‘‘ఈ రోజు ఆటోలకి, బస్సులకి అన్నింటికీ బంద్‌. ఉదయం ఆయన ఆఫీసుకు వెళ్తే బైక్‌ మీద శ్రావ్యని కాలేజీలో దించారు. ఆయన ఇంటికి తిరిగి రావటానికి రాత్రి తొమ్మిది అవుతుంది. టైము ఇప్పుడే అయిదయింది. కాలేజి విడిచి పెట్టి ఉంటారు. అక్కడినుంచి ఇంటికి చాలా దూరం. పాపం అది ఇంటికి ఎలా తిరిగి వస్తుందీ’’ అని వాపోతోంది వాసంతి. ఆమె ఆలోచనలకు బ్రేక్‌ వేస్తూ ‘‘మమ్మీ’’ అని నవ్వుతూ లోపలికి అడుగుపెట్టింది కూతురు. ఆమె వెనకాలే సుమంత్‌ కూడా వచ్చాడు.‘‘వచ్చావామ్మా, నీకు నూరేళ్లాయుష్షు. నువ్వు ఇంటికి ఎలా తిరిగి వస్తావా అని తెగమదన పడుతున్నాను’’.‘‘నా బైక్‌ మీద మీ అమ్మాయిని తీసుకు వచ్చానండి’’ అన్నాడు సుమంత్‌.‘‘మంచి పనిచేశావ్‌ నాయనా. అమ్మాయికి నువ్వు తోడుంటావనే సంగతే మరచిపోయాను’’ అంది వాసంతి.‘‘వెళ్లొస్తానాంటీ, వెళ్లొస్తా శ్రావ్యా’’ అని అతను వెళ్లిపోయాడు.చంద్రశేఖర్‌, ఆనందరావుల ఇళ్లు ప్రక్కప్రక్కనే వున్నాయి. చంద్రశేఖర్‌, వాసంతిల కూతురు శ్రావ్య. ఆనందరావు, శశిరేఖల కొడుకు సుమంత్‌. ఆనందరావుది మధ్య తరగతి కుటుంబం. అతను స్కూల్‌ టీచరు. పూర్వీకులిచ్చిన సొంత ఇల్లు తప్ప వేరే ఆస్తిగాని బ్యాంక్‌ బ్యాలెన్స్‌ గాని లేదు.

స్కూలు జీతం చాలక ట్యూషన్లు కూడా చెబుతూ అదనంగా కొంత సంపాదిస్తూ ఇంటిని గుట్టుగా లోటు లేకుండా గడుపుకొస్తున్నాడు. సుమంత్‌ చదువులో చాలా చురుకు. పైగా కష్టపడి చదువుతాడు. అతను చదువు పూర్తిచేసి ఒక మంచి ఉద్యోగంలో చేరితే తమ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని అతని తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ కుటుంబంలో అందరు మానవత్వానికి, మంచితనానికి కట్టు బడి ఉన్నారు.సుమంత్‌, శ్రావ్య థర్డ్‌ ఇయర్‌ బి.కాం. డిగ్రీ క్లాసులో కల్సి చదువుతున్నారు. అవసరమైనప్పుడు అతను బైక్‌మీద ఆమెను కాలేజీకి తీసుకు వెళ్లటం గాని అక్కడి నుంచి ఇంటికి తీసుకురావటం గాని చేస్తూ వుంటాడు. ఏదైనా సబ్జెక్ట్‌లో ఆమెకి డౌట్స్‌ వచ్చినప్పుడు అర్ధమయ్యేట్టు ఆమెకి వివరిస్తాడు. పని వున్నప్పుడు ఒకరింటికి మరొకరు వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వెళ్తూ వుంటారు. కానీ హద్దు మీరకుండా జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. ఆనంద్‌ దంపతులు, చంద్రశేఖర్‌ దంపతులు కూడా ఒకే కుటుంబంలాగా కల్సి మెలిసి వుంటారు.