భరతమాత రత్నగర్భ. సందేహం లేదు. దేశ మంతటా నదీనదాలు - అనుమానం అఖ్కర్లేదు. విస్తారంగా పర్వతశ్రేణులు - అటవీసంపద - ఉత్తరాన హిమగిరిశ్రేణులు - పెట్టనికోట గోడలుగా (ఆ కోటకి పడుతున్న బీటలూ - చొరబడుతున్న ముష్కరులూ - అది వేరే కథ)ప్రకృతి మాత చల్లగా చూస్తున్నంతవరకూ పై వనరులన్నీ మనదేశం సుభిక్షంగా వుండేలా కాపాడుతూ వుంటాయి. (మనం కొండల్ని తొలిచి, అడవుల్ని నరికి, నదులన్నీ ఆనకట్టలతో ఎండగట్టి, తల్లీ నీ దయ అంటే ఆ ప్రకృతి మాత్రం ఏం చేస్తుంది?)మానవుడి వికృత కార్యాలకి ప్రకృతి కోపించినప్పుడు వస్తుంది ప్రళయం - అది అగ్నిప్రళయమైనా కావచ్చు - జల్రపళయమైనా కావచ్చు - ఈ మధ్య సముద్రాల్లోనూ అగ్నిపర్వతాలూ ప్రేలుతున్నాయి - సునామీల్ని సృష్టిస్తున్నాయి గనక ఆ తరహా ప్రళయమైనా కావచ్చు!అటువంటి ప్రళయాల్ని నివారించాలంటే మనిషి వికృత చర్యల్ని మానుకోవాలి!అటువంటి ప్రళయాల్ని ఎదుర్కోవాలంటే మనిషి ముందుజాగ్రత్త చర్యల్ని విస్తారంగా చేపట్టాలి!అటువంటి ప్రళయాలు ముంచెత్తినప్పుడు మనిషి విస్తృత సహాయక చర్యలు చేపట్టాలి!ఈ మూడు చర్యల్లోనూ ఏది చేపట్టటానికయినా చిత్తశుద్ధి, కార్యదీక్ష, సాధించాలన్న తపనా వుండాలి.

అవి ఏవీ లేనినాడు మానవజాతి ఆ ప్రళయాలకి తలొగ్గి బలికాక తప్పదు - మాడి మసికాక తప్పదు. మునిగి నశించిపోక తప్పదు.మార్గాంతరం ఏముంది గనక మూడేళ్లుగా అంతో, యింతో సుభిక్షంగా వున్న రాష్ట్రంలో ఈ ఏడాది ఎండాకాలం వెళ్లిపోయినా ఎండలు మాత్రం వెళ్లిపోలేదు! ప్రకృతి ప్రస్తుతానికి వానాకాలాన్ని మర్చిపోయింది! ఫలితం... క్షామం... క్షామం... రాష్ట్రమంతటా క్షామం!పొరుగు రాష్ట్రాలు సహాయం చేస్తాయన్న ఆశతో - ‘‘పొరుగు రాష్ట్రాల వాళ్లూ! పొరుగు రాష్ట్రాల వాళ్లూ!.... మా పొలాలు ఎండిపోయాయి.. మీకు అన్నో, యిన్నో వానలు పడ్డాయిగా! మా నదుల్లోకి నీళ్లు కాసిని మాకు వదలరూ’’ అని బ్రతిమాలారు సర్కారు వారు-’’ పైగా, మీ పార్టీ, మా పార్టీ ఒకటే కూడానూ!’’ అని ముక్తాయించారు.‘‘పార్టీలు ఒకటైనా రాష్ట్రాలు వేరుకదా! పైగా, యివాళ వున్నాయి కదా అని వొలక బోసుకుంటే, రేపు లేని నాడు మాకెవరిస్తారూ?’’ అని దీర్ఘాలు తీశారు పొరుగు రాష్ట్రాల వారు.‘‘నదీజలాల్ని జాతీయం చేయాలని ఎన్నియుగాలుగా మొత్తుకుంటున్నా, ఏ చర్యా చేపట్టనందుకు ఇప్పుడనుభవిస్తున్నాం! అయినా గాలీ, నీరూ ఎవడబ్బసొత్తు’’ అంటూ జాతీయగీతమంత పాత గీతాన్ని మళ్లీ ఆలపించాయి ప్రతిపక్షాలు.ఎవరేమన్నా ఏమనుకున్నా రాష్ట్రంలో పొలాలన్నీ ఎండి ఫెళపెళలాడాయి! పశువులకి గడ్డి కూడా లేక ఎండిపోయాయి!‘‘మీకు ఓట్లు వేసి గెలిపిస్తే, వరుణదేవుడికి ఆగ్రహం వస్తుందని ప్రజలకి తెలీదు పాపం!’’ అని వెటకారమాడారు ప్రతిపక్షం వాళ్లు!