సంధ్యా సమయం.చినుకు చినుకుగా ప్రారంభమైన వాన ముదురుపాకాన పడుతోంది. సూదిబెజ్జ మంత చినుకు ఉండే కొద్దీ ఏనుగుతొండం చిమ్మిన ధారకట్టి కుండపోతగా మారింది.అకాల వర్షం! అసందర్భ వాతావరణం దబ్బున చీకటి దుప్పటి కప్పింది.ఇంటి ముందు ఆటోలోంచి నీళ్లోడుతున్న పరదాలు తప్పించుకుని సూట్‌కేసుతో దిగింది మందార. వరండాలోకి చేరేటప్పటికి తడిసిపోయింది. ఆశ్చర్యపడటం గోపాల్‌ వంతైంది.‘ఇంత వర్షంలో ఎలా వచ్చావు’ గొంతు పెగల్చుకుని మరదలితో అన్నాడు. ‘ఇదిగో ఇలా’ అంది నిలువెల్లా తడిసిన ఒళ్లు చూపించి. షెడ్డుకింద బట్టలు ఒడితిప్పి నీళ్ళు పిండుకుంది. అతను చొరవగా సూట్‌కేసు తీసుకుని లోపలికి నడిచాడు.‘సావంత్‌ ఎక్కడ?’ అన్నాడు.‘అతనికి నీళ్లువదిలి వచ్చేశా’ అంది. ‘మళ్లీ గొడవ పెట్టుకుంది కాబోలు’.‘కొంచెం అర్ధమయ్యేలా చెబితే బావుంటుంది’’.‘‘చెబుతాగానీ’ బావా, నన్ను లోపలికి రానిస్తావా? కాస్త ఊపిరి పీల్చుకోనిస్తావా? అక్కని పిలు. నాకు పొడిటవల్‌, వేడి కాఫీ అయినా ఇస్తుంది’’ అంది.గోపాల్‌ ఆమెకు దారి ఇచ్చి, మీ అక్క ఇంకా ఆఫీసు నుంచి రాలేదు అన్నాడు. బెడ్‌రూంలోకి దూరి టర్కీ టవల్‌తో తల తుడుచుకుందామె. బాత్‌రూంలోకెళ్ళి బట్టలు మార్చుకుంది. తడిసిన బట్టలు ఆరబెట్టుకుంది. వెనకే పొగలు కక్కే కాఫీ కప్పుతో గోపాల్‌ నిలబడ్డాడు.‘‘థాంక్స్‌ బావా’’ అంది.‘‘మళ్లీ ఏమైంది, ఏదైనా గొడవ జరిగిందా?’’‘‘వారంనుంచి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాం.

 ఇవాళ నా అనుమానం నిజమైంది’’ అంది.‘‘అబద్ధం. మోడల్‌ ఫోటోగ్రాఫర్‌ అవడంవల్ల వృత్తిరీత్యా కొందరు ఆడవాళ్ళతో క్లోజ్‌గా ఉండాల్సి వస్తుంది తప్ప అతను అలాంటి వాడుకాదు. ఊరకే అనుమానిస్తూ ఉంటావు. నీ నైజంలో మార్పురావాలి’’.‘‘నిన్నూ అనుమానించకూడదు బావా. కానీ నువ్వూ అలాంటివాడవే, ఆ మాట కొస్తే మగాడివి కదూ’’.‘‘నేనా? ఉరుమురిమి మంగలం మీద పడిందని, నేనేం చేశాను?’’‘‘ఇంతకుముందు తడిగుడ్డల్లో నన్ను ఆబగా చూడలేదు! అక్కలేదని నువ్వు అడ్వాంటేజ్‌ తీసుకోనా వద్దా అని ఎదురుచూడ్డం లేదూ?’’ అనేసింది.గోపాల్‌ గతుక్కుమన్నాడు. ‘ఛీ, ఏం మనిషి? గొప్ప అను మానిస్ట్‌లా ఉంది’ అనుకున్నాడు.ఆడవాళ్లు మగవాళ్లు అంటూ వేరు వేరుగా గిరిగీసుకోవడం ఇదేం సంస్కారం. అనుమానించడం ఏం న్యాయం. ఇంకా ఏ కాలంలో ఉందీమె.అనుమానించిందని ఒకసారి మందార వైపు తేరిపార చూశాడు. నిజంగా అందగత్తే. బొండుమల్లెలాంటి యువతి. కళ్ళు మోదుగపువ్వుల్లా ఉన్నాయి. ఎర్రటి కోపంతో తడి తుడుచుకున్న ఒళ్లు వాయిల్‌ చీరలో వింత అందాలు సంతరించుకుంది. తడిఆరిన కురులు ఆఖరి నీటిబొట్టు రాల్చాయి.‘‘నాకే ఎసరు పెట్టావా మందారా’’ అన్నాడు.‘‘చావుకి పెడితేగానీ లంఖణానికి దిగిరావని, నిన్ను బ్లేమ్‌ చేస్తే గాని తోడల్లుణ్ణి వెనకేసుకురావడం మానవు’’ అంది.