ఇంటి ముందున్న మామిడి చెట్టు దగ్గర నిలబడ్డాడు ముకుందం.ఎంతో ప్రశాంతంగా ఉందనుకున్నాడు ఉదయం పూట వాతావరణం. ఆ చెట్టు క్రింద నిలబడితే నిశ్చింతగా ఎంతో హాయిగా అని పిస్తుందతనికి.తూర్పు వైపున తెల్ల ఏనుగు అంబారి మీద కూర్చుని ఊరేగి వస్తున్నట్లు సూర్యుడు కన్పించాడు. ఆకాశంలో తెల్లటి కొంగలు బారులు తీరి ఆహారం కోసం పడమటి దిక్కుకు ఎగిరి పోతున్నాయి. చెట్టు కొమ్మ మీద పిట్ట రెక్కలు విది లించుకుంది.తన కొడుకు డాలర్ల వేటలో పడమటి దిక్కుకు వెళ్ళిపోయాడు. మామిడి చెట్టును చూస్తుంటే కొడుకు గుర్తుకు వస్తాడు. అమెరికా వెళ్ళిన అనూప్‌ బాగా సంపాదించి స్థిరపడ్డాడు. వాడి నీడలో తను నిశ్చింతగా ఉండొచ్చు. డబ్బుకు వెతుక్కోవాల్సిన అవ సరం ఉండదు. చివరి దశలో తనకూ, అన్నపూర్ణకూ వాడే అండగా ఉంటాడు.తండ్రి పేరు అమరయ్య. ఆ పేరు వాడికి పెట్టుకుంటే కాలేజీలో చదివే రోజుల్లో పేరు మార్చుకున్నాడు.ఎక్కడి నుంచో వొచ్చి చెట్టు కొమ్మ మీద వాలిన కాకి అరుస్తూ ఉంది. ఆ కాకి గోల భరించలేకపోయాడు. చిన్న మట్టి గడ్డ చేతిలోకి తీసుకుని దాని మీద విసిరాడు. 

మట్టిగడ్డ రేణువులు కళ్ళల్లో పడ్డాయి గాని ఆ గడ్డ కాకికి తగల్లేదు. మరో కొమ్మ మీదకు చేరింది కాకి.ఆ కాకిని చూస్తుంటే వియ్యంకుడు గుర్తుకు వచ్చాడు.నరసింహం హైదరాబాద్‌లో కాంట్రాక్టులు చేస్తుంటాడు. బాగానే సంపాదించాడు. ఆ నరసింహం కూతుర్నే తన కొడుకు ప్రేమించాడు. ఊళ్ళో సర్పంచ్‌ కూతుర్ని కోడలిగా చేసుకోవాలని కలలు కంటూ ఉండేవాడు. మంచి కుటుంబం వాళ్ళది. తన మాట కొడుకు విన్లేదు. నరసింహం కూతుర్ని పెళ్ళిచేసుకున్నాక ఎప్పుడన్నా అమెరికా నుంచి అనూప్‌ వచ్చినా హైదరాబాద్‌లోనే ఎక్కువ రోజులు ఉంటాడు. పుట్టి పెరిగిన ఊరు చూడాలన్న ఆసక్తి ఉండదు. ఒకవేళ వచ్చినా ముళ్ళ మీద కూర్చున్నట్లు ఒకటో రెండ్రోజులో ఉంటాడు.‘‘మా అమ్మాయి, అల్లుడుగారు వచ్చారు అమె రికా నించి. పదిరోజులు ఉంటారట. మీ ఊరు వచ్చే తీరిక లేదట. మిమ్మల్నే ఇక్కడకు రమ్మని చెప్పారు అల్లుడుగారు. మీరు తప్పకుండా రండి!’’ అంటూ ఫోన్‌ చేస్తాడు వియ్యంకుడు అప్పు డప్పుడు.పుండు మీద కారం చల్లినట్లు ఉంటుంది.....అమెరికా నుంచి వస్తున్నట్లు అనూప్‌తనకు ఫోన్‌ చేసి చెప్పాడని వియ్యంకుడి ద్వారా వినడం ఇబ్బందిగా అన్పిస్తుంది. కోడలు అస్సలు ఎప్పుడూ ఫోన్లో మాట్లాడదు.......అయినా వాడు తన కొడుకు! ఊళ్ళో బాగా చదువుకొని అమెరికా వెళ్ళింది వాడొక్కడే!పచ్చిగడ్డి మోపు సైకిల్‌ క్యారేజ్‌కు కట్టుకుని వెళ్తున్న సాంబయ్య కన్పించాడు.