రామాయమ్మ పెద్ద కొడుకు అమెరికా నుంచి నాలుగేళ్ళ తర్వాత వచ్చాడు. కనుక అతగాడు రామాయమ్మకి మొదటి ముద్దుల మనవడు. అతగాడి పేరు రామాయమ్మ భర్త పేరైన సుందర్రావు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆ పేరు ‘సుద్దుల సుందర్రావు’ నుంచి ‘సుందర్రావు సుద్దుల’గా ముందు వెనుకలుగా మారింది. వంశం పేరు చివరకు జరిగినా పశ్చిమంలో వ్యక్తుల్ని వంశం పేరుతోనే సంబోధిస్తారు కనుక పేరు కన్నా వంశం గొప్పదన్న ఓ భావన ఏర్పడుతుంది. ఉత్తర భారతంలోనూ ఇంతే కదా? రాకేష్‌ సక్సేనాలూ, ఉమాంగ్‌ గుప్తాలూ, రాకేష్‌ త్రిపాఠీలూ వగైరా, ఈ నామోచ్చారణ విషయంలో ఇలాంటి అట్టు తిరేగేసే చికాకు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకీ, మనకీ తప్ప మిగిలిన రాష్ట్రాల వారికి లేదు. మౌలికంగా ఆలోచిస్తే ఇంటి పేరు ముందున్నా, తర్వాత వచ్చే తమ పేరే గుర్తింపు పొందాలన్న తహతహ తెలుగువారికి ప్రత్యేకతనిస్తుంది.మనవణ్ణి చూడగానే, ‘‘ఏరా సుందూ, మా నాయనే, మానాయనే! మామ్మని చూడ్డానికివచ్చావా?’’ అని ఆప్యాయంగా పలకరించినప్పుడు సుద్దుల పేరుకి నాలుగు సంవత్సరాలుగా అల వాటు పడిపోయిన సుందర్రావు తడబడిపోయి గుమ్మంలోనే ఆగిపోయాడు. 

వాస్తవానికి రామాయమ్మ మనవణ్ణి వెంటనే లోపలికి అడుగుపెట్టనీయలేదు. అక్కడే నిలబెట్టేసి, రెండోకొడుకు కూతురుతో, ‘‘మంగా! అన్నకి హారతిచ్చి దీవెనలు తీసుకొని, స్వాగతం పలికినందుకు హారతి పళ్ళెంలో ఏ బహుమానం వేస్తాడో చూడు’’ అంది.సిద్ధంగా ఉంచుకున్న స్టీలు చెంబులోంచి బూటుకాళ్ళ మీద రెండు చుక్కల నీళ్ళు చల్లి, నుదుటన కుంకం పెట్టి హారతి పళ్ళెంలోని కర్పూరాన్ని వెలగించి సుందర్రావుకి హారతిస్తూ, ‘‘సుద్దలన్నయ్యా, మామ్మ అన్నట్టుగా నాకేం ఇస్తావు?’’ అంది మంగా సుద్దుల గారాలు పోతూ.‘‘నాయనమ్మా! చెల్లాయి మంగా! తెచ్చిన కానుకలన్నీ పెట్టెల్లో ఉన్నాయి. లోపలికి రానీండి మరి!’’ అన్నాడు నవ్వుతూ.‘‘మరీ చోద్యంగా మాట్లాడకు! మనీ పర్సు జేబులోనే ఉంటుంది కద రా? నువ్వు వస్తావని తెలిసినప్పట్నుంచి తెగ హైరాన పడిపోతోంది పిచ్చిపిల్ల’’ అంది రామాయమ్మ.సుందూకి జ్ఞానోదయమైంది. తన తల్లిదండ్రుల కడుపున ముగ్గురూ అబ్బాయిలే. రెండో బాబాయి మొదటి కూతురు మంగ. మంగంటే అందరికీ ఇష్టమే. పనిమీద ఎవరైనా బయటకి వెడ్తే మంగ ఎదురు శకునంగా రావాల్సిందే. సుందూ వెంటనే పర్సు తీసి ముంబయ్‌ విమానాశ్రయంలో డాలర్లు మార్చి తీసుకొన్న రూపాయల్లోంచి ఓ వెయ్యినోటు తీసి మంగ తలచుట్టూ తిప్పి చేతిలో ఉంచి నుదుటన ముద్దా డాడు. ముందస్తుగా అత్తగారినీ, మరిది కూతుర్ని పలకరించిన కొడుకును చూసి సుందూ తల్లి మనసులో కొద్దిగా ఇదైపోయినా, ఆ భావం ముఖాన కనపడనీయకుండా వెంటనే నిభాయించుకుంది. ఆ తర్వాత సుందూ తల్లిదండ్రుల్నీ, బాబాయిల్నీ, పిన్నమ్మల్ని, వారి సంతా నాన్నీ పేరు పేరునా పలకరించాడు. రామాయమ్మ మనవడికి ఇష్టమని బొబ్బట్లు చేసింది.