తన పథకం ఎందుకు ఫలించలేదా అని తీవ్రంగా ఆలోచించసాగాడు శ్రీను. పథకం ఎంతో పకడ్బందీగా అల్లి, అతిజాగ్రత్తగా అమలు జరిపాడు. ఈ పాటికి శేఖర్‌, అతని తండ్రి శీను కాళ్లబేరానికొచ్చి అతను చెప్పినట్లు నడుచుకుంటారని ఊహించాడు శీను. కాని శీను ఊహించినట్లు జరగలేదు. చిన్న ఫోన్‌కాల్‌ చేస్తే పరుగున వచ్చి కాళ్లముందు వాలి ఆదేశాలు అమలు జరిపే శేఖర్‌, ఇన్నాళ్లైనా జాడలేక పోవడంతో ఆశ్చర్యపడ్డాడు శీను. అతను వేసిన పథకం అమలు కాక పోవడానిక్కారణాలు వెతకసాగాడు శీను.సరిగ్గా నెల్లాళ్ల క్రితం-‘‘ఏరా మూర్తీ! నా పథకం ఎలా ఉంది? ఏమైనా మార్పులు, చేర్పులు చెయ్యాలంటే చెయ్యరా’’ హుషారుగా విస్కీ సిప్‌ చేస్తూ అన్నాడు శీను.ఒక నిమిషం సీరియస్‌గా ఆలోచించాడు మూర్తి.‘‘దయచేసి నీ ప్రయత్నం మానుకోరా. ముప్ఫైఏళ్లుగా నిన్ను గుడ్డిగా నమ్మి నీతో స్నేహం చేసిన శేఖర్‌ లాంటి ప్రాణస్నేహితుణ్ణి ఇలా మోసం చెయ్యాలనుకోవడం చాలా తప్పురా. తప్పుచేశాక విచారించేకంటే, ముందే ఆలోచించి తప్పుచెయ్యకుండా జాగ్రత్త పడటం మంచిది. బాగా ఆలోచించరా’’ హితవు చెప్పాడు మూర్తి.

అతని మాటలకి వెకిలిగా నవ్వాడు శీను.‘‘ఒరేయ్‌ మూర్తీ! నీకింకా ప్రపంచం సరిగా అర్థం కానట్లుంది. దొంగతనాలు, దోపిడీలు చేసే వారిని దేవుడేం చెయ్యగలుగుతున్నాడు? కట్నం చాల్లేదని కోడళ్లను తగులబెట్టే అత్తగార్లని ఏం చెయ్యగలుగుతున్నాడు దేవుడు. అదే ఎంతో భక్తి, శ్రద్ధలతో తనని కొల్చే భక్తులను ఎంత హింసిస్తాడా దేవుడు? దేవుడు కూడా నమ్మినవాళ్లనే మోసం చేస్తాడు గాని నాస్తికులను ఏమీ చెయ్యలేడు. ఇది కలియుగం. ఈ యుగాన్ని మోసగాళ్ల కోసమే ప్రత్యేకంగా సృష్టించాడు దేవుడు. నేను యుగధర్మాన్ని అనుసరిస్తున్నాను. అంతే’’ వెకిలిగా నవ్వుతూ అన్నాడు శీను.శీనులో ఎంత విషం దాగుందో అప్పుడే అర్థమైంది మూర్తికి. ఐనా మరోసారి హితబోధ చెయ్యాలనిపించిందతనికి.‘‘ఒరేయ్‌ శీనూ! పవిత్రమైన స్నేహబంధాన్ని మించినది మరొకటి లేదు. ఈ లోకంలో తల్లిదండ్రులతో చెప్పుకోలేనివి కొన్ని విషయాలుంటాయి. చివరికి భార్యతో చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. కాని ఏ విషయాన్నైనా మనసు విప్పిచెప్పుకునేది నమ్ముకున్న స్నేహితుడితో నేరా. అలాంటి పవిత్రమైన స్నేహాన్ని దూరం చేసుకుంటున్నావేమో! బాగా ఆలోచించుకో’’ సలహా ఇచ్చాడు మూర్తి.