ఫస్టుక్లాసు రైలు ప్రయాణంలో కుదుపు అనేది అంతగా తెలియని మాట నిజమే. కాని అది శరీరానికి సంబంధించినది. మనసుకి పట్టిన కుదుపు? రాణీపద్మినీదేవి రైలు ప్రయాణంలో ముందుకి పోతున్నది ఆమె శరీరం మాత్రమే. అదుపు తప్పిన మనసు మాత్రం అలా వెనక్కి వెనక్కిపోతూనే ఉంది. ఎవరో తన జీవితాన్ని తిరగరాసినట్టూ, తనో పాఠకురాలిగా చదువుకుంటున్నట్టూ....్‌్‌్‌అత్యంత ధనికులైన ఆ జమీందారీ వంశానికి ఆమె ఒక్కతే వారసురాలు గనుక సహజంగా ఆమెని రాణీపద్మినీదేవిగా ఉదహరించే వారు బంధువులంతా. కోటలాంటి ఆ భవనంలో ఆమెకి తెలియనంత వేగంగా బాల్యం రివ్వున సాగిపోయింది. డబ్బూ, అందం తెలివితేటలూ ఉన్న చిన్నపిల్లని ఏ శక్తి వచ్చి తన్నుకుపోతుందో అనేటంత మెలకువతో వాళ్లమ్మా నాన్నా ఆ అమ్మాయిని పెంచారు. ఎండా, గాలీ ఆ అమ్మాయి ఉన్నచోటికి రావాలిగాని ఆ పిల్ల పైకి వెళ్లే అవకాశం లేదు. చదువు చెప్పే గురువులు తమ గడప తొక్కాలి గాని పద్మ బయట కాలుపెట్టే అవసరం లేదు. 

అలాగే ఆమెకి యుక్తవయసురాగానే పరాయిగడప తొక్కి కాపరం చేసే ప్రమాదం నుంచి రక్షించడానికి ఆ తల్లిదండ్రులు విశ్వప్రయత్నం చేసి కృతకృత్యులయ్యారు. కేవలం కులం, ఆరోగ్యం అనే రెండు అర్హతలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. బొత్తిగా డబ్బులేని గోపాల్రాజు అనే యువకుడికిచ్చి పెళ్లిచేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. బంధువర్గమంతా ఒక్కటై కత్తిదూసినా లక్ష్యపెట్టలేదు. పదిమందిలో సమాధానపర్చడాని కన్నట్టు అతనికో హోదా కూడా కల్పించారు. అనాధ శరణాలయపు స్థాయిలో పెరిగి ఇప్పుడింతటి అంతస్తు అందుకున్నా గోపాల్రాజు వ్యక్తిత్వం ఈ వాతావరణంలో ఇమడలేకపోయింది! రెండేళ్ళు గడవ కుండానే విరక్తి అనేది అతన్ని వెంట పెట్టింది. అక్కడ ఉన్నప్పుడు తనలాంటి అనాధలతో ఉన్నా పదిమందితో కలిసి ఉండే భాగ్యం ఉండేది. ఆ జాగా కొండలమధ్య ఉండేది. చుట్టూ పచ్చనిచెట్లు. ఎదురుగా తియ్యని నీరిచ్చే ఏరు. ప్రకృతి అందించే పలురకాల శబ్దాలకి పరవశించే స్వేచ్ఛ తనది. గోచీపెట్టుకుని ఈతకొట్టడంలోని ఆనందం సైనిక అధికార దుస్తుల్లో కవాతు చెయ్యడంలో వస్తుందా! తన తప్పు తెలుసుకొనే సరికి కొడుకుకూడా పుట్టేశాడు! అయినా ఆ బంధం గాని, భార్య అంద చందాలు గాని, అత్తమామల భోగభాగ్యాలుగాని గోపాల్రాజుని కట్టి పడెయ్యలేక పోయాయి. ‘పుట్టుకతో వచ్చిన దరిద్రపు లక్షణాలు ఎక్కడికి పోతాయి!’ అంటూ వాళ్లతో పాటు భార్య కూడా సణుక్కోడం విని అతను భరించలేకపోయాడు. పారిపోయే ప్రయత్నంలో అతను మృత్యువాత పడ్డాడు. కూతురి బతుకిలా అయిపోయిందన్న వేదనతో ‘మా బాగా అయిందనే’ బంధువుల అవమానం భరించలేక మంచం పట్టిన వారిద్దరూ మరి లేవలేదు!