అదో దిక్కమాలిన ఊరు.ఎన్నికల ముందు..‘మా పార్టీ గెలిస్తే ‘జలయజ్ఞం’ శాశ్వతంగా మీ ఊళ్లోనే..’ అన్నారు ఓ మంత్రిగారు.‘ఉచిత నీరు - నీటి బదలీ పథకం’ అన్నాడు మరో నేత.‘సామాజిక న్యాయం’ కింద ‘తాగునీరు -సాగునీరు’ ఇస్తానన్నాడు కొత్తగా వచ్చిన ఓ నాయకుడు.జనం ఆనందించేరు. కాసేపు ఆశల పల్లకీలో ఊరేగారు. ఎన్నికలు అవగానే నాయకులు ఎవరి హామీలు వారు పట్టుకు పోగా.. ఊరికి కరువే మిగిలింది. వానల్లేవు.. తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. నేలతల్లి గుండె పగిలి.. పంటల్లేవు.ఎటుచూసినా కరువు... కరువు.. కరువు వరుణదేవుడి ఆఫీసులో టేబుల్‌ మీద కాగితం గాలికి రెపరెపలాడుతోంది.రాత్రి.. ఎన్నికల ముందు ఫ్రీగా వచ్చిన మందులాగ మధువు సేవించి..టీవీలో వచ్చే రియాల్టీ షోల్లాగ .. అప్సరసల డాన్సులు చూసినవే చూసి.. ఉదయం తీరిగ్గా ఆఫీసుకి వచ్చేడు వరుణదేవుడు.టేబుల్‌మీదున్న కాగితం చదివాడు.అది దేవేంద్రుడు ఇచ్చిన మెమో...‘జలశాఖా మాత్యులు వరుణదేవునికి..భూలోకంలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోంది. అందుకు మీ బాధ్యతా రాహిత్యమే కారణమని - నిఘా విభాగం నివేదికని బట్టి తెలిసింది. ఛానెల్స్‌ అందించిన సిడీలు కూడా ఆవిషయాన్ని నిర్ధారించాయి.సంవత్సరంలో నాలుగు నెలలే మీకు పని. అది కూడా మీరు సక్రమంగా చేయలేదు. సైటుకి వెళ్లి వానలు కురిపించాల్సిన మీరు ఆ పని విస్మరించి - బినామీ పేర్లతో ‘మినరల్‌ వాటర్‌’ వ్యాపారం, జలయజ్ఞం కాంట్రాక్టులు చేపట్టినట్టు సమాచారం అందింది.సైటుకి వెళ్లకపోయినా రెగ్యులర్‌గా టి.ఎ., డి.ఎ.లు మాత్రం క్లెయిమ్‌ చేస్తున్నారు. 

చేసే వృత్తిలో నిబద్ధత పాటించకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించిన మీనుంచి సంజాయిషీ కోరడమైనది. వారం రోజుల్లో మీ సమాధానం అందని యెడల క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించి సస్పెన్షన్‌ లేదా టెర్మినేషన్‌ చర్యలు తీసుకోబడునని తెలియజేయడమైనది.-స్వర్గాధిపతిదేవేంద్రుడుకాపీ టు బృహస్పతికాపీటు కుబేరుడుకాపీటు ఆల్‌ డిపార్ట్‌మెంట్స్‌...’మెమో చూడగానే వరుణుడు కోపంతో ఊగిపోతూ అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడే లోపలికి వచ్చేడు వాయుదేవుడు. వరుణుడి చేతిలో కాగితం చూడగానే ‘మెమో’అని అర్థమై పోయింది. అయినా బయటపడకుండా ‘ఏంటి బాస్‌.. అంత సీరియస్‌గా వున్నావు. ఏమన్నా ప్రాబ్లెమా’ అన్నాడు.‘మన బాస్‌ .. ప్రేమలేఖ రాసేడు. ఇదిగో చూడు’ అని మెమో ఇచ్చేడు వరుణుడు.వాయుదేవుడు చదివేడు.వరుణుడు ఆవేశంగా ‘మన బాస్‌కి వెయ్యి కళ్లయితే వున్నాయి కాని బ్రెయిన్‌ మాత్రం లేదు. ఏం రాసేడో చదివేవుగా. సంవత్సరానికి నాలుగు నెలలే పని అట. మధ్యలో తపస్సులు చెడగొట్టడానికని, తుఫానులనీ, వరదలనీ.. స్పెషల్‌ డ్యూటీలు వేసినప్పుడు వెళ్లడం లేదా! అది మరచి పోయినట్టున్నాడు’ అన్నాడు.‘కరెక్ట్‌గా చెప్పేవు బాస్‌. అయినా సీనియర్‌ మోస్ట్‌వి. ఆఫ్ర్టాల్‌ మెమోకి అంత వర్రీ అయిపోతున్నావేంటి. అమృతం తాగిన మనవి పెర్మనెంట్‌ పోస్టులు. ఇంకెవరూ ఆ కేటగిరీలోకి వచ్చే సమస్యే లేదు. లైట్‌ తీస్కో. కేంటీన్‌ కెళ్లి రెండు పెగ్గులు మధువు వేసి వద్దాం పద’ అన్నాడు వాయుదేవుడు.