అలవాటు ప్రకారం నిద్రలేవగానే సెల్‌ తీసుకుని ఇన్‌ బాక్స్‌ ఓపెన్‌ చేశాడు సురేంద్ర. అందులో ఎప్పటిలానే రామకృష్ణ పంపిన సందేశం వుంది.‘‘రోజూ ఓ మంచి పని చెయ్యి’’దాన్ని చూడగానే నిరాసక్తంగా ఓ నిట్టూర్పు విడుస్తూ ‘‘చూద్దాం’’ అనుకున్నాడు.సురేంద్ర ఆ ఉద్యోగంలో చేరినప్పటినుంచీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా అదే సందేశాన్ని పంపుతున్నాడు రామకృష్ణ. మొదట్లో దాన్ని చూడగానే ఎంతో ఉత్సాహం కలిగేది. దాని స్పూర్తితో ఏరోజుకారోజు ‘‘ఎలాగైనా ఈ రోజు ఏదో ఒక మంచి పని చెయ్యాలి’’ అని బలంగా నిర్ణయించుకునేవాడు. అందుకోసం పగలంతా శక్తి వంచన లేకుండా కృషి చేసేవాడు. అర్థరాత్రి పడుకోబోయేముందు, ఆరోజు చేసిన పనులన్నింటినీ గుర్తు చేసుకునేవాడు. వాటిల్లో ఏది మంచో ఏది చెడో బేరీజు వేసుకునేవాడు. వెలుగులో చూసిన ప్రతిదానికీ ఓ నీడ వున్నట్లే ప్రతి మంచి పనికీ చీడలా ఓ చెడు పరిణామం వుండక తప్పదనిపించేది. దాంతోబాటే మంచిపని చెయ్యడం అనేది ఎస్సెమ్మెస్‌ పంపినంత సులభం కాదని కూడా బోధపడేది.ఇదేమాట రామకృష్ణతో అంటే ‘‘అంత పేరున్న దినపత్రికలో మొదటి పేజీ చూసుకునేవాడివి... ఈ మాటనడానికి సిగ్గులేదా’’ అంటూ మొదలుపెడతాడు.దానికి సురేంద్ర దగ్గర జవాబులేదు. ఎందుకంటే తరచూ మంచి పనులు చేసే అవకాశాలు తమకే ఎక్కువుంటాయి. దాంతోబాటు ఆయా మంచి పనులు జరక్కుండా అడ్డుపడే ముందరి కాళ్ళబంధాలూ బెదిరింపులూ, తాయిలాలూ కూడా ఎక్కువే.

 దినపత్రిక అంటేనే పొద్దుట్నించీ రాత్రి వరకూ నిమిష నిమిషానికీ ప్రాధాన్యతలు మారిపోతుంటాయి. అందులోనూ మొదటిపేజీ అంటే ఆఖరి క్షణం వరకూ టెన్షనే. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు. అయినా సరే, వాటన్నింటినుంచీ తప్పించుకుని కనీసం మర్నాడయినా ఓ మంచిపని చేద్దామని నిర్ణయించుకుంటే తప్ప ఆ రాత్రి నిద్రపట్టేది కాదు.క్రమంగా రామకృష్ణ ఎస్సెమ్మెస్‌ అతని పాలిట పెనుసవాలుగా మారిపోయింది. యంత్రాంగం, మంత్రాగం, న్యాయాంగాలతో సమానమైన పీటయితే వుందిగానీ, ఆ పీటని పట్టుకు తిరిగేది మాత్రం కట్టుకున్న పట్టుచీరలని ఎరువిచ్చిన యజమానులే. అందుకే అక్షరాలు ఒకరివిగా అర్ధాలు మరొకరివిగా మారిపోయాయి. అయినా సరే, సమాజం పట్ల సరైన బాధ్యతని నిర్వర్తించడానికి అంతకు మించిన అవకాశం మరెక్కడా వుండదు.అందుకే బాగా ఆలోచించి ఓ మంచి పని చెయ్యడానికి శ్రీకారం చుట్టాడు సరేంద్ర.వార్తా కథనాల్లో వాస్తవాలెంత ప్రాధాన్యతని కలిగి వుంటాయో వాటి గణాంకాలు కూడా అంతకు మించిన ప్రాధాన్యతని కలిగి వుంటాయి. ఆ లెక్కల వెనుకనున్న కథల్ని వెలికి తీయగల ఉత్సాహవంతులైన పన్నెండు మంది యువ పాత్రికేయుల్ని ఎంపిక చేశాడు. అందులో ఆరుగురు హైదరాబాద్‌ వాళ్ళు. ముగ్గురు చెన్నైకీ. ముగ్గురు బెంగుళూరుకీ చెందినవాళ్ళు.