నాకు మెలుకువ వచ్చింది. లేద్దామనుకొంటుండగానే ఫోన్‌ మోగింది. అదీ సెల్‌ఫోన్‌. రాత్రి చార్జింగ్‌ కని కాస్త దూరంగా పెట్టానేమో పడకలో నుండి లేవక తప్పలేదు. చలి విపరీతంగా ఉంది వెచ్చటి రజాయి తొలగించి, పక్కనున్న కుర్చీ నుండి ఉలెన్‌ ఓవర్‌కోటు తీసి హడావుడిగా కప్పుకొంటూ ఫోన్‌ వైపు నడిచాను. అవతల గొంతు సర్‌ తాజ్‌ది. వాళ్ళ బావమరిది ఇంట్లో ఏదో ఫంక్షనట. తను ఈరోజు డ్యూటీకి రాలేడట. ఇక నేను మాట్లాడటానికి ఏమి మిగిలింది? గడియారం ఆరు చూపిస్తోంది. ఒక గంటలో నేను బయలుదేరాలి. పైగా డ్రైవరు రావటం లేదు.ఈ శుభవార్త చెప్పటానికా అన్నట్లు మేల్కొల్పులా నన్ను నిద్రలేపాడు.ఒకప్పుడు డ్రైవింగ్‌ అంటే నాకు చాలా సరదా. పనున్నా, లేకున్నా కారు డ్రైవ్‌ చేసుకొంటూ అలా తిరిగివస్తే చాలా హాయిగా ఉండేది.

 ఇప్పుడు ఢిల్లీ ట్రాఫిక్‌ ఎంత పెరిగిందంటే కారు తీసుకొని రోడ్డుమీదకు వెళ్తే పద్మవ్యూహంలో చిక్కుకొన్న అభిమన్యుడు గుర్తుకు వస్తాడు. ఎంతో మెలకువగా కుడి ఎడమలు, ముందు వెనకలు చూస్తూ, బండ్లు తప్పించుకొంటూ కారు నడపాలి. చినుకు చినుకుకూ బాణం వేస్తూ అర్జునుడు ముందుకు సాగినంత చాకచక్యం కావాలి.ఈ నగరంలో దేశంలోని అన్ని నగరాల కంటె ఎక్కువ సంఖ్యలో కార్లున్నాయంటారు. ఆ సంగతి అటుంచి ప్రతి వీధి ములుపులో ఏవో తవ్వకాలు, నిర్మాణాలు, డైవర్షన్లు ఉన్నాయి. ఓవర్‌ బ్రిడ్జిలు తయారవుతున్నాయి. మెట్రోరైలు నగరమంతా వ్యాపిస్తోంది. అందుకే పైనా, క్రిందా, అట్టడుగున నిర్మాణాలే. ఒకో అంగుళం తేడాలో ఒక కారు మరో కారును ఒరుసుకొనే ప్రమాదముంది. బంపర్‌ టు బంపర్‌ డ్రైవ్‌ చేసుకొంటూ ఇదివరకు అరగంటలో చేరుకొనే స్థలాలు ఇప్పుడు గంట, గంటన్నరలో చేరుకో గలుగుతున్నాం. ఇదీ ఒకందుకు మంచిదేననిపిస్తుంది. ఎక్కడికి ఆలస్యంగా బయలుదేరినా ‘‘సారీ, సారీ ట్రాఫిక్‌లో చిక్కుకొన్నాను’’ అనవచ్చు. విదేశాలల్లో కూడా ఇవే మాటలు వినవస్తాయి. ఎవరూ తప్పుగా అనుకోరు.మనసులో కాబోయే పనుల గురించి ఆలోచన, అనుకొన్న పనులు సరిగా అవుతాయో లేదోనన్న టెన్షను, ఇవన్నీ పెట్టుకొని ఢిల్లీ నగరంలో కారు డ్రైవ్‌ చెయ్యటమనేది గొప్ప సాహసమే అను కోవాలి. ఈ రోజు, ముఖ్యంగా మా ఆఫీసుకు విదేశీ ప్రతినిధులు వస్తున్న రోజు, ముఖ్యమైన సమావేశం జరగనున్న రోజు, రెండు గంటలు ముందుగా ఆఫీసు చేరుకోవలసిన రోజు, డ్రైవరు తాను రాలేనని ఫోను చెయ్యటం చాలా చికాకనిపించింది. అయినా పనులు అగవు కదా!త్వరగా తెమిలి బయలుదేరే ముందు అడ్రసుల పుస్తకం దగ్గర పెట్టుకొని ఫొటోగ్రాఫర్లకు, మీడియా వాళ్ళకు పంక్షన్‌ గురించి గుర్తు చేశాను. ఆఫీసుకు వెళ్ళే ముందు పూల గుత్తులు తీసుకెళ్ళాలి. నిన్ననే ఆర్డరిచ్చాను. పువ్వుల దుకాణం నాకు దారిలో రాదు. దానికోసం ప్రత్యేకంగా రెండు కిలో మీటర్లు మరో దారిన వెళ్లాలి.