‘‘ఏం సారూ....బాగున్నారా?’’అప్పటిదాకా మా అమ్మాయి శ్రీలకి్క్షతో సరదాగా మాట్లాడుతున్న నేను తలెత్తి చూసాను. ఈ కాలంలో కూడా ఇంత సంస్కారం ఎక్కడిదా? అనుకుంటూ...చాలీచాలని ఫ్యాంటు, ఒకటి, రెండు చోట్ల చిరుగులతోటి షర్టు, వాటిని దాచాలనే ఆ పసితనం. తైల సంస్కారం లేకుండా నిర్లక్ష్యంగా అస్తవ్యస్తంగా వున్న జుట్టు. ఎంత కష్టాన్నయినా చేయకతప్పదననిపించే వాడి కళ్లల్లో సంసిద్ధత, నవ్వుతున్నా అలసత్వం కొట్టొచ్చినట్లు కనపడే ఆ ముఖం చూస్తుంటే ఒక్కసారిగా పదిరోజుల కిందట జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి ‘‘ఆ !! నువ్వా మల్లేశూ... బావున్నావా?’’ అంటూ వాడి భుజం పై చెయ్యివేశాను.... ఆప్యాయంగా.ఆ మాత్రానికే ప్రపంచాన్ని జయించినంతగా వాడి ముఖంలో ఆనందం...నాకు మాత్రం పాపం....అనిపించింది.నాకు నా కుటుంబంతో పాటు ఓ వారానికో, ఏ పదిరోజులకో ఇక్కడికి రావడం అలవాటే.. ఈ మధ్య ఎపడూ ఇక్కడే వుండే మల్లేశు ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత కనపడలేదు. 

అదే విషయాన్ని అంత వివరంగా కాకున్నా ‘‘ఏం మల్లేశూ... ఈ మధ్య కనపడడం లేదు అన్నాను,ఎంతో చనువుగా...‘‘మరి... మరి... నా చుట్టూ వున్న నా కుటుంబ సభ్యులను గమనించి చెప్పాలా వద్దా అనిపించిందేమో.... ఏదో సంశయంగా నాకేసి తదేకంగా చూస్తూ... ఇంతకు ముందు తిన్నవారి ప్లేట్లను తీసేస్తూ... చేతిలో వున్న తడిబట్టను టేబుల్‌ను శుభ్ర పరుస్తూ... మా వంకే దీనంగా చూస్తున్న మల్లేశు తీరు నాకు ‘‘ఏతల్లి కన్నబిడ్డో’’ అనిపించింది జాలిగా... ఇంతలో ఇవన్నీ గమనిస్తున్న మా శ్రీలకి్క్ష... ‘‘ఎవరునాన్నా’’....!! అంటూ అడిగింది. అతను అని చెప్పబోయేంతలో.. సర్వర్‌ రావడం.... ‘‘ఏం కావాలి సర్‌’’ అని అడగడం, అప్పటిదాకా మెనూకార్డును తిరగేస్తున్న నాకొడుకు మెను ఆర్డరివ్వడం...అవి విని అన్నెందుకు ఎలాగూ ఇంటికే వెళుతున్నాం కదా....!! అంటూ నా భార్య కొన్ని ఐటమ్స్‌ తగ్గించడం లాంటివి ఎపడూ అలవాటే అయినా వెంట వెంటనే జరిగిపోయాయి. ఇలాంటపడే అనిపిస్తుంది. కుటుంబంతో పాటు ఏదో మార్పు అంటూ వేరే చోటకు వెడతామే కానీ... స్థలం మారినంత మాత్రాన ఎవరి ఆలోచనల్లోనూ మార్పురాదు కదా!!!! అని...