సందేహమవసరం లేదు.అవును...మీరనుకుంటున్నది .. నిజమే.చైతన్యపురి... పేరు వినగానే భాగ్యనగరంలో వున్న వారికి అర్థమయేదేమిటంటే దిల్‌షుక్‌ నగర్‌ తరువాయి బస్‌స్టాప్‌గా మెదడులో కదలాడుతుంది.ఓ మిత్రుని ఆహ్వానం మేరకు ఒకప్పుడు చైతన్యపురిలోని సాయినగర్‌లో వున్న వాళ్ళింటికి వెళ్ళి రావడం జరిగింది. అప్పుడు మిత్రుని ఇంటిని కనుగొనడానికి ఓ చెట్టు ఆనవాలుగా చెప్పడం. బస్‌స్టాప్‌లో దిగి, ఎడమవైపు నడుస్తూ సాగగానే ఓ పెద్ద చెట్టు గంభీరంగా అగుపించడం అత నింటికి సులభంగా చేరడం జరిగింది.నాలుగేళ్ళు గడిచింది. మళ్ళీ ఇప్పుడు ఆ స్నేహి తుని ఆహ్వానం మేరకు వాళ్ళింటికి బయలుదేరడం జరిగింది.బస్సుదిగి ఎడమవైపు నడుస్తున్నానేగాని వీధిని గుర్తుపట్టడానికి చెట్టు అగుపించడం లేదు. చాలా సేపు అటుఇటు తిరగడం, తటపటాయించడం జరిగింది.కారణం...మనిషి గుర్తు పెట్టుకునేది, స్మ ృతిలో చోటు చేసుకునేవి చాలా బలమైన, ఎత్తైన, విశాలమైనవిగా వుంటాయి.

 ఆ ప్రాంతం పేరు చెబితే, అవే మొదట గురుతొస్తాయి.భాగ్యనగరం అంటే చార్మినార్‌, మైసూర్‌ అంటే మహరాజ ప్యాలెస్‌, కలకత్తా అంటే హౌరా బ్రిడ్జి, తిరుపతి అంటే వెంకటేశ్వరుడు, శ్రీశైలం అంటే శివుడు గుర్తుకు రావడం సహజం.అలాగే.. నాకు ‘చైతన్యపురి’ అంటే ఓ పెద్ద చెట్టు మొదట గుర్తు వస్తుంది... కానీ.. ఏదీ? ఎవరినైనా అడుగుదామని అనుకుంటుండగానే.... అంతలోనే నా మిత్రుడు నాకు ఎదురుకావడం జరిగింది.కుశలాలు అడగకనే..‘‘ఇక్కడ ఒక చెట్టు వుండాలే.. ఏమయింది.. భాయూ..’’ అడిగాను.‘‘ఈ ఉదయమే కొట్టేశారన్నా...’’ మిత్రుడు.‘‘అంత పెద్ద చెట్టుని కొట్టేశారా? ఎవరూ అబ్జక్షన్‌ చేయలేదా?’’ ప్రశ్న మీద ప్రశ్న వేశాను.

‘‘అన్నా.. కార్పొరేషన్‌ వాళ్ళొచ్చారు.. పట్టపగలే కొట్టేశారు’’ మిత్రుడు.చెట్టు కొట్టేటప్పటి దృశ్యం నా కళ్ళలో కదలాడింది.చెట్టు మొదల్ని రంపంతో కోస్తుంటే మేక గొంతును కోసేటప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుని చూసేట్టు చూసుంటారు, జనం.చెట్టును ముక్కలు ముక్కలుగా గొడ్డలితో నరికేటప్పుడు కళ్ళు పెద్దవి చేస్తున్నప్పుడు కళ్ళప్పగించి ఆ మాంసపు కండల్ని చూసినట్టు చూసి ఉంటారు జనం.పాములాడించే మంత్రగాళ్ళు ఓ బుట్టలో చిన్న పాపను పెట్టి, బుట్టపై మూత పెట్టి ఓ గుడ్డ కప్పి ఓ కర్ర (మంత్రదండం)తో మూడుసార్లు బుట్ట చుట్టూ తిప్పి కళ్ళు మూసి కళ్ళు తెరిచేటంతలో పాపను మాయం చేస్తే చూసి ఆశ్చర్యపోయినట్టు చూసింటారు జనం.