వీధి తలుపెవరో విపరీతంగా బాదేస్తున్నారు. అప్పుడు నేను గంజి వారుస్తున్నాను. నాకు గంజి ఎంతో అవసరం. నావన్నీ కాటన్‌ చీరలే.‘వస్తున్నా’ కేక పెట్టాను.కొంతసేపు తలుపు బాదడం ఆగింది. మళ్ళీ కొంతసేపటికి మళ్లీ మొదలైంది తలుపు బాదడం.గంజి వార్చడం పూర్తయ్యింది. లేచి వెళ్లి తలుపు తీసాను. సుడిగాలిలా ఓ స్ర్తీ లోపలికి దూసుకొచ్చింది. ఆమె ఎవరో నాకు తెలీదు.‘బుజ్జి లేదా?’ అంటూ యిల్లంతా కలయ చూసింది.‘బుజ్జి’ మా ఆయన ముద్దుపేరు. ఆయన తరపు వాళ్లంతా ఆయన్ని అలాగేపిలుస్తారు. బహుశా ఈవిడ మా ఆయన చుట్టం అయి వుంటుంది.ఈవిడ మాపెళ్లికి వచ్చినట్లు లేదు.‘మీ పెళ్లికి నేను రాలేదు’ అదే మాట ఆవిడ కూడా అంది.‘నీకో జోకు తెలుసా! అసలు మావాళ్లంతా నన్ను బుజ్జికిచ్చి చేద్దామనేఅనుకున్నారు.’ నవ్వుతూ తనే అంది.గదంతా కలయ తిరిగింది. కూర్చోడానికి కుర్చీ కూడా లేదు మాయింట్లో.మా యిల్లంతా ఆ గదే. ఓ మూల వంటిల్లు. ఓ మూల చాప పరిచి వుంది. 

నా ట్రంకు పెట్టి బర్రున లాగి దాని మీద చనువుగా కూర్చుంది ఆమె.‘మంచి నీళ్లు కావాలా?’ అడిగాను నేను.‘వద్దు కాస్త కాఫీ పెట్టు’ అంది.‘పాల్లేవు’ అన్నాను నేను సిగ్గుపడుతూ.‘పోన్లే.... మీ ఆయనేం సంపాదించడం లేదా...’ గదంతా మరోమారు కలయ చూస్తూ అంది.నా కర్థం కాలేదు ఆ మాటకి అర్ధం. మౌనంగా వున్నాను నేను.‘ఆఫీసుకి వెళ్లాడా బుజ్జి?’ అడిగింది ఆమె.‘క్యాంపుకి వెళ్లారు’ అన్నాను నేను.‘అదే... ఆఫీసులో కనబడ లేదు. నేను అక్కడ్నించే వస్తున్నాను. ఒళ్లంతా చిరాగ్గా వుంది స్నానం చేస్తాను’ అంది ఆమె.ఆమె చేతిలో సంచీగానీ ఏదీ లేదు. తువ్వాలు అందించాను. బాత్రూమ్‌ లోకి నడిచింది.నీళ్ల చప్పుడు వినిపిస్తోంది. కూర వేపుడు చేసాను. కంది పచ్చడి రుబ్బి వుంది. చారు కాచాను. ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు. నాకు మాత్రమే వండుకున్నాను.బాత్రూమ్‌ లోంచి తువ్వాలు కట్టుకుని బైటికి వచ్చింది.‘నీ చీరేమైనా వుందా...? నా చీర మూడ్రోజుల్నించి నలిగి పోయింది. దొంగ సచ్చినోడు మూడ్రోజులు ఆ బంగ్లాలో వుంచేసాడు. మరో చీర కూడా తెచ్చుకోలేదు. వొళ్లంతా నొప్పులుగా వుంది.’ట్రంకు పెట్టె లోంచి చీరలు బైటికి తీసాను. అందులో వున్నవి మూడే. ఒంటి మీదున్న దాంతో నాకున్నవి నాలుగే చీరలు.ఏ చీర యివ్వాలో అర్ధం కాలేదు. అన్నీ నాసిరకం చీరలే. ఆవిడ కట్టి విడిచిన చీర చాలా ఖరీదు వుంటుంది. నావన్నీ వంద, నూట యాభైయ్యే.ఉన్నవాటిలోంచి మంచి చీర తీసి కట్టుకుంది. అది మా పెళ్లిచీర. నిరుడు పెళ్లిరోజున మా ఆయన కొన్నారు.