షిప్ ఎక్కవలసని ప్రయాణీకులందరూ సైరన్ మ్రోగడంతో ఒక్కసారి ఎలర్ట్ అయి గబగబ డెక్ మీదికి చేరుకున్నారు. దూరతీరాలకు తరలిపోయే వారికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన బంధువులు, స్నేహితుల కౌగిలింతలూ, ముద్దులూ, కన్నీళ్ళు మొదలైన దృశ్యాలతో ఆ ప్రాంతమంతా ఆత్మీయతా పరిమళాలు గుబాళిస్తూ కోలాహలంగా ఉంది. బరువైన హృదయాలతో, సామాన్లు మోసుకుంటూ బరువుగా షిప్‌లోకి కదులుతున్నారు ప్రయాణీకులంతా!‘‘సింధూ! బి కేర్‌ఫుల్! హోల్డ్‌బ ది రాడ్ కేర్‌ఫుల్లీ!’’ తన కూతురికి జాగ్రత్తలు చెబుతూ అరుస్తున్నాడు సత్యరాజ్.‘‘ఓకే డాడీ! ఓకే! నో ప్రాబ్లెమ్!’’ జవాబుగా అరుస్తోంది సిధూ.సత్యరాజ్ కుటుంబ సభ్యులంతా షిప్‌లో అడుగుపెట్టి వాళ్ళకుకేటాయించిన ఛాంబర్‌లోకి ప్రవేశించారు. సత్యరాజ్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఒక సిగరెట్ వెలిగించాడు.సైరన్ రెండో సారి మ్రోగింది. ‘గాస్-సూయెజ్’ పేరు గల ఒక పెద్ద కమర్షియల్ పాసింజర్ షిప్ ప్రశాంత గంభీరమైన సముద్రపు అలల్లో అల్లకల్లోలాలని సృష్టిస్తూ బరువుగా నెమ్మదిగా కదిలింది.ప్రయాణీకులంతా ఎవరి ఛాంబర్స్‌లో వారు సామాను సర్దుకుంటూ నెమ్మదిగా స్థిమిత పడుతున్నారు.సింధూ తన కిష్టమైన నవల ఇర్వింగ్-వాలెస్ రచించిన ‘త్రీ ఐలాండ్స్’ చదవడంలో నిమగ్నమై పోయింది.
సత్యరాజ్ భార్య మిసెస్ సుబ్బుకి ఆ ఓడ బాగా నచ్చింది. చెప్పలేనంత ఆనందం ఆమె కళ్ళల్లో తొణికిసలాడుతోంది.‘‘ఐ ఆల్‌వేస్ ప్రిఫర్ టు ట్రావెల్ బై షిప్ దేన్ ఎయిర్!’’ అంది భర్తతో.‘‘వాటీస్ ద స్పెషాలిటీ?’’ కొంటెగా అడిగాడు సత్యరాజ్.‘‘ఇటీస్ సో థ్రిల్లింగ్ యూసీ! ద ఓషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్కై’’ అంటూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ నవ్వుతూ చెబుతోంటే ఆ కళ్ళనే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు సత్యరాజ్. వాళ్ళిద్దరి చూపులనీ భంగపరుస్తూ చిన్న కొడుకు బబ్లూ- ‘‘వాట్ మమ్మీ! దిసీస్ బోర్ జర్నీ! ఐ డోంట్ లైక్!’’ విసుగ్గా మొహం పెడుతూ అన్నాడు. మిసెస్ సుబ్బూ బబ్లూని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని ‘‘డోన్ట్ సే లైక్ దట్! షిప్ జర్నీ ఈస్ మోర్ సేఫ్! ఎయిర్ జర్నీ ఈస్ రిస్కీ!’’ కొడుకుని ఒప్పించడానికిప్రయత్నం చేసింది. వాడు మొండిగా-‘‘నో...నో...ఉయ్ కెన్ గో వితిన్ ఫ్యూ అవర్స్. దిస్ జర్నీ టేక్స్ మెనీ మోర్ డేస్!’’ అంటూ నవ్వాడు. పాయింటే! అన్నట్టు చూశాడు సత్యరాజ్ వేలుతో సైగ చేస్తూ! ‘‘హి ఈస్ ఎ కిడ్!’’ నవ్వింది మిసెస్ సుబ్బు!వివిధ ఛాంబర్స్‌లో ఉన్న ప్రయాణీకులందరూ కాలక్షేపం కోసం కారిడార్లోకి వచ్చారు. ఒకరికొకరు పలకరించుకుంటూ పరిచయాలు చేసుకుంటున్నారు. ఆ షిప్‌లో వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన భారతీయులు కూడా ప్రయాణం చేస్తున్నారు. అన్ని పూవుల్నీ ఏకం చేసే దారంలా వాళ్ళందరికీ ఇంగ్లీషు భాష ఉపయోగపడుతోంది.