లోకంలో వయసొచ్చిన అందరాడ పిల్లలకి మల్లేనే ఆ పిల్ల కూడా మొదట్లో మంచుతో నేసిన జలతారు ముసుగు మోహమ్మీదికి లాక్కుని, రేకువిడడానిక్కూడా సిగ్గుపడే మల్లెమొగ్గలా వుండేది. కాళ్ళలో లేళ్ళు గంతులేసేవి. కనురెప్పల్ని కలలు కమ్ముకునేవి. కారుమేఘాల మదపు టేనుగులు గుంపుగా జుట్టులోకి కుమ్ముకొచ్చేవి. కాళ్లూ, చేతులూ, ప్రతి అవయవం యవ్వన పరిమళపు సెలయేళ్ళుగా తుళ్ళిపడేవి. పెదవుల మీద వెన్నెల ఒలికి, పలువరుసని పలకరించి, ఒంటిలో యింకి పోయేది.నడిస్తే నడుస్తున్న హారతిలా వుండేది.ఆ పిల్ల తండ్రి కాళ్లూ, చేతులూ మెదడూ ఎప్పుడూ పన్జేస్తుండేవి. అర్థరాత్తుళ్ళు భగ్గుమని చివరి మంట మండే లాంతర్లాంటి కళ్లతో యింటికి చేరేవాడు. కుష్టు వ్యాధి వ్యాపించిన వాడిలాగా దరిద్రంతో తీసుకుంటుండేవాడు. దరిద్రం క్రమంగా అతని అన్ని అయవవాల్ని తినేస్తోంది. నెమ్మదిగా నెమ్మదిగా యింటిగోడలకి, యింట్లోని యితర వస్తువులకి, మనుషులకి వ్యాపిస్తోంది ఆ వ్యాధి.తల్లి వంటింటి అలుగ్గుడ్డ. ఎడ తెరిపిలేని దగ్గుగా మారి చింకిచాప మీద ముణగదీసుకునుండేది. అర్థరాత్రి మసిబారిన లాంతరు కళ్లతో, సగం సగం ఆవయవాల్తో యింటికొచ్చే కట్టెతో కాపరం జేసేది.వీధిలోని పెంట కుప్పకీ, యింటికి పెద్ద తేడాలేదు. పెంట కుప్పమీద గులాబీ మొక్కలాగా ఆ పిల్ల తనని తాను చూసుకునే లోపలే ఎదిగిపోయింది.

అవయవాలన్నీ అందమైన పువ్వుల్లోకి మారిపోయినై. కుండీలో పెడతాననీ, మేకలు తినెయ్యకుండా కాపలా కాస్తాననీ, అంటుకట్టి మరిన్ని అందమైన రంగు రంగుల పూలు పూయిస్తానని పుస్తకాల్లోంచి పక్క వీధిలోంచి ఎగిరొచ్చాడో కుర్రవాడు.వాడి మాటల్లో మత్తుపానీయాలున్నాయ్‌.వాడి కళ్ళలో గురి తప్పని పూల బాణాలున్నాయ్‌.వాడి నిట్టూర్పుల్లో మధురంగా బంధించే లతలున్నాయ్‌.వాడి చొక్కాకీ గలగలలాడే జేబుంది.వాడి వొంట్లో సలసలకాగే రక్తసరసుంది.వాడి చేతిలో గుండెల్ని సుతిమెత్తగా తెరిచే రహస్య తాళం చెవి వుంది.అనుమతివ్వాలో లేదో తేల్చుకోకముందే ఆమె గుండెని తెరిచి దేహమంతా ఆక్రమించుకున్నాడు వాడు. రోజులు అగరొత్తులుగా వెలిగినయ్‌.వాగ్దానాల పూసలు దవనపు వాసనలైనై.సెలవులయి పోయినయ్‌. వొచ్చినంత వేగంతో తిరిగి దూరపు కాలేజీ పుస్తకాల్లోకి పారిపోయాడు వాడు.వెళ్ళిపోయేప్పుడు కిటికీలు ముయ్యలేదు. తలుపు దగ్గరికయినా వెయ్యలేదు. కలలు కళ్ళని కమ్మేస్తే గుండెని బార్లా తెరిచి, గాయం చేసి వెళ్ళిపోయాడు.గుమ్మం దగ్గరే మొక్కగా వుండగానే మానైపోయి, వాడికోసం రెప్పలు పీకేసిన కళ్ళతో వెతికింది ఆ పిల్ల.ఆ తర్వాత ఆ గుమ్మం దగ్గరికి రకరకాల తాళాల వ్యాపారులొచ్చారు. వాళ్లంతా తాళాల దొంగలే తప్ప గుండె చప్పుడు వినగల్గిన వాళ్ళు కాదు. కొందరు పాత తాళాలకి కొత్త తాళాలు అమ్మే వాళ్ళయితే మరికొందరు కొత్త తాళాల్ని త్వరితంగా తుప్పు తాళాలుగా మార్చేసే వాళ్లే. ఆ ఇనుప వ్యాపారులందరికీ యినప బీరువాలు తెరవగలిగిన తాళాలు కావాలి అంతే.