‘‘చీకటిని చీలుస్తూ వెలుగు పుట్టిందా-వెలుగుని మింగుతూ చీకటి విజృంభించిందా-అన్నది కాదు ప్రశ్న. చీకటి వెలుగులు రెండూ ఈ సృష్టిలో సహజీవనం చేస్తున్నాయి. అవునా, కాదా?’’ శ్రీకాంత్‌ సూటిగా అడిగిన ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియనివాడిలా వంశీ మౌనంగా వుండిపోయాడు.‘‘మాట్లాడవేం?’’‘‘ఏం చెప్పాలో తెలియడం లేదు...’’‘‘తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ మాట వినాలి...’’‘‘నీతో మాట్లాడటం మొదట్లో ఒక ఎడ్యుకేషన్‌ అన్పించేది. అందుకేనీతో సన్నిహితంగా వుంటన్నాను...’’‘‘ఇప్పుడు నేను ఇంకోలా అన్పిస్తున్నానా?’’‘‘అవును.’’‘‘ఎలా కన్పిస్తున్నాను? విలన్‌లా వున్నానా?’’‘‘అలా అని చెప్పలేను...’’‘‘మరెలా వున్నానో చెప్పు...అద్దంలో మన ప్రతిబింబం కన్పిస్తుంది. ఎదుటి వారి మాటల్లో మన వ్యక్తిత్వం బయటపడుతుంది. నీ మనసులో వున్నదేమిటో నిర్భయంగా చెప్పు....’’‘‘ఇవాళ మన సంభాషణ ఎక్కడ మొదలయింది?’’‘‘మా ఆవిడకి, నాకు మాటపట్టింపులొచ్చి పుట్టింటివెళ్ళిపోయిందన్న విషయం చెప్పి నీ సలహా అడిగాను...’’‘‘అవును కదు? అందుకు నేనేం చెప్పాను?’’‘‘వంట రాని వాడు తిండి మానెయ్యడు కదా? హోటల్లో తిని బతుకుతాడని చెప్పావు...’’‘‘అందులో నీకేం తప్పు కన్పించింది?’’‘‘తిండి వరకు ఫర్వాలేదు. ఈ ఫార్మూలని అన్నిటికీ వర్తింపజేయటం ఎంత వరకు సబబు?’’‘‘ఆకలి, నిద్ర, ఆడదాని సుఖం లేకుండా మనిసి బతగ్గలడా?’’‘‘మొదటి రెండూ సరే. మూడో దాని విషయంలోనే అందరూ రాజీపడలేరు...’’‘‘నేను రాజీ పడుతున్నానా లేదా? మా ఆవిడ తూర్పు-నేనుపడమర. 

ఆవిడకి కాకినాడలో ఉద్యోగం. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం. నేను హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున కూచుంటే, ఆవిడ మహాసాగరం ఒడ్డున కూచుంటుంది. మేం ఫోన్లు కూడా చేసుకోం. ఆవిడ భార్య అని నేను చెబుతుంటాను. నును భర్తని ఆవిడ చెబుతుంటుంది అంతే. ఆవిడ బతుకు ఆవిడది. నా బతుకు నాది...ఎవరి వల్లా ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎవరి సుఖాల్నీ త్యాగం చేసుకోలేదు...’’‘‘అందరూ నీలాగా వుంటారా?’’ వంశీ నిష్టూరంగా అన్నాడు.‘‘అమాయకుడా! ఇంకా నువ్వు పాత కాలంలోనే వున్నావు. స్త్రీని ఇప్పుడు అర్థాంగి, సహధర్మచారిణి, పతివ్రత, సహనశీలి-లాంటి మాటల్ని అసహించుకుంటోంది. శతాబ్దాల తరబడి ఈ మాటల సంకెళ్ళలో బిగించి మమ్మల్ని మోసం చేసారని ఆగ్రహిస్తోంది. ఇప్పుడు స్త్రీ కేవలం సహచరి. సమాన హక్కులున్న ఆత్మాభిమాని...’’‘‘నువెన్నైనా చెప్పు శ్రీకాంత్‌. సమత్వానికి గౌరవప్రదమైన అర్థం వుండాలి. విపరీత అర్థాలుండకూడదు....’’‘‘టైమెంతయింది...’’ ప్రశ్నించాడు శ్రీకాంత్‌.చేతి గడియారం చూసి ‘‘రాత్రి పదిగంటలు..’’ అన్నాడు వంశీ.‘‘అంటే మనం గత మూడు గంటలనుండీ ఒకే విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ఇంకో పది నిముషాలు...ఆ తర్వాత నేను బయలుదేరుతాను. నువ్వు వచ్చినా రాక పోయినా నాకు సంబంధం లేదు....’’‘‘నువ్వు వెళ్ళేది గౌతమి దగ్గరకేనా?’’‘‘సందేహమెందుకు? అక్కడికే...’’