేనత్త ఆమెతో వేళాకోళమాడింది.హోటల్‌ గదిలో మంచం మీద కూర్చున్న చైతన్య అందర్నీ చూసి లేచి నిలబడ్డాడు. లహరిక గుమ్మం దగ్గర నిలబడి తలెత్తి చూసింది. తెల్లటి సిల్కు లాల్చీ, పైజమాలో మెరిసిపోతున్నాడు చైతన్య. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.‘‘ఆరడుగుల బుల్లెట్టు ఎదురు చూస్తుంటే ఇంకా నిలబడ్డావేం?’’ అంటూ ఆమెను ఎవరో ముందుకు నెట్టారు.అంతా పకపకనవ్వుతున్నారు. వాళ్ళ నవ్వులు మంగళ వాయి ద్యాల్లా వినిపిస్తున్నాయి ఆమె చెవు లకు.లహరిక తలెత్తి గదినంతా పరికించి చూస్తోంది. శృంగార దృశ్యాలున్న పెయింటింగ్స్‌ చూసి సిగ్గు పడింది. ఒక మూల టీపాయ్‌ మీద స్వీట్స్‌, పళ్ళు షాపులో మాదిరి పేర్చి ఉన్నాయి. అగరుపొగలు గదిలో కమ్ముకుంటున్నాయి. బెడ్‌మీద గులాబీలు, మల్లెమొగ్గలతో గుండె ఆకారం, మధ్యలో మన్మథబాణం, స్వీట్‌డ్రీమ్స్‌ అనే ఇంగ్లీష్‌ అక్షరాలు అలంకరించి ఉన్నాయి. ఆమెకు ఏదో కొత్తలోకంలోకి అడుగు పెట్టి నట్టు అనుభూతి కలిగింది.ఆ తర్వాత పురోహితుడు వధూవరులను మంచం మీద కూర్చోబెట్టి మంత్రాలు చదివి చేతులు కలిపి, ముహూర్తం దగ్గర పడిందని అందర్నీ పంపించి తనూ నిష్క్రమించాడు.చైతన్య మంచం దిగి ఒళ్ళు విరుచుకున్నాడు.‘‘లహరికా! ప్రతిదానికీ ముహూర్తం ఏమిటి? మనిషి ముహూర్తం చూసుకుని పుడుతున్నాడా? ముహూర్తం చూసుకుని పోతున్నాడా? అంతా చాదస్తం’’ అన్నాడు.లహరిక గూడా మంచం దిగింది.‘‘ఇప్పుడు అదంతా అవసరమా? ఎవరి నమ్మ కాలు వారివి. పోనివ్వండి’’ అన్నది.