నాకు అహంభావం ఎక్కువని అనుకుంటుంటారు.. అఫ్‌కోర్స్‌.. నా వెనకాతల.అయితే, నా వెనకాతల అనుకుంటున్నా, నా చెవుల పడకపోవు వాళ్లు అనుకునే మాటలు.. నేను వాటిని విని నవ్వుకుంటుంటాను. నేను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాను! తల్చుకుంటే గర్వంగా ఉండదూ మరి! ప్రస్తుతం నా స్థాయికి తగ్గట్టుగా నా అలవాట్లు, సంభాషణా, అలంకారం.. అన్నీ బాగా ప్రాక్టీస్‌ చేసి మరీ అలవరుచుకున్నాను.ఇప్పుడు చాలా పొదుపుగా మాట్లాడతాను. ఇలాంటివన్నీ చూసే కాబోలు, నాకు అహంకారం అని ముద్ర వేశారు.నేనిప్పుడు డబ్బుకి తడుముకోనక్కరలేదు. చాలాకాలం కిందటిమాట.. ఒకసారి చేతిలో అయి దంటే అయిదే రూపాయలు మిగిలాయి. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. పులి మీద పుట్రలా, ఉద్యోగులందరం దేని కోసమో సమ్మెకు దిగాం. చాలా రోజులు సాగింది సమ్మె. ఎవర్నడిగినా అరువూ, అప్పూ పుట్టలేదు. రెండో మూడో రోజులు మలమల మాడవలసి వచ్చింది. దాంతో బాగా తెలిసి వచ్చింది డబ్బు విలువ. అలాగే, నా జీవితంలో ఇంకా కాస్త ముందుకి వెళితే, ‘వాడి మొహం, వాడు చదువుకోవడం ఎలా కుదురుతుందీ. తిండికే కటకట లాడిపోతుంటే!’ అని అంతా నా మొహం మీదే అనుకుంటుండేవారు. నేను బాధపడతాననైనా చూడకుండా..ఎన్నో ఇబ్బందులు పడుతూనే చదువుకోవలసి వచ్చింది. ఎందుకో పట్టుదల, ఎదగాలని. అలా చదివి చదివి, చివరికి చాలా పెద్ద క్వాలిఫి కేషనే సంపాదించాను. ఇప్పుడు సమాజంలో గర్వంగా ఉండగలిగేంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. పోతే, మరికొద్ది రోజుల్లో రిటైరయిపోతాను. చీకూ చింతా లేకుండా బతకడానికి కావలసినంత డబ్బుంది నాకిప్పుడు. ఆ సమయంలోనే హైదరాబాదు వెళ్లవలసి వచ్చింది గవర్నమెంటు పనిమీద. ఓ హోటల్లో బసచేశాను నాంపల్లి ప్రాంతంలో.ఇంకా కొంచెం చీకటి ఉండగానే లేచి మార్నింగ్‌ వాక్‌కి బయల్దేరి పోయాను. కానీ హోటల్లో ఇంకా ఎవ్వరూ నిద్ర లేవలేదు. గదికి తాళం పెట్టి మెల్లగా బయటికి వచ్చాను. కాస్త చలిగా ఉంది. నడుస్తున్నాను. కొంచెం దూరంలో ఓ టీ బడ్డీ. అటూ ఇటూ చూశాను.

 ఎవరైనా తెలిసిన వాళ్లకి నేను కనిపిస్తున్నానా లేదా అని. లేరని తేల్చుకుని, టీబడ్డీ దగ్గరికి వెళ్లి మెల్లగా, ‘కాఫీ ఉందా’ అన్నాను.‘ఈ టైంల చాయ్‌ దొరకడమే కష్టం సార్‌, కాఫీ ఎక్కడ దొరుకుద్ది!’‘అయితే, కాఫీ ఎక్కడా దొరకదా?’‘నాంపల్లి స్టేషన్కిపో.. అక్కడ దొరకొచ్చు’నడక సాగించాను. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇంత మహా నగరమూ నిద్రపోతోందిఇంకా. మెల్లగా వాక్‌ని ఆనందిస్తూ, నాంపల్లి స్టేషన్‌ చేరుకున్నాను. స్టేషన్‌ ముందు ఉన్న రౌండ్‌ పార్క్‌ దాటి స్టేషన్లోకి పోవాలి. నిజానికి, రూల్‌ ప్రకారం, ఎడమపక్క నుంచి కదా పోవాలి. కాని ఎందుచేతనో నేను పట్టించుకోలేదు రూలు సంగతి. ఎవరూ లేని ఇలాంటి సమయంలో ఎటు నుంచి వెళితే ఏమిటని అంతరంగం భావించిందేమో! అయితే, అనుకోకుండా నాలాగే మరో వ్యక్తి కూడా రూల్‌ బ్రేక్‌ చేశాడు. ఒక ఆటోవాలా, ఎడమ పక్క నుంచి స్టేషన్‌ దగ్గరికి వెళ్లవలసినవాడు, కుడిపక్క నుంచి చాలా వేగంగా వచ్చి నన్ను గుద్దేశాడు. నేను కింద పడిపోయాను. అలా రోడ్డు మీద పడిపోవడం సిగ్గుచేటు అనిపించి గభాల్న లేవబోయాను. కాని నా ఎడమకాలు నేను లేచి నిలబడడానికి సహకరించలేదు. లేవాలని మరోసారి ప్రయత్నం చేస్తే ప్రాణం పోయేంత నొప్పిగా అనిపించింది. నిస్సహాయంగా నేను అలాగే రోడ్డు మీద పడి ఉండటంతో గాబరా పడ్డాడో ఏమిటో, ఆటోవాడు ‘ఉఠోరే!, అరె, ఉఠోరే!’ అని కొంచెం గద్దించే స్వరంలో అరుస్తూ నా పక్కన నిలబడ్డాడు. ఎక్కడో దూరంగా ఉన్న బీటు కానిస్టేబుల్‌ ఆ అరుపులు విని పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే ఆటోవాడి రెక్కపట్టుకున్నాడు. తరువాత ఆ పోలీసూ, ఆటోవాడు కలిసి, నన్ను నిలబెట్టాలని ప్రయత్నం చేశారు. బాధ భరించలేక నేను మళ్లీ కూలబడిపోతుంటే ఇద్దరూ సాయంపట్టి నన్ను ఆటోలోకి చేర్చారు.