శకుంతలను గూర్చి ఆలోచనలతో ఎంతకూ నిద్ర రావడం లేదు. లేచేసరికి ఆకాశం తెల్లబడిపోయింది. శకుంతల నిన్న పొద్దుటే వచ్చి వెళ్ళింది. అప్పుడప్పుడు వచ్చి... మాట్లాడి వెళుతూ వుంది. రావడం... నాతో మాట్లాడాక గ్రుడ్ల నీరు గ్రక్కుకొంటూ పైట మొహంకేసి వత్తుకొంటూ వెళ్ళడం... అంతా టీ కప్పులో తుఫానులా చల్లబడింది.పత్రికల్లో.... టి.వి. చానళ్లలో శకుంతల ఇటీవల పతాకశీర్షికలకెక్కింది. ఆమె సమస్యలకు పరిష్కారం లభించేదాక మడమతిప్పం అంటూ మహిళా సంఘాల ఉద్యమం ఊపందు కోవడంతో విషయం అందరకూ తెలిసిపోయింది.శకుంతలది జీవిత సమస్య.అది ఒక పురుషుడి వల్లే వచ్చింది. వెంటనే పరిష్కారం సాధ్యం కాకపోవచ్చు. శకుంతల ఎవరో ఆమె కథాకమామీషు ఏమిటో చెప్పే ముందు జయంత్‌ గూర్చి చెప్పాలి. అంతకుముందు మీకు నన్ను నేను పరిచయం చేసుకోవాలి.

ఒక ప్రైవేటు కళాశాల ఆఫీసులో నేను సెక్షను హెడ్డుగా పని చేస్తున్నాను. జయంత్‌ మా కాలేజీలో లెక్చరరుగా చేరాడు. అతనితో కొత్తగా పరిచయం, వ్యక్తిగత విషయాలలోకి వెళ్ళగలిగే సాన్నిహిత్యం ఇంకా లేదు.ఒకరోజు ఆఫీసు పనిలో నిమగ్నమై వున్న సమయంలో...‘‘నమస్తే! సార్‌’’ అన్న పిలుపుతో తలెత్తి చూశాను.. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి ముకుళిత హస్తాలతో నిలబడి ఉంది.‘‘కనుముక్కు తీరు, ముఖంలో కళ..... సింప్లీ సూపర్బ్‌’’ అభినందిస్తున్న అంతరంగం నుంచి బయటపడి ఒక నవ్వు ముఖం పైకొచ్చి ‘‘చెప్పమ్మా ఏమిటి?’’ అన్నాను.‘‘సార్‌ మీతో పర్సనల్‌గా మాట్లాడాలి’’ అభ్యర్థిస్తున్నట్టు... మెల్లగా అంది.

తన సమస్యను నాతో చెప్పుకోవడానికి వచ్చినట్లు... ఎలా చెప్పుకోవాలో తెలియని, సందిగ్ధంలో మొహమాట పడుతున్నట్లు ఆమె ముఖ కవళికల్ని బట్టి గ్రహించగల్గాను.నాతో రావలసిందిగా సూచిస్తూ బయట కారిడార్‌లోకి నడిచాను. నన్నుఅనుసరించి వచ్చింది.రేపటి నుండి ఆఫీసులకు వరుసగా మూడు రోజులు శెలవులు. ఈవాళ హాజరు పలుచగా ఉంది. దీంతో మాకు అక్కడ మాట్లాడుకోవడం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. తలొంచుకుని నేల చూపులు చూస్తూ కారిడార్‌లో నిలబడ్డ ఆవిడతో ‘‘చెప్పమ్మా? నువ్వెవరు? నేను నీకు చేయదగ్గ సహాయం ఏమిటి?’’ అన్నాను.‘‘సార్‌ నా పేరు శకుంతల. నేను లెక్చరరు జయంత్‌ భార్యను’’ నేల చూపులతో తలొంచుకొనే జవాబిచ్చింది.