ఉదయం ఎనిమిది గంటలు అయ్యింది.మట్టిరోడ్డు మీద నడిచి వెళుతూ వరుసగా ఉన్న గుడిసెలు దాటి సూరిబాబు ఇంటి ముందుకొచ్చేసరికి వాళ్ల నాన్న అరుపులు వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో సూరిబాబు నసుగుడు..వాళ్లమ్మ ముక్కు చీదడాలు వినబడుతున్నాయి. ఉండ బట్టలేక ముందు గుమ్మం దాటి వాళ్ల దొడ్లోకి ప్రవేశించాను. అది విశాలమైన దొడ్డి. చుట్టూ ప్రహారి గోడ మధ్యలో పెంకుటిల్లు. ఓ వారగా గేదెల పాక. గుమ్మానికెదురుగా పెళ్ల అరుగు. దానికి కొంచెంఅవతల గడ్డిమేటు. దాని మీద పచ్చగా ఉన్న ఆనప్పాదు. ఆనప్పాదు నిండా చిన్న చిన్న పిందెలు మంచుకి తడిసి మెరుస్తూ ఉన్నాయి. పాలేరు పాలు పితుకుతున్నాడు.సూరిబాబు వాళ్లమ్మ పొయ్యి రాజేస్తోంది. వాళ్ల నాన్న గుమ్మం పక్క పడక కుర్చీలో కూర్చుని పొగ గుపగుపమని వదులుతున్నాడు. 

మధ్యమధ్యలో సూరిబాబుకేసి చూసి మళ్లీ ఏదో గొణుక్కుంటున్నాడు.సూరిబాబు నన్ను చూసి‘‘రండి మాష్టారు’’ అని లేచి నుంచున్నాడు. ఆ మాట విని సూరిబాబు నాన్న స్వామి నాయుడు ఇటువైపు తిరిగి‘‘రండి..రండి..మాష్టారు. ఇయ్యాలపడు ఇలా వచ్చారేంటి ఏవన్నా ఇశేసవాఁ’’ అన్నాడు.‘‘అబ్బే ఏమీ లేదండీ..అలా స్కూలు కేసి నడుస్తుంటే మీ మాట వినబడి ఇలా వచ్చాను’’ అన్నాను. సూరిబాబు చెక్క కుర్చీ తెచ్చి వేశాడు. కూర్చున్నాను.‘‘ఏవుందండీ రోజూ ఉండే బాగోతమే.. ఈడి సదువై రెండేళ్లయ్యిందాండి. ఇయ్యాల వరకూ పని లేదు పాటూ లేదు. రోజూ పేపరెతకడం. దానికీ దీనికీ కాయితాలెట్టడం. దానికి నాకాడ వందలొందలు డబ్బులు గుంజడం’’ అన్నాడు.‘‘అవునండీ.. నాయుడు గారూ..మరి చదువుకున్నాడు కదా. ఉద్యోగం వెతుక్కోవాలి కదా’’ అన్నాను.‘‘ఏం ఉజ్జోగవండీ! చదువైన కాడ్నించీ సూత్తానే వున్నా. ఎల్టం,రావటం..నా కాడ డబ్బులెట్టుకెల్టం అంతే కదా! ఇంత వరకూ ఏమీ పనవ్వలేదు. పోనీ నాతో పొలం రారా అంటే రాడు’’ అని ఉక్రోషంగా అన్నాడు. మళ్ళీ ఆయనే అన్నాడు.‘‘వచ్చి మాత్రం ఏం చేస్తాళ్ళేండి. ఎదవకి చేలో ఏసింది గడ్డో వరో కూడా తెల్దు’’ అన్నాడు. అని పడక్కుర్చీలోంచి కాస్త ముందుకు వంగి కాస్త గొంతు తగ్గించి ‘‘మీకు నాకు చనువు కదా అంచేత అసలు ఇసయం సెప్తున్నా. ఏటంటేనండీ మావోళ్లలో ఇంతకాలం పెళ్లవకుండా ఉండదండీ. ఈ మద్దెన సంబంధాలొత్తన్నాయి. ఈడేమో ఉజ్జోగం రావాలంటాడు.

అదెపడొత్తదో, ఈడి పెళ్లెపడవుద్దో, నాకు మనవడెపడొత్తాడో..’’అని నిర్వేదంగా నిట్టూర్చాడు. ఒకసారి ఆగి, ‘‘అసలు బతికుండగా అవుద్దంటారా?’’అపడాయన ముఖంలో చూశాను. ఎన్నాళ్లనుంచో బాధను దాచుకుని, అది బాగా ఆత్మీయులైన వారికి చెప్పిన తరువాత ఎంత ప్రశాంతంగా, తేలికపడ్డట్టుగా ఉంటుందో అలా వుంది. సూరిబాబుకి ఉద్యోగం రాలేదనీ, అతడు పనీపాటా లేకుండా తిరుగుతున్నాడనీ, అందుకే నాయుడు బాధపడుతున్నాడనీ ఇన్నాళ్ళూ అనుకున్నాను. ఇపడు అతని మనసులో ఉన్న నిజమైన బాధ నాకర్థమైంది.