చక్రవర్తిగారు వజ్రవైఢూర్యాలు తాపడం చేసిన తన బంగారు సింహాసనం మీద ఠీవీగా కూర్చుని ఉన్నారు. ధగధగ మెరిసే చీని చీనాంబరాలు, మెడలో విలువైన దండలు, భుజం మీద బంగారు భుజకీర్తులు, తలమీద నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటం, కోరమీసంతో అందంగా, బలంగా, ఆరోగ్యంగా ఉన్నాడు ఆళీున.రెండువైపులా ఆయనకు వింజామరలు వీచే సేవికలున్నారు. ఆయనకు ఎదురుగా బంగారు పళ్లెరాలలో ఎర్రగా నిగనిగలాడుతున్న యాపిలు పండ్లు, తెలుపు, నలుపు రంగుల్లో మెరిసే ద్రాక్ష, దానిమ్మ పండ్లు, బత్తాయి పండ్లు, ఇంకా అనేక రకాల ఫలాలున్నాయి. ఆయనకు దాహమయితే సేవించడానికి బంగారు లోటాల్లో ద్రాక్షసారాయి ఎదురు చూస్తూ ఉంది.సభ నిండుగా ఉంది. చక్రవర్తిగారు ఎదురుగా ఉన్న పళ్లెంలోంచి ఒక పెద్ద యాపిలు పండు చేతిలోకి తీసుకున్నారు. దాన్ని విచిత్రంగా పైకి ఎగరేసి పట్టుకున్నారు. ఆయనకు ఎదురుగా సింహాసనం మెట్ల క్రిందుగా ఒకింత దూరంలో ఒక బీదవాడు నిలబడి ఉన్నాడు.బీదవాడు చినిగిన బట్టలు వేసుకుని ఉన్నాడు. అవి చినిగి ఉన్నా ఎంతో శుభ్రంగా ఉన్నాయి. బీదరికం కొట్టొచ్చినట్లు ముఖం పీక్కుపోయి ఉంది. కళ్లు మాత్రం కాంతివంతంగా ఉండి ఇతనొక మేధావి అన్నట్లు స్ఫురిస్తున్నాయి. జుట్టు రేగి ఉంది. భుజాన ఒక జోలెలాంటి సంచి తగిలించుకుని ఉన్నాడు.‘‘ఆ... ఏమిటి? నీ బాధ ఏమిటో వివరించు’’ చక్రవర్తిగారు మరొకసారి యాపిలు పండును గాలిలోకి ఎగరేసి పట్టుకున్నారు.‘‘అయ్యా. నేనొక బీదవాడిని. 

బీదవాడికీ ఒక పేరంటూ ఉంది. అది ఉన్నా లేకపోయినా ఈ దేశంలో ఒకటే. ఈ దేశంలోని అనేక కోట్ల బీదవాళ్లకు ప్రతినిధిని నేను. నన్ను బీదవాడనే పిలవండి. ఈ మహా సామ్రాజ్యానికి మీరు చక్రవర్తి. మీకు నా కష్టాలు విన్నవించుకోడానికి వచ్చాను.’’‘‘విన్నవించుకోండి. విన్నవించుకోండి’’ అన్నాడు చక్రవర్తి విలాసంగా మరొకసారి యాపిలు పండు ఎగరేస్తూ.‘‘మహా ప్రభూ, గత సంవత్సరం మా ప్రాంతంలో వర్షాల్లేవు. ఆ కారణంగా మాకు పంట లేదు. అంతేకాదు పశువులు మేయడానికి గడ్డికూడా లేదు. ఇది ఇలా ఉంటే మీ భటులు నిర్ధాక్షిణ్యంగా పొలాలకు శిస్తు అడుగుతున్నారు. పశువులకు పుల్లరి కట్టమని బెదిరిస్తున్నారు. పంటలు లేక ధాన్యం ఇళ్ళకు రాక తిండికే కష్టంగా ఉంటే శిస్తులు ఎలా కట్టగలం మహాప్రభో. పచ్చిక మొలవక ఎండిపోయిన బీడు స్ధలాల్లో, పశువులు ఏం గడ్డి తిన్నాయని పుల్లరి కట్టాలి’’ దీనాతి దీనంగా అన్నాడు ఆ బీదవాడు.అతని మాటలు వింటున్న సభికులు బీదవాడివైపు జాలిగా చూశారు. కాని నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడలేకున్నారు. చండ ప్రచండుడైన చక్రవర్తిని చూస్తే వాళ్లకు వెన్నులో చలి.