ఒకడు జీవితమంతా పాపాలు చేసి చనిపోయే ముందు కొడుకుని ‘నారాయణ’ అని పిలిచాడు. అతడి పాపాలన్నీ నశించి వైకుంఠానికి వెళ్ళాడు. ఒక దొంగ శివరాత్రి నాడు తిండి దొరక్క ఉపవాసం చేసి, దొంగతనానికి గుడికెళ్ళి, జనమున్నారని రాత్రంతా జాగరణ చేసి, వెలుగు కోసం దీపం వెలిగించి, ప్రమాదవశాత్తు మరణించాడు. అతడి పాపాలన్నీ నశించి కైలాసానికి వెళ్ళాడు.

ఇంకా..ఎందరో పాపాత్ముల్ని శుద్ధి చెయ్యడానికి దివి నుంచి భువికి దిగి వచ్చింది గంగ.పాపాత్ములకే నరకబాధ తప్పించుకునే ఉపాయాలు చెప్పిన అపూర్వ సంస్కృతి మనది. అటువంటి మన సమాజంలో నేరం చేసిన సామాన్యులు జన జీవన స్రవంతిలో కలిసిపోయే ముందు కారాగార శిక్ష అనుభవించాలా?ఇలా ఆలోచిస్తున్న నాకు తెలిసింది ‘గంగాజలం’ అనే స్వచ్ఛంద సంస్థ గురించి.‘గంగాజలం’ ఆధ్వర్యంలో ఎన్నో విద్య వ్యాపార, వినోద, ఆరోగ్య ఆధ్యాత్మిక వ్యవస్థలు నడుస్తున్నాయి. సమాజంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎవరైనా వాటిలో వేటినైనా ఎన్నుకోవచ్చు. నేరచరిత్ర కలవారు కూడా ఆ సంస్థ ద్వారా కొత్త జీవితం ప్రారంభించవచ్చు. కొత్తగా నేరాలకు పాల్పడ నంత వరకూ ఆ నేరస్థుల గతం గుట్టుగా ఉంచ బడుతుంది.ఇటీవలే ఆ సంస్థ పలు దినపత్రికల్లో ఓ ప్రకటన ఇచ్చింది.

‘‘తప్పు చెయ్యడానికి లక్ష కారణాలుంటాయి. కానీ వాటిలో ఏ ఒక్కటీ సరైనది కాదు.తప్పులు కొందరే చేస్తారు. ఆ కొందరూ అందరితో కలవలేరు. కలవాలన్న తపన మాత్రం ఆ కొందరిలో అందరిలోనూ వుంటుంది.తప్పు సుఖానివ్వదు. అది మనిషి మనసులో చేరి నిప్పులా కాలుస్తుంది. ఆ నిప్పుని చల్లార్చగలిగింది పశ్చాత్తాపం ఒక్కటే!తప్పుకి శిక్ష ఉంటుంది. పశ్చాత్తాపం తప్పుని కడిగెయ్యగలదు కానీ శిక్షను తప్పించలేదు.శిక్ష ఎవరికీ నచ్చదు.. తప్పు చేసిన వారికి కూడా! శిక్షకు ఇష్టపడకపోవడం వల్లనే నేరస్థులు తప్పు ఒప్పుకోక కలకాలం నేరస్థులుగా ఉండిపోతున్నారు.మీరు మీ తప్పు ఒప్పుకోండి. శిక్షను తప్పించుకోండి. జనజీవనస్రవంతిలో కలిసిపొండి. ‘గంగాజలం’ మిమ్మల్ని పునీతుల్ని చేస్తుంది.’’ఈ ప్రకటన చదివి ఆలోచనలో పడ్డాను. అందులోని మాటలు చాలా వరకూ నాకూ వర్తిస్తాయి. కొన్ని నా కోసమే వ్రాశారా అనిపిస్తాయి..