అమాయకుడైన భర్తను అదేపనిగా సాధిస్తున్న గయ్యాలి భార్యలా మే మాసం ఎండ చిటపటలాడ్తుంది. నున్నని తార్రోడ్డు సన్నని సెగలను భరిస్తూ హీరో హోండా మీద ఝామ్మని ఆఫీసు కెళ్తున్నాను. అదొక థ్రిల్లింగ్గా ఉంది.మూడు దశాబ్దాల సర్కారు సర్వీసులో మూన్నాల్గు ప్రమోషన్లు సాధించడమొక ఎత్తైతే చివరి మజిలీగా సిద్ధిపేట పట్టణానికి ట్రాన్స్‌ఫర్‌ సాధించడం మరొక ఎత్తయింది. నాలుగేళ్లలో రిటైర్మెంటు ముంచుకొస్తుంది. అందుకే కోరుకున్న చోటకు ట్రాన్స్‌ఫర్‌... కోటి వరాల మూటలాగన్పించింది. ముగ్గురు పిల్లలు, ఆ ముగ్గురికీ పిల్లలు. ఎక్కడి వారక్కడ స్థిరపడి హాయిగా ఉన్నారు. మిగిలింది లింగు లిటుకుమంటూ మేమిద్దరమే చిలకా గోరెంకల్లాగుంటామండోయ్‌!సొంత బంగళాలో సామానులు సర్దుతూంటే సరికొత్త అనుభూతి అలరించింది. ఎక్కడో డ్యూటీ చేస్తూ లోను తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టడం... నిర్ణయం సరియైందేనని రుజువైంది. అటు అపతీరింది, ఇటు సొంత గూటికి చేరుకున్నాము. అప్పటిదాకా అదే ఇంట్లో అద్దెకున్న ఆఫీసర్‌ గూడా వాళ్ళూరికి ట్రాన్స్‌ఫరైపోయాడు. లేకపోతే సొంతిల్లు ఉండగా అద్దె ఇల్లు కోసం సర్వే చేయాల్సి వచ్చేది. అందుకే అంది శ్రీమతి.‘‘ఎప్పట్నుంచో చేస్తున్న ట్రాన్స్‌ఫర్‌ ప్రయత్నం ఇపడు ఫలించింది. పైవాడి పంచలో ఆలస్యమ యిందిగాని అంధకారం లేదంటారండీ’’వచ్చీపోయే వాహనాలనధిగమిస్తూ ముందు కెలుతున్నాను. గూటిలో చిలకలా జేబులో సెల్‌ఫోన్‌ గొంతు విప్పింది.

 హోండాను రోడ్డు పక్క చెట్టుకిందికి తీసుకెళ్ళి ఆపేశాను. ఫోన్‌ మాట్లాడి పక్కకు చూశాను. ఫుట్‌పాత్‌ మీద వరుసగా రేకుల షెడ్లు, గుడిసెలున్నాయి. దినదినగండం నూరేళ్లాయుష్షులా జీవిస్తున్న సన్నకారు జీవులకవి ఆశ్రయాలని తెలిసి పోయింది. చెట్టు ఇటువైపు నీడలో నేనున్నాను. అటువైపు నీడలో మట్టిగోడల తాటాకు గుడిసె. గుడిసె ముందు మండుతున్న కొలిమి పక్కన ఓ ముసలాయన, బాగా కాలిన గడ్డపార మొనను పట్టకారు సాయంతో పట్టుకుని కూచున్నాడు. అతనికెదురుగా తల పండిన ముసలామె పెద్ద సుత్తి గాల్లోకెత్తి గడ్డపార మొనమీద దెబ్బలేస్తోంది.ముసలాయన పీటలాంటి రాయిమీద కూచు న్నాడన్నమాటేకాని దెబ్బ దెబ్బకూ ముందుకూ, వెనక్కూ కదుల్తూ గడ్డపారనటూ, ఇటూ తిపతు న్నాడు. గడ్డపార మొన నిపలతో బాగా చెలిమి చేసిందేమో, అదిగూడా నిప కణికలాగుంది. దెబ్బ దెబ్బకు రూపం మార్చుకుంటూ మొనదేలుతోంది.ముసలాయన మొహమ్మీదికి, గొంతు, మెడల నుండి శరీరం నిండా చెమట ధారలు కట్టింది. ముసలామె ఒంటినిండా గుడ్డలున్నాయి గాని అవి చెమటకు తడిసి శరీరానికతుక్కు పోతున్నాయి. దెబ్బ దెబ్బకూ దమ్ము తీస్తోంది.‘‘వెయ్యవే వెంకు. దెబ్బ గట్టిగా పడనీ’’ ముసాలయనన్నాడు.‘‘ఏస్తున్నానయ్యా. పొట్ట తిప్పలుకు జెర్రిపోతు లాడించినట్టు గీ వైసులగూడా రెక్కల కష్టం తప్పక పాయె’’ ముసలామె నిట్టూర్పు కొలిమిలో నిపల మంటలు. ముసలోళ్ళ కడుపులో ఆకలి మంటలు. శ్రమైక జీవన సౌందర్యమంటే ఇదేనేమో!