మా మేనేజర్‌ ఆనందరావు ప్రవర్తన అంతకంతకీ దిగజారిపోతోంది. చిన్నచిన్న విషయాల్లో కూడా కక్కుర్తి పడ్డం మొదలుపెట్టాడు. అతని ఆశకు అంతులేకుండా పోతోందని అంతా అనుకుంటున్నారు. మొన్నటికి మొన్న మా కొలీగ్‌కి ఒంట్లో బాగులేక మెడికల్‌ లీవు అప్లయ్‌ చేస్తే అతను తెచ్చిన డాక్టర్‌ సర్టిఫికెట్‌ సరిగా లేద ని, మెడికల్‌ లీవుకి అంత చిన్న కారణాలు సరిపోవని, దీన్ని తాను మెడికల్‌ బోర్డుకు పంపిస్తే వాళ్లు ఎంక్వైరీ చేస్తారనీ ఇలా రకరకాలుగా భయపెట్టాడు. ఎంతోకొంత ముట్టజెప్పేసరికి వూరుకున్నాడు.ఆనందరావుకి బోలెడు ఆస్తిపాస్థులున్నాయి. భార్య కూడా ఏదో కాలేజిలో లెక్చరర్‌గా చేస్తోంది. అయినా అతనికింత కక్కుర్తి ఎందుకో అర్థం కాదు. ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తుంటే నాకు ఒళ్లు మండిపోతోంది.

 కానీ ఏం చెయ్యగలం? అందునా నాలాంటి సాధారణ ఉద్యోగి అధికారులు చెప్పినట్టు పనిచేసుకుంటూ పోవడం త ప్ప చేసేదేముంది? ఇలాంటివి తెలిసినప్పుడు సంపాదన ఎక్కువైన కొద్దీ తాపత్రయం పెరిగిపోతుందనే విషయం చాలా సందర్భాల్లో నిజమే అనిపిస్తుంది.ఆ రోజు ఆదివారం. విశ్రాంతిగా కూర్చుని పేపర్‌ చదువుకుంటున్నాను. అనుకోకుండా నా కంట్లో పడింది ఆ దృశ్యం. గోడవారగా చీమలు..కవాతు చేస్తున్న సైనికుల్లాగా ఒకే వరుసలో వెళుతున్నాయి. మామూలుగా ఇలాంటి దృశ్యం చూస్తే వెంటనే నేను మా ఆవిణ్ణి కూడా పిలవకుండా చీపురు తీసుకుని వాటిని ఊడ్చి పారేస్తాను. ఈసారి కూడా అలాగే చెయ్యబోతూ ఒక్కసారి ఆగాను. వరుసలో చీమలన్నీ ఏదో పదార్థాన్ని మోసుకుంటూ వెళ్తున్నాయి. పాపం, ఒక చీమైతే దాని సైజుకి రెట్టింపు సైజులో వున్న ఒక తునకను మోసుకుంటూ, తోసుకుంటూ, పట్టు వదలకుండా తీసుకెళుతోంది. నాకు జాలితో పాటు ఆసక్తిగా కూడా అనిపించింది. అవి వాటి పొట్టకూటికోసం కష్టపడి ఆహారాన్ని సేకరించుకుంటున్నాయి. ఎవరైనా తుడిచిపారేస్తే ఒక్క విసురుకు చెల్లాచెదురైపోతామనీ, నలిపిపారేస్తే ఒక దెబ్బకు చచ్చి వూరుకుంటామనీ వాటికి తెలుసో లేదో పాపం. అలాంటి కష్టజీవుల మీద దౌర్జన్యం చెయ్యడం తగదనిపించింది. వాటిని ఊడ్చిపారేసే ఆలోచన మానేసి వాటి వంకే చూస్తూ కూర్చున్నాను.ఆ రోజు మొదలు చీమలబారు కనిపించగానే గమనించడం మొదలుపెట్టాను. అవి ఎలాంటి పదార్థాల్ని తీసుకెళ్తున్నాయి, ఎక్కణ్ణుంచి తీసుకెళ్తున్నాయి, ఎక్కడికి చేరుస్తున్నాయి..లాంటి విషయాలన్నీ కనిపెట్టసాగాను. రాన్రానూ అది నాకెంతో ఇష్టమైన వ్యాపకంగా మారిపోయింది. అయితే ఈ విషయం మా ఆవిడ కంటపడకుండా జాగ్రత్తపడ్డాను. ఎందుకంటే ఆవిడ చూస్తే ఆ చీమల్ని అక్కడ వుండనివ్వదు కదా!ఆఫీసులో సహజంగానే కొన్ని ఫైళ్లు నా సీటుకు వస్తుంటాయి. వాటిని సరిచూసి నేను ఇనీషియల్‌ వేసాకే పైకి వెళ్తాయి. అందువల్ల ఒక్కోసారి సంబంధిత వ్యక్తులు నా దగ్గరికి వచ్చి ఫైలు తొందరగా మూవ్‌ చేయండ ని చెప్పి ఎంతోకొంత ముట్టజెప్పడానికి చూస్తుంటారు.

అలాంటప్పుడు చిరాకు, కోపం కలగడమే కాదు, వాటికంటే ముందు నాకు కలిగే భావం భయం. ఎవడు చూస్తాడో.. చూసి నేను తీసుకోకపోయినా తీసుకుంటున్నాననుకుంటాడేమో? ఇక్కడ కాకపోతే బయట తీసుకుంటానని భావిస్తాడేమో ఇలా ఏవేవో భయాలు. నేను అలాంటి పనులు ససేమిరా చెయ్యనన్న విషయం ఆఫీసులో అందరికీ తెలుసునని నాకు తెలిసినా ఎందుకో ఆ భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే అలాంటి సందర్భాల్లో ‘బాబూ...ఇక్కడ నా పని నేను చేస్తాను. మీకు అంతగా కావాలంటే మేనేజర్‌ దగ్గరికి వెళ్లి డైరెక్టుగా తేల్చుకోండి. నా ఇనీషియల్‌ లేకపోయినా ఆయన సంతకం పెట్టి ఫైలు పంపించగలడు’ అని చెప్పి వాళ్లను వెంటనే అక్కణ్ణుంచి పంపించేస్తాను.