సుధాముడు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. పరీక్షించి చూస్తే ఆ మూసిన కనుకొనలందు అశ్రుబిందువులు కనిపిస్తాయి. చెప్పలేని వేదన అతని ముఖంలో ప్రతిఫలిస్తోంది. కృశించిన కాయం. ధరించిన అతుకుల బట్టలు, మధ్య వయసులోనే మీద పడ్డ వృద్ధాప్య ఛాయలు అతని స్థితిని దాచలేకపోతున్నాయి.అడుగుల అలికిడికి కనులు తెరిచాడు సుధాముడు. తనలాగే కృశించిన కాయం. అతుకుల చీర, మెడలో రంగు వెలసిన పసుపు తాడు, కనుల చుట్టూ నల్లని వలయాలు.‘‘కాపురానికి వచ్చినపుడు ఎలా వుండేది’’ మనసులోనే రోదించాడు.‘‘పిల్లలెక్కడ మైత్రీ’’ ఎలాగో గొంతు పెకలించుకుని అడిగాడు సుధాముడు. నూతిలో నుండి వస్తున్నంత సన్నని స్వరంతో.‘‘పెద్దది యాజ్ఞి గంజి కాస్తోంది. మిగిలిన వారు బయటెక్కడో ఆడుకుంటూంటారు’’ అదే క్షీణించిన స్వరంతో జవాబు.‘‘ఊ.. పెద్దమ్మాయి, తన యీడు పిల్లలు ఎపడో పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలకు కూడా వెళుతున్నారు. ఛీ వెధవ జీవనం. భార్యాపిల్లలకు కడుపునిండా భోజనం, వంటినిండా బట్టలైనాయివ్వలేకపోతున్నాను.ఎప్పటికైనా మంచిరోజులొస్తాయా’’ మరోసారి రోదించింది మనసు.

‘‘ ఏమండీ నేను చెప్పిన విషయం గురించి ఏమాలోచించారు’’‘‘ ఏవిషయం మైత్రీ’’‘‘అదే మీ బాల్యస్నేహితుడు కృష్ణుణ్ణి కలిసి సహాయమడిగే విషయం’’‘‘....’’‘‘వనం సమస్యల్ని పరిష్కరించదండీ, నిర్ణయం, క్రియ యివే పరిష్కరిస్తాయి. ఎటొచ్చీ అవి సరియైనవై వుండాలి’’‘‘...’’‘‘హూ. నడివయసులోనున్న మనకోసం కాకున్నా, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. గడచిన కాలం గురించి వగచి లాభం లేదండీ’’‘‘ ఏమని అడగను?’’‘‘బావుంది మీ ప్రశ్న. ఇంటి పరిస్థితి మీకు తెలియనిదికాదు కదా’’‘‘...’’‘‘మనసులో బాధపడుతూ పైకి గంభీరంగా వుండడానికి మీరు పడుతున్న అవస్థ చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందండీ. మీ వల్ల కాని పనిని చేయమనటం లేదు. మీరు ఎలాగూ వేదం నేర్చారు. వ్యాసుల వారొనర్చిన వేద విభజననీ క్షుణ్ణంగా తెలుసుకున్నారు. పైగా పౌరోహిత్యమూ తెలుసు కాబట్టి, ఆ కృష్ణుణ్ణి బతిమాలైనా ఏదైనా గురుకులంలో చిన్న అధ్యాపక పదవిని ఇప్పించమని ప్రాధేయపడండి. కనీసం అర్చకత్వమైనా సరే. ఎలానో బతుకు సాగదీయవచ్చు. ఏమంటారు?’’‘‘...’’‘‘ఏవిటండీ ఉలకరూ పలకరు. మీరు అడగకూడని వాళ్ళని అడగటం లేదండీ. కృష్ణుడు మీ బాల్యస్నేహితుడు. పైగా చేయదగ్గ స్థితిలో వున్నవాడు. పరోపకారిగా పేరున్నవాడు’’