నరకం, భూమి, స్వర్గం అనే మూడు కాలాలలో ఆలాపన)నరకంరాత్రి పదకొండు గంటలయింది. ఇంకొక గంట. ఇంకొక్క అరవై నిమిషాలు. సరిగ్గా పన్నెండు కాగానే చచ్చిపోదలచుకున్నాను. అన్నీ ఆలోచించుకున్నాను. ఇప్పుడా? ఆరు నెలలనుంచీనా కిదే ఆలోచన. ఆరు నెలల నుంచీ సిద్ధమవుతున్నాను. ఇప్పటిదా యీ నిశ్చయం, ఆరు నెలల కిందటే తెగించాను. అప్పటినుంచీ నాకిదే ఆలోచన. నిశ్చయాన్ని మార్చుకుందామని కాదు. ఆరు నెలలు ఆహోరాత్రాలు జాగ్రత్సుషుప్తులలో ఎడతెగని యోచనా తరంగాలలో నా నిశ్చయాన్ని స్నానం చేయించాను. ఆరు నెలల అవభృద స్నానంలో పవిత్రీకృతమైన నా అందమైన, నా ఆడుకునే, నా తిరుగులేని, భయంకరమైన సంకల్పాన్ని ఈ రాత్రి ఆచరణలోపెడుతున్నాను.ఈ రాత్రి నా ఆత్మహత్యా మహోత్సవం. ఇది ఆహ్వాన పత్రిక కాదు. ఈ ప్రదర్శనకి ప్రేక్షకులు అనవసరం. ఇది నా సొంత వ్యవహారం. ఇతరులు లోనికి రాకూడదు.మరణించాలని నిశ్చయించుకున్నాను. సరిగ్గా ఈ రాత్రి పన్నెండు గంటలకి చచ్చిపోవాలని సంకల్పించుకున్నాను. ‘‘ఈ రాత్రి పన్నెండు కాగానే. ఈ రాత్రే ఎంచేత? పన్నెండుకే ఎందువల్ల? అసలు చచ్చిపోవడం ఎందుకు? చచ్చిపోతూన్న ఓ వ్యక్తీ! నువ్వెవరు?’’నేనెవరు? అనవసరం. అయితే ఈ రాతకూడా అనవసరమే? పోనీ నే నెవరో చెప్పనా? ఎవరికి చెప్పను? ఎందుకీ రాత? అదే. ఈ రచన ఎందుకో. ఎవరికో తేల్చుకుందామని చచ్చిపోతున్నాను. ఆరు నెలలుగా చచ్చిపోతున్నాను. ప్రతీ దినం ఆధ్యాత్మికంగా చచ్చిపోయాను. ఈ రాత్రి భౌతికంగా. త్వరలో నేను చెయ్యబోయే ఆఖరు అభినయం నా వాక్యానికి ఫుల్‌స్టాప్‌. నా కావ్యానికి పరిసమాప్తి.జీవితాన్ని అర్థం చేసుకోవడానికి జీవించటమే అవసరం అనే సునాయాసపు సూత్రం నిరాకరించి మరణం ఇందుకు నా మార్గంగా ఎంచుకున్నాను. 

ఇది ఎవరికీ బోధపడదు. ఎవరికీ బోధ పరచలేనని కూడా నే నెరుగుదును. అయినా నా ఈక్వేషన్‌ కిదే సొల్యూషన్‌.అదే పొరపాటు. నేనొక రచయితననీ, రాతలో ప్రకాశించలేక చచ్చిపోతున్నాననీ అనుకోవద్దు. ఈ చేతులతో నా ఎనిమిది వందల పేజీల నవలని దగ్ధం చేశాను. నాకు రాత చేతకాదని ఎవరూ అనరు. నేనసలే అనుకోలేదు. కీర్తిదాహం తీరకపోవడం నా ఆత్మహత్యకి కారణం కాదు. ప్రేమలో పరాజయం కారణం కాదు. ధనాభావం అంతకన్నా కారణం కాదు.ఎంచేతనంటే! మా నాన్నకి బోలెడంత ఆస్తి ఉంది. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు? రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. (లంచాలంటావా? అనుకో) నేను ప్రేమించిన స్త్రీ నన్ను అంగీకరించింది. మా వివాహం విషయంలో మా తల్లిదంద్రులు మాకు సంపూర్ణ స్వాతంత్య్రం ఇచ్చారు. నన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి అందమూ చదువూ, డబ్బూ తెలివీ ఉన్నాయి. జీవించాలనుకుంటే రేపే ఆమెను పెళ్ళి చేసుకో గలను. నా వయస్సు 24 ఏళ్ళు. నా బదుకంతా ముందే వుందని నాకెవరూ చెప్పనక్కరలేదు. నాకే కీర్తి కావలిస్తే నా నవల ప్రకటించి ఉందును. నేను రచయితనే కాదు. చిత్రకారుణ్ణి. నా చిత్రాలు ప్రదర్శించి ఉందును. (వాటిని కూడా నాశనం చేశాను. కాని అంతకన్నా మంచివి చిత్రించగలను) నేను చిత్రకారుణ్ణి మాత్రమే కాదు. నాకు సంగీతం కూడా వచ్చును. వయోలిన్‌ వాయిస్తాను. క్రికెట్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ ఆడతాను. నాకు మానవమాత్రుడు కోరుకో దగ్గవన్నీ ఉన్నాయి. నన్ను తెలిసిన వారంతా నాకేమీ లోపం లేదంటారు.