తగరపువలసలో ఓ పురాతన దేవాలయం రామాలయం! ఆ ‘రామాలయం’ కంటే ముందు పుట్టిన రావిచెట్టు, ఆ రావిచెట్టు చుట్టూ సిమెంటు అరుగూ, ఆ అరుగు మీద రిటైర్‌మెంటయిపోయిన ఉద్యోగులు.అక్కడున్న వారందరి దృష్టీచిలకప్రశ్న చెప్పే రాంపండు మీదే వుంది.రాంపండు చుట్టూ ఎపడూ నలుగురయిదుగురుగుమిగూడి వుంటారు. రాంపండు చిలక జోస్యంతో బాటు ‘చేతి జోస్యం’ కూడా చెబుతాడు. ఒక్కోసారి రాంపండు మాట అక్షరాలా జరుగుతుందని అక్కడివారి విశ్వాసం.అందుకే రాంపండుకి మంచి డిమాండ్‌.పండగ పబ్బాలొస్తే మరీ డిమాండ్‌.అది పండుగరోజు కనుక రాంపండు చుట్టూ చిలకజోస్యం చెప్పించుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. వారందరూ గుమిగూడి రాంపండు చుట్టూ కూర్చున్నారు. వాళ్లంతా చిలకజోస్యం కోసం పోటీపడుతున్నారు.‘‘అయ్యా!అందరికీ చెప్తాను. నిదానమే ప్రధానం’’ అన్నాడు చిరునవ్వు పెదవుల మీద రంగరించుకుంటూ-‘‘మరి ఆలస్యం అమృతం విషం అన్నారు కదండీ!’’ సింహాద్రి ధర్మ సందేహం వ్యంగ్యంగా వ్యక్తపరిచాడు అయిదురూపాయిల బిళ్ల చిలకముందు వేస్తూ.‘‘అయ్యా! సామెతలు సమయానుకూలంగా మారతాయి. వాటిని మనం సీరియస్సుగా తీసుకోకూడదు. 

చిలక ప్రశ్నను సీరియస్సుగా తీసుకోవాలి. రాజా! చిలకరాజా! సింహాద్రి సారు చిలక ప్రశ్న కోసం తహతహలాడుతున్నారు. వారికి అదృష్టం ఎలా వుందో ఏ దేవుడు కరుణించాడో తేల్చి చెప రాజా!’’ ముద్దుగా గోముగా రామచిలకని పిలిచాడు.రామచిలుక రెక్కలాడించుకొని బైటకి వచ్చింది.ఎగాదిగా రాంపండునీ, సింహాద్రినీ చూసింది.అక్కడ వున్న కార్డులన్నీ కలియదిప్పి అందులో ఓ కార్డు తీసి సింహాద్రి చేతిలో పెట్టింది. తిరిగి తన గూట్లోకి వయ్యారంగా వెళ్లిపోయింది.కార్డులో వున్న బొమ్మని బైటకి తీసి చూశాడు రాంపండు.శివపార్వతుల బొమ్మ వచ్చింది.‘అమోఘం!అద్భుతం! శివపార్వతుల బొమ్మ వచ్చింది! శివుడు భోళాశంకరుడు. పార్వతి అమ్మవారు కోర్కెలు తీర్చేతల్లి. సింహాద్రి పట్టిందలా బంగారమే అవుతుంది. అయితే ఒక చిన్న మనవి. శివుడి జడలో వున్న గంగమ్మలాగా సింహాద్రికి సెకండు సెటప్‌ వుంది. ఆకారణంగానే అపడపడు చిటపటలు సంసారంలో చోటు చేసుకుంటాయి. అయినా శుభం జరుగుతుంది!చిలక ప్రశ్నని నమ్మండి!’రాంపండు సింహాద్రికి అభయం ఇచ్చాడు.సింహాద్రి మీసం మెలేసాడు...సింహాద్రి ముసిముసి నవ్వులు బుగ్గ మీసాల్లో చిక్కుకుపోయాయి. దర్పంగా వెళ్లిపోయాడు.మరో ఆసామి అయిదు రూపాయలు ఇచ్చి ముందుకు వచ్చి కూర్చున్నాడు.పేరు సత్తిపండు!రాంపండు మరోసారి సత్తిపండు పేరు చెప్పి చిలకమ్మని ఆహ్వానించాడు. చిలకమ్మ ఎప్పటిలా కులుకుతూ వచ్చి ఒక కార్డు తీసి రాంపండు చేతిలో పెట్టి తన గూట్లోకి వెళ్లిపోయింది. రాంపండు కార్డులో వున్న బొమ్మ తీసి చూశాడు.‘సత్తిపండు గారికి కలకత్తా భద్రకాళి వచ్చింది.... ఆపదను సూచిస్తోంది. ప్రమాదం పొంచి వుంది జాగ్రత్త! శివుడికి రుద్రాభిషేకం చేయండి. సమస్యలు సానుకూలంగా మారతాయి!’ అని చదివి వినిపించాడు. సత్తిపండు ముఖంలో జీవం లేదు.