సరిగ్గా రేవతి స్కూలు నుంచి ఇంటికి వచ్చిన పదినిమిషాలకు ఆమెకు శిఖామణి ఫోన్‌ చేసి మాట్లాడాడు. ఆ రాత్రి ఏడు గంటల తర్వాత ఆ వూరికి వస్తున్నట్టుగా రేవతికి చెప్పాడు.శిఖామణితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత రేవతి పక్కనే వున్న ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో వున్న శకుంతల గారికి తనని ప్రేమిం చిన శిఖామణి తన వూరి నుంచి అక్కడకు వస్తున్న విషయాన్ని చెప్పి సరిగ్గా రాత్రి ఏడు గంటలకు ఆమెను తన ఇంటికి తప్పకుండా రమ్మని చెప్పింది. ఆ తర్వాత తన ఇంట్లోకి వచ్చి బెడ్‌ మీద వాలిపోయింది.అతను అంత హఠాత్తుగా ఎందుకు వస్తున్నాడనే ఆలోచన రేవతిలో లేదు. ఎందుకంటే ఆర్నెల్ల క్రితం ఇద్దరూ విడిపోయారు. ఉద్యోగరీత్యా రేవతి ఆ మండల కేంద్రానికి వచ్చి ఆ వూరి ఎలిమెంటరీ స్కూల్లోనే టీచర్‌గా జాయినయింది. తర్వాత ఈ ఆర్నెల్లలో వాళ్లిద్దరి మధ్య నాలుగయిదు ఉత్తరాలు చోటు చేసుకున్నాయి. నెల రోజుల క్రితమే రేవతికి టెలిఫోన్‌ కనెక్షన్‌ వచ్చింది. అప్పటి నుంచి ఓ మూడుసార్లు ఫోన్‌లో కుశలమూ, వగైరా....తనని చూడాలని శిఖామణికి బలంగా అనిపించి వుండవచ్చు.

 అతను ఏదైనా అనుకుంటే ఆ పని చెయ్యడానికి ఆలస్యం చేసే మనిషి కాదు. ఈ విషయం రేవతికి బాగా తెలుసు. శిఖామణి గుంటూరులో ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లికాలేదు. వాళ్ల వీధిలోనే వుండే రేవతితో కొన్నాళ్ల క్రితం ప్రేమలోకి దిగాడు. చదువుకున్న వాడు, ఓ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చూడడానికి కొంచెం బాగానే ఉండే శిఖామణి ప్రేమను తిరస్కరించే కారణం ఏదీ కనిపించక రేవతి కూడా అతన్ని ప్రేమించింది.తండ్రి దగ్గర్నించి తన పెళ్లి గురించి ఉత్తరం రావడం వల్ల శిఖామణి రేవతితో తన పెళ్లి విషయం సత్వర నిర్ణయానికి వచ్చే విషయం గురించి ఆమె ఉద్యోగం చేస్తున్న వూరికి ప్రయాణం కట్టి తను వస్తున్న విషయాన్ని ముందుగా ఆమెకు తెలియజేశాడు. అంతకు మించి తన మనసులో ఏమీ లేదని ఆమెకు ఫోన్‌ చేస్తున్నపడు కూడా అనుకున్నాడు. ఓ మూల నుంచి తలెత్తుతున్న ఏదో శంకను బలవంతంగా అదిమిపెట్టి.ఆ పల్లెటూరిలో రేవతి రెండు గదులు, ముందు వరండా వున్న పెంకుటింట్లో అద్దెకు వుంటున్నది ఒంటరిగా. ఆమె ఆ ఇంట్లోకి వస్తున్నపడు పక్కింట్లో వుండే శకుంతల అడిగింది రేవతిని.‘‘ఒక్కదానివే వుండడానికి భయంగా వుండదూ?’’పలుచగా నవ్వి ‘‘భయమెందుకు పిన్నీ. మీరంతా వున్నారు గదా. నాకెందుకు భయం ’’అంది రేవతి.