కర్నూల్‌ టౌన్‌..రైల్వేస్టేషన్‌..మధ్యాహ్నం మూడు గంటలకి కర్నూల్‌నుంచి సికింద్రాబాద్‌కి బయలుదేరాల్సిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ ఒకటో నెంబర్‌ ఫ్లాట్‌ఫారమ్‌ మీద బయలు దేరడానికి సిద్ధంగా ఉంది.నేను నా లగేజ్‌తో హడావిడిగా ఓ కంపార్ట్‌ మెంట్‌లోకి ఎక్కేశాను. పండగ సీజన్‌ కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ఓ చోట సర్దుకుని కూర్చున్నాను. రైలు కదిలింది. అలవాటు ప్రకారం నా చేతుల్లో ఉన్న వీక్లీలోకి తల దూర్చాను.ఇంతలో.. కూతురి మీద ఓ తల్లి తిట్ల దండకం వినిపించింది. ఆ వెంటనే పాప ఏడుపు మొదలయ్యింది. కాసేపటికి పాప తల్లితో పాటు తండ్రి కూడా తిట్టేందుకు పోటీ పడ్డాడు. చదువుతూ వున్న మ్యాగజైన్‌లోంచి తలెత్తి చూశాను. ఆ పక్క సీట్లో భార్యాభర్తలూ, వారి ఇద్దరు పిల్లలూ కనిపించారు. బాబుకి పదేళ్లుంటాయి. పాపకి ఏడెనిమిది ఉండొచ్చు. బాబు తెల్లగా, ముద్దుగా ఉన్నాడు. పాప చామనచాయలో పీలగా వుంది. బాబుచేతిలో ఖరీదైన చాక్లెట్‌ బార్‌ ఉంది. పాప చేతిలో ఏవీ లేవు. ఆ చిన్నారి ఏడుస్తూనే ఉంది.‘‘నీ దరిద్రపు గొట్టు మొహానికి చాక్లెట్‌ కావల్సి వచ్చిందా..?’’ అంటూ నేను చూస్తుండగానే ఆ తల్లి పాపకి మళ్లీ రెండు తగిలించింది.‘‘వద్దు మమ్మీ.. కొట్టొద్దు మమ్మీ..’’ పాప ఏడుస్తూ తల్లిని ప్రాథేయ పడుతోంది.‘‘నోర్ముయ్‌..! ఏడుపాపకపోతే చంపేస్తాను’’ మరో వైపునుంచి తండ్రీ ఆ చిన్నారిని ఎడాపెడా కొట్టాడు.

పాప పంటి బిగువున దుఃఖాన్ని కంట్రోల్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది చుట్టూ ఉన్న వాళ్లంతా చోద్యం చూస్తున్నట్టు ఉండి పోయారు. కానీ..నేను తట్టుకోలేక పోయాను.‘‘సార్‌.. ప్లీజ్‌ కొట్టకండి.. కొట్టకండి..’’ అభ్యర్థనగా అన్నాను.‘‘ఏంటీ.. కొట్టకూడదా..?!ఈ తారుడబ్బాని ముద్దు పెట్టుకోవాలా?’’ వెటకారంగా అంది పాప తల్లి.‘‘మా ఖర్మకొద్దీ దాపురించింది. ఇనుపగజ్జెల తల్లి... చూడండి మిడిగుడ్లేసుకుని ఎలా చూస్తోందో..?’’ పాప తలపై గట్టిగా మొట్టి కాయలు వేశాడు తండ్రి.‘‘ఏంటండీ ఇదీ.. ఏదో చిన్నపిల్ల.. తప్పు చేస్తే మందలించాలి గానీ ఇలా..’’ అని వచ్చి పాపని దగ్గరికి తీసుకున్నాను. నా ఆసరా దొరకడంతో పాప ఏడుస్తూ నన్ను చుట్టుకుంది. ఎక్కిళ్లు ఆగడం లేదు.‘‘దీని పుట్టుకే చెడు పుట్టుక. మా ఇంట్లో చెడ పుట్టింది’’ అన్నాడు తండ్రి.‘‘ఇది పుట్టి భూమ్మీద పడగానే మా అమ్మ పోయింది. మా మావయ్య పోయాడు. బ్రహ్మరాక్షసి.!’’ మరింత ఏవగింపుతో అంది తల్లి.పాప పుట్టుక ఆ పెద్దవాళ్ల చావుకెలా కారణమౌతుందీ?! చదువుకున్న వాళ్ల్లు కూడా ఇలా ఇంత మూర్ఖంగా ఆలోచించడమూనా?! వాళ్ల తీరు ఎంతో దారుణంగా అమానుషంగా నాకనిపించింది.‘‘అసలేం జరిగిందండీ?’’ చాలా నెమ్మదిగా అడిగాను.‘‘వేలెడంత లేదు. ప్రతిదానికీ వీడితో పోటీ పడుతుంది. వీడికేం కొనిస్తే ఇదీ అదే కావాలంటుంది.’’ అన్నాడు తండ్రి అదేదో మహా నేరమైనట్టు.