పెద్దగా కూతపెట్టి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ కాళహస్తి స్టేషన్‌ నుంచి బయల్దేరింది. స్నేహితుడి పెళ్ళికోసమని శ్రీకాళహస్తి వచ్చాను. రూటు కొత్త. ఆర్‌ఎసిలో సీటు దొరికింది. బెర్త్‌ ఇంకా కన్‌ఫర్మ్‌ కాలేదు. బ్రీఫ్‌కేస్‌ సీటుకిందకు తోసి సర్దుకు కూర్చున్నాను.ఎదురుగా ఒక పెద్దావిడ కూర్చునుంది. పక్కసీటు చివరో కాలేజీ స్టూడెంట్‌ కూర్చున్నాడు. ఆ ఎదురు సీట్లో మూడు పంచెకట్లు వున్నాయి. పార్టీ పనిమీద భాగ్యనగరానికి బయల్దేరినట్లున్నారు. నిండా రాజకీయాల్లో మునిగిపోయారు.అందరూ సర్దుకున్నారనుకున్న తర్వాత ‘‘ఇక్కడ్నుంచి వెంకటగిరి స్టేషన్‌కి ఎంత సమయం పడుతుంది’’ ఎదురుగా కూర్చున్నవాళ్లలో ఒక ఆసామిని అడిగాను.‘‘అరగంట’’ అని చెప్పి మళ్ళీ ఆయన ఊరి రాజకీయాల్లో పడిపోయాడు.ఎదురుగా కూర్చున్నావిడ కన్నార్పకుండా కిటికీలోంచి తదేకంగా బయటకు చూస్తూనే వుంది. కాలేజీ కుర్రాడు సెల్‌ఫోన్‌లో గేమ్‌ ఆడుతున్నాడు. అక్కడున్న వాళ్ళతో నేను మాట్లాడగలిగేదేమీ లేదనేది అర్ధమయిపోయింది. వ్యూగజైన్‌ తీసుకున్నాను. మరాఠీ కథ ముగింపులో వుండగా దూరంనుంచి ‘చెల్లియో... చెల్లకో’ అన్న పద్యం వినపడింది. చూపులు పుస్తకం మీదున్నా చిత్తం పద్యంవైపుకు పరిగెట్టింది. ఆ పద్యం నా చిన్నప్పటి జ్ఞాపకం.

ఒకసారి ఇంట్లోవాళ్ళకి చెప్పకుండా శ్రీరామనవమి పందిట్లో ‘శ్రీకృష్ణరాయబారం’ వేస్తుంటే వెళ్ళాను. నాటకం అయిపోయేసరికి తెల్లవారుఝాము మూడయింది. దొంగలాగా గోడదూకి ఇంట్లోకెళదామనుకున్నాను. గోడయితే బాగానే దూకాను కానీ మెలికపడి కాలిరిగింది. కేకలు, పెడబొబ్బలతో ఇంట్లో అందరూ లేచారు. ఆ తరువాత కాలికి పిండికట్టు, తలవాచేట్లు చివాట్లు - ఆపై నెలరోజుల విశ్రాంతి.రెండు నిముషాల్లో దూరంగా వున్న పద్యం దగ్గరయింది. తలెత్తి చూశాను. నిలువెత్తు మనిషి. ఛామనఛాయకు ఒకరంగు తక్కువే వున్నాడు. వయసు అరవై వుండొచ్చేమో! కానీ జుట్టు నల్లగా నిగనిగలాడుతోంది. కోటేరు ముక్కు. శరీరం మొత్తం గీకినా ఎక్కడా ఒక చెంచాడు కొవ్వైనా వచ్చేట్లు లేదు. కానీ నిండుగా వున్నాడు. తీరైన పలువరుస. నీరుకావి రంగు పంచెను లుంగీలాగా చుట్టుకున్నాడు. ముదురు నీలంరంగు చొక్కా చేతుల్ని మోచేతుల వరకు మడిచాడు. ఒక చేతిలో శుభ్రమైన పెద్ద సంచి. దగ్గరగా వచ్చేటప్పటికి పాడే పద్యానికనుగుణంగా అతని మొహంలోని హావభావాలు కూడా కన్పడుతున్నాయి.పక్కనున్న కాలేజీ కుర్రాడు, పెద్దావిడ అతనికి చిల్లర ఇచ్చారు. ‘అంత శుభ్రంగా వున్నాడు. అతనడుక్కునేవాడా!’ ఆశ్చర్యపోయాను.అతను పద్యంలో లీనమైపోయి పాడుకుంటూ వెళ్తున్నాడే కానీ ఎవరి దగ్గరా చెయ్యి చాపట్లేదు. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు.పద్యం పాడటం తప్పితే తన జీవితధ్యేయం ఇంకేమీ లేదన్నట్లుగా పాడుతున్నాడు. అతను తీసే రాగం ఎక్కడా శ్రుతి, లయ తప్పకుండా అతిశ్రావ్యంగా సాగుతోంది. అతని కంఠం ఖంగుమంటోంది. ఆ కంఠంలో ఏదో వశీకరణమున్నట్లు వుంది.