‘‘సుజనా, ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో. మనం సొసైటీలో ఎంతో పరువుగా బ్రతుకుతున్న వాళ్లం. ఎవరైనా చిన్నమాటంటే భరించలేము. అది కూడా ఆడపిల్ల విషయం’’ అన్న అనురూప్‌ గొంతులో అభ్యర్థన.‘‘మీరు అనవసరంగా కలుగజేసుకోవద్దు. అయినా, తను ముచ్చటపడి ఇన్ని సంవత్సరాలూ నేర్చుకున్నది, నాల్గు గోడల మధ్య దాచి వుంచడానికా? అదేం కుదరదు. ఆరు నూరైనా దివ్య ఈ పోటీలో పాల్గొనాల్సిందే. అసలు ఇప్పటికే సెమీ ఫైనల్స్‌లో పది మందితో పోటీపడి, గెలిచింది.అలాంటిది, వైజాగ్‌లో జరిగే గ్రాండ్‌ ఫినాలేకి వెళ్లవద్దనడానికి, మీకు మనసెలా వొప్పిందండీ’’ మామూలుగా మాట్లాడినట్టనిపించినా, భార్య మాటల్లోని పంతాన్ని అనురూప్‌ గ్రహించకపోలేదు.‘‘అర్థం లేకుండా మాట్లాడకు. ఈ స్థాయిలో నాలుగు స్టేజిలుంటాయి. అది కూడా రకరకాల దుస్తులు, అందుకు తగిన పాటలతో. ఇక హావభావాల మాట నీకు తెలియనిది కాదు. నువ్వన్నట్టు, డ్యాన్సు పరంగా మన దివ్య టాపర్‌ కావచ్చు.ఒక్కమారు ఆలోచించు. ఇలాంటి రియాల్టీషోలో పిల్లలు ఎటువంటి కాస్టూమ్స్‌ వాడుతున్నారో గమనించు. ఎంత అబ్సీన్‌గా వుంటున్నాయో నీకు తెలియదా? అలాంటిది. ఒక ఎదిగిన అమ్మాయి అలాంటి డ్రస్‌ వేసుకుని పార్టిసిపేట్‌ చేయడం అవసరమా...’’ పెరిగిపోతున్న కోపాన్ని అతికష్టం మీద ఆపుకుంటూ అన్నాడు అనురూప్‌.‘‘మరీ అంత పల్లెటూరి బైతులా మాట్లాడకండి. 

అయినా, కూతురిగా దివ్య విషయంలో మీకన్నా ఎక్కువ బాధ్యతే నాకూ వుంది. కాని, మీ అంత మయోపిక్‌గా నేను ఆలోచించలేను. అందుకు కారణం, నాకున్న ఎక్స్‌పోజర్‌. లయన్స్‌క్లబ్‌ సెక్రెటరీగా నాకంటూ ఒక రెప్యుటేషన్‌ వుంది. తనను పోటీకి పంపుతున్న విషయం తండ్రిగా మీకు తెలిపానే గాని, మీ అనుమతి ఏమీ కోరలేదు.ఎనీవే, ఈ విషయం గురించి చర్చ అనవసరం...’’ అంటూ, సీరియస్‌గా లేచి, విసవిసా లోపలికి వెళ్లిపోయింది సుజన.అనురూప్‌ మనస్సు చివుక్కుమంది.భార్య మొండితనం తెలిసినా, తనవంతు ప్రయత్నం జరిగింది. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి.ఒక భర్తగా, అనురూప్‌కి ఇలాంటి అనుభవం కొత్తేమీ కాదు!?..అంతకుముందు అనేక సందర్భాల్లో భార్యగా సుజన తన మాటలను లెక్క చేయక పోవడం అతనికి గుర్తు లేకపోలేదు.కాని, అంతకన్నా అతణ్ణి బాధ పెట్టిన విషయం మరొకటుంది. అది, తను ఆలోచించే విధానాన్ని, తన మంకుతనాన్ని అహంభావంతో రంగరించి సుజన, కూతురు దివ్యను పూర్తిగా ప్రభావితం చేయడం.దివ్య వయస్సు సరిగ్గా పదహారు.అంటే, అదొక ట్రాన్సిషన్‌ ఫేజ్‌.ప్రతి అమ్మాయికీ, అబ్బాయికీ అప్పుడప్పుడే సొంత అభిప్రాయాలు, ఆలోచనలు ఏర్పడే వయస్సు.నిజానికి అటువంటి వయస్సులోనే తల్లిదండ్రుల నుంచి అనలెటికల్‌ గైడెన్స్‌ అవసరం. అంటే, విషయాలను విశ్లేషించి, నిర్ణయాలు తీసుకోగల్గిన తత్వాన్ని పెంపొందించ గలగాలి.