మా అమ్మ అత్తగార్ల హయాంలో అంటే సుమారు పాతికేళ్ళ క్రితం మా ఇల్లు విజయవాడ రైల్వేస్టేషనులా ఉండేది. ఇప్పటికీ మాది అదే ఇల్లు. ఇప్పుడెవరైనా ఇద్దరు ముగ్గురు చుట్టాలుంటే మూడు రోజులకే ఉక్కపోస్తున్నట్లు, ఊపిరాడనట్టు, అన్నిటికీ ఇరుకడ్డం వచ్చినట్లు ఉంటుంది. మరి ఆ రోజుల్లో రోజుకి కనీసం ఇరవై విస్తళ్ళు లేచేవి. ఇంట్లో అతిథులు రాత్రి తొమ్మిదయ్యేసరికి వీధి గదిలోనో, డాబా మీదో చోటు చూసుకుని హాయిగా సెటిలయ్యేవారు.ఈ హడావిడిలో నా పిల్లలు ఎక్కడున్నారో కని పెట్టడం కష్టంగా ఉండేది.

 వాళ్ళు కూడా సాధ్యమై నంతవరకు నా కళ్ళల్లో పడకుండా తప్పించుకుని తిరు గుతూ ఉండేవారు. ఇంక వాళ్ళ చదువులు స్కూల్లో ఎంత చెప్తే అంత. వీళ్ళు ఎంత వింటే అంత. ‘‘ఇలా ఓ రోజు పెళ్ళిచూపులనీ, ఓ రోజు తాంబూలాలనీ, భజన లనీ, మీటింగులనీ, పుట్టినరోజులనీ ఇల్లు ఫంక్షను హాలులాగా ఉంటే నీ పిల్లల చదువులేమవుతాయో ఆలో చించుకో’’ అని ఒక తల్లిగా నా బాధ్యతలు గుర్తు చేస్తూ ఉండేది మా అమ్మ. నా పిల్లల తెలివితేటల మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉండేది. కాబట్టి పరీక్షల ముందు ఒక వారం రోజులపాటు కూర్చోబెట్టి చదివిస్తే పాసైపోతార్లే అని ధైర్యంగా ఉండేదాన్ని!మా నాన్న వైపు బంధువు ఒకాయన విశాఖ పట్నంలో ఉండేవారు.

చాలా రకాల వ్యాపారాలు చేసి సంపాయించుకున్నదాన్ని జాగ్రత్తగా పదిలపరుచు కుని పెద్ద మనిషయ్యాడు. నెలకో, రెండు నెలలకు ఒక సారో కోర్టు పనులమీద హైదరాబాద్‌ వచ్చేవాడు. తను వచ్చిన పని పూర్తైపోగానే నాకు ఫోన్‌ చేసి, ‘‘అమ్మాయ్‌! మొన్న పొద్దున్న ఈ ఊరొచ్చాం. మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాం. సాయంత్రం ఓ సారి అటు వైపు వద్దామనుకుంటున్నా! రమ్మంటావా? బావ గార్ని చూడాలని ఉంది ఎలా ఉన్నారు?’’ అని అడిగే వాడు.