సమయం మధ్యాహ్నం రెండయింది. ఆకాశం అకస్మాత్తుగా నల్లమబ్బులతో మూసుకుపోయి, ఈదురుగాలులు మొదలయ్యాయి. కూలికెళ్ళిన సూరి ఇంటి ముఖం పట్టాడు. సగం దూరం వచ్చేసరికి తుంపరగా మొదలయిన వాన ఉధృతంగా మారడంతో పూర్తిగా తడిసిపోయాడు. వాన చినుకులు ముళ్ళలా గుచ్చుకుంటుంటే... చలికి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.వేగంగా పరిగెత్తుకుంటూ ఇంటికి దగ్గర్లో ఉన్న సిమ్మాచెలం టీ కొట్లోకి చొరబడ్డాడు.‘‘ఏందిరా! సూరీ! బాగా తడిసిపోయినావే! రా! రా! టీ గావాల్నా?’’ అడిగాడు సిమ్మాచెలం.‘‘ఆఁ... ఒకటిచ్చీ...’’ అన్నాడు వణుకుతూ. పక్కగా నిలబడి తలకి చుట్టిన తుండు తీసి, పిండుకుని, చేతులు, మొహం తుడుచుకున్నాడు.అంతలో సిమ్మాచెలం వేడిగా టీ ఇచ్చాడు. రెండు గుక్కలు టీ లోపలికి పోగానే వానతో బాటు వెంటొచ్చిన చలికి కాస్త ఉపశమనం కల్గినట్టయింది.మండుతున్న పొయ్యి మీదున్న బాండీలో ఉల్లి పకోడీ వాయవేశాడు సిమ్మాచెలం. సూరి పొయ్యి దగ్గరగా వచ్చి కొంకర్లు పోతున్న అరచేతికి సెగ చూపుతున్నాడు.‘‘వోన పెద్దదయ్యేలాగుంది... తగ్గేట్టు లేదు’’ అన్నాడు సిమ్మాచెలం.‘‘అవునన్నా’’‘‘పకోడి ఏడిగా ఉంది ఇచ్చేదా?’’‘‘పొట్లం కట్టియ్యన్నా! మంగకి ఇస్టం’’ అన్నాడు డబ్బుల్దీసిచ్చి.వర్షంలోనే బయల్దేరుతున్న సూరితో ‘‘వాన తగ్గనీరా! తడిసిపోతావ్‌’’ అన్నాడు... సిమ్మాచెలం.‘‘నిండా తడిసినోణ్ణి. ఇప్పుడు కొత్తగా ఏం తడుస్తాను?’’ అని వేగంగా పరిగెత్తుతూ... ఇల్లు చేరాడు.

ఓరగా వేసున్న ఇంటి తలుపు తోసుకుని లోపలికొచ్చాడు సూరి. చాప మీద పడుకున్న మంగ గాఢ నిద్రలో ఉంది. అస్తవ్యస్తంగా మోకాళ్ళ పైకి జరిగిన చీరె, ఎదమీద పక్కకి తొలగిన పైట, ఉచ్ఛాస నిశ్వాసాలకు అనుగుణంగా ఊగుతున్న ఉదరం, మధ్యలో చిన్నలోయలాంటి బొడ్డు... మంగ పడుకున్న భంగిమ చూసిన సూరి... తను పూర్తిగా తడిసిపోయిన సంగతి మర్చిపోయి... దండెం మీద ఆరేసిన పొడి తుండు తీసుకుని, మొహం, చేతులు తుడుచుకుని, మెల్లగా మంగ పక్కకి చేరి... గట్టిగా హత్తుకున్నాడు. ఉలిక్కిపడి లేచి, కళ్ళు తెరిచి అరవబోయిన మంగని మాట్లాడనీయకుండా... తడిపెదాలతో నిశ్శబ్దం చేశాడు. వర్షంలో తడిసొచ్చిన మొగుడికి తనువుతో చలిమంట వేసి... క్షణాల్లో వేడి ప్రకంపనలు పుట్టించింది.ఐదు నిమిషాల అలజడి అణిగిన తర్వాత... పక్కకి పడుకున్న సూరి ఛాతీ మీద తలాన్చి.. పడుకున్న మంగ..‘‘మావాఁ... తడిసిపోయి వచ్చినవు.. అన్నం పెడ్త... లే!’’ అంది.‘‘ఇంక అన్నం దేనికే.. ఆశ దీరా ఆకలి దీర్చేసినావు...’’ అన్నాడు ఆమె తల నిమురుతూ...ఇద్దరికీ పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు. గోదారొడ్డు నున్న కూనవరంలో ఊరి చివర ఇంట్లో ఉంటారిద్దరూ. సూరి కూలి పన్లకెళ్తుంటాడు. దూరబ్బంధువుల పిల్ల మంగని మోజుపడి మనువాడాడు. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం. ఎంత మందిలో ఉన్నా శరీరసుఖం కావాలనుకున్నప్పుడు... వాళ్ళిద్దరికే అర్థమయ్యేట్టు... చలిమంట ముందు చేతులు కాపుకుంటున్నట్టు... చేతులతో సౌంజ్ఞ చేసుకుంటారు.