మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యింది. పార్వతమ్మకు ఆకలి వేసేస్తోంది. చాలా నీరసంగా ఉంది. ఆమెకు ఏమీ పాలుపోవడం లేదు.‘కలెక్టరమ్మగారు ఇంకా ఎంతసేపటికి వస్తారు’ ఆమె ముందుగా వెడుతున్న ఒకతన్ని అడిగింది.‘ఎలా తెలుస్తుందమ్మా! ఆరికి బోలెడు పనులుంటాయి. ఈ రోజు సోమవారం. తప్పకుండా ఆఫీసులో ఉంటారు’ చెప్పాడు అతడు. బహుశా అతడు కలెక్టరేటులో చిన్న ఉద్యోగి అయి ఉంటాడు.వితంతువులకు, వయసు మళ్లినవారికి పెన్షన్‌ను కలెక్టరు గారు మంజూరు చేస్తారని ఎవరో చెప్పారు పార్వతమ్మకు. దానికోసం ఆఫీసుకు వచ్చింది.పార్వతమ్మ ఆఫీసుకు పది గంటలకే వచ్చింది. అప్పటి నుండి కలెక్టరమ్మ రాకకోసం ఆమె ఎదురుచూస్తోంది. ఉదయం నుండి ఆమె ఏమీ తినలేదు. ఒకవైపు ముసలి తనం మరొకవైపు ఆకలి.పన్నెండున్నర అయ్యింది. కలెక్టరమ్మ వచ్చింది.
వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆమె తన చాంబర్‌లోకి వెళ్లిపోయింది. ఆమె రాకతో పార్వతమ్మకు ప్రాణంలేచి వచ్చినట్లయ్యింది.ఒంటి గంటన్నర అయ్యింది. పార్వతమ్మకు కలెక్టరమ్మ దగ్గరకు వెళ్లే ఆవకాశం వచ్చింది. పార్వతమ్మ తడబడుతూ అడుగులు వేసుకుంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లింది. తన పరిస్థితిని తెలియచేస్తూ పెన్షన్ మంజూరు చేయమని అభ్యర్థిస్తూ రాసిన కాగితం కలెక్టరమ్మకు ఇచ్చింది.ఆ కాగితం తీసుకున్న కలెక్టరమ్మ ఆమె కేసి తలెత్తి చూసింది.‘మీ పేరు’ కలెక్టర్ అడిగింది.‘పార్వతమ్మ!’ చాలా బలహీనమైన స్వరంతో చెప్పింది.‘మీరు గోవిందరావు గారి భార్య పార్వతమ్మ గారా?’ కలెక్టర్ అడిగింది.‘తన భర్త పేరు కాగితంలో రాయలేదు. కలెక్టరమ్మకు తన భర్తపేరు ఎలా తెలిసింది?’ అయోమయంలో ఉండిపోయింది.
‘మీ భర్తగారి పేరు ఏమిటి?’ కలెక్టర్ అడిగింది.తేరుకున్న పార్వతమ్మ ‘గోవిందరావు గారు’ అని చెప్పింది.‘ఇలా అయిపోయారేమిటి...’ కలెక్టరు ఏదో అనబోతుంటే పార్వతమ్మ నీరసంతో చతికిల పడింది. కలెక్టరు వెంటనే లేచి పార్వతమ్మకు చేయి అందించింది.మరుక్షణంలో ఇద్దరు స్టాఫ్ కలెక్టరు చాంబర్‌లోకి వచ్చి పార్వతమ్మ ముఖంమీద నీళ్లు జల్లి ఆమెను ఆ చాంబర్‌లో వున్న సోఫాలో కూర్చోపెట్టారు. ఆమెకు కూల్‌డ్రింక్ ఇచ్చారు.పార్వతమ్మ కొద్దిగా తేరుకుంది. కాని చాలా నీరసంగా ఉంది.‘ఆవిడకు ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి’ కలెక్టరు చెప్పడంతో వెంటనే ఆమెకు ఫ్రూట్ జ్యూస్ తీసుకు వచ్చి ఇచ్చారు.