‘‘మనోహర్‌ మళ్ళా ఫోన్‌చేసాడు బయల్దేరుతున్నారా లేదా అని - ఏమిటి మీ నిర్ణయం?’’ ... వర్ధనం నా సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది. నేను ఓకే అంటే ఆవిడకి పరమానందం. రిటైరవగానే - ఇంక మీకు అక్కడేం పని, మూటాముల్లె సర్దుకుని ఇక్కడికొచ్చేయండి అని కొడుకులు ఎప్పుడు అంటారా అని ఎదురుచూసి చూసి నిరాశపడ్డ వాళ్ళని చాలామందిని చూసాను. అందుకే రిటైరై నెల్లాళ్ళు అయిందో లేదో - ఇంక అక్కడేం పని, బయల్దేరి వొచ్చేయండని బెంగుళూరు నుంచి కొడుకు రోజూ ఫోన్‌ చేస్తూండటంతో వర్ధనం ముఖం ఆనందంతో చేటంతయింది. పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు - రిటైరయాకా ఇలా వెంటనే బయల్దేరి వచ్చేయండి అన్నప్పుడే కదా.నాకు మాత్రం అప్పుడే రిటైరవడం అంటే వొళ్ళుమండింది. ఓ పన్నూడ లేదు, ఓ కంటి చూపు తగ్గలేదు, ఓ చెవుడు లేదు, కాళ్ళు కీళ్ళ నొప్పు లెరగను. అవలీలగా ఆరుమైళ్ళు మార్నింగ్‌ వాక్‌ చేసేస్తాను. గొంతు విప్పితే మైక్‌లు సిగ్గుపడాల్సిందే. ఐతేనేం, యాభై ఎనిమిది నిండాయ్‌ కాబట్టి ఇక పని చెయ్యడానికి పనికిరావ్‌, వేసిన ముష్టి పెన్షన్‌ తీసుకుని ఇంటికి ఫో అన్నారు...

 ఆయన నాకన్నా పాతికేళ్ళు పెద్దవాడు. చెరో పక్కా గుండ్రటి భుజాల అమ్మాయిల భుజాల ఆసరా లేకుండా అడుగుతీసి అడుగు వెయ్యలేడు. కళ్ళజోడు లేకపోతే బాత్రూం దారి కూడా ఆనదు. చెవికి ఇంపోర్టెడ్‌ చెవిటి మిషన్‌ తోసి పళ్ళలోంచి వచ్చేమాటలు అర్థమే కావు. ఐతేనేం, పదికోట్ల జనాభా గల రాష్ట్రాన్ని ప్రథమ పౌరుడుగా పాలించడానికి నిక్షేపంలా పనికొస్తాడట. ఆ జాతివాళ్ళకి రిటైర్మెంటే లేదట! ఇంతగొప్ప సామాజిక న్యాయం అమలు జరిగే పుణ్యభూమిలో పుట్టడం నా అదృష్టం అనుకుంటూ....నాయకులు, పురప్రముఖులు, అధికార్ల ముంగిట ముగ్గులేయడం తప్ప ఏనాడూ పాఠశాల, పిల్లల ముఖాలు చూసి ఎరుగని కొంతమంది ఆదర్శ ఉత్తమోపాధ్యాయుల రిటైర్మెంట్‌ ఫంక్షన్లు ఊరూ వాడా హోరెత్తే రీతిలో మహాఘనంగా జరిపే ఉపాధ్యాయలోకం తండ్రి తద్దినం రోజున కూడా శెలవుపెట్టి ఎరుగని నాకు మాత్రం పాడెత్తేముందు శవానికి దండేసినట్టు ఓ ఎండిపోయిన దండతో సరిపెట్టి సింప్లాతి సింపుల్‌గా ఇంటికి సాగనంపితే, మొదటిసారిగా అలా ఉచితంగా లభించిన దండని వర్ధనం చేతిలో పెట్టాను గర్వంగా.