సాయంకాలపు చల్లటి గాలులు పగలంతా కాసిన ఎండ ప్రతాపాన్ని పోగొడుతున్నాయి. శరీరాలకు, మనసులకు ప్రశాంతత కలిగిస్తున్నాయి.ఉడతలు రెండు పిట్టగోడ మీద మామిడిచెట్టు దగ్గర నుండి జామచెట్టు వరకు పరుగులుపెడుతున్నాయి. అవి చూడటానికి చాలా ముచ్చట గొలుపుతున్నాయి.మొక్కలన్నింటికి నీళ్ళు పోయడం వలన తాజాగా కన్పిస్తున్నాయి. వీచేగాలికి వయ్యారంగా కొమ్మలు, ఆకులు, పూలు కదులుతున్నాయి.అంజలి సన్నజాజి మొగ్గలని జాగ్రత్తగా కోస్తోంది. సన్నజాజి సుకుమారమైన, సువాసన భరితమైన పూవు. ఏ మాత్రం కఠినత్వానికి తలవంచలేదు.జామచెట్టు దగ్గర నున్న సిమెంటు బెంచీ మీద రామారావు గారు కూర్చుని చదివినదేఅయినా పేపర్‌ను మరొకసారి తిరగేస్తున్నారు.అఖిల్‌, నిఖిల్‌ కాస్త దూరంలో క్రికెట్‌ ఆడుకొంటున్నారు.‘‘అమ్మా! అంజలీ!’’ రామారావు గారు పిలిచారు.‘‘ఇంక కాసిని మొగ్గలే ఉన్నాయి నాన్నగారు! వచ్చేస్తున్నాను’’ అంజలి ఆయన పిలుపు కర్థం తెలిసిన దాని లాగ బదులు చెప్పింది.ఆయన మనవల వైపు చూశారు. లోకంలోని దీక్ష అంతా వాళ్ళదే అన్నట్టు క్రికెట్‌ ఆడుతున్నారు.ఆయన నవ్వుకొన్నారు. చిన్నప్పుడు ‘‘అవినాష్‌’’ కూడా ఇంతేకదా! సాయంత్రం వేళలో గానీ, ఆదివారం ఉదయం గానీ ఏ పనీ చెప్పడానికి లేదు. క్రికెట్‌ ఆటలో మునిగేవాడు.‘‘మిగిలిన టైమ్‌ మీది. ఈ టైమ్‌ నాది’’ అంటూ పేచీ పెట్టేవాడు. ఎలాగో పరీక్షల సమయంలో మాత్రం ఆట మానేవాడు. 

అదీ తమను దయ తలచినట్లుగా!వాడు ఉన్నప్పుడు ఇల్లంతా ఎంత సందడి? అంజలి, వాడు కలిసి ఎన్ని ఆటలు ఆడుకొనే వారు. గాలి పటాలు ఎగర వేయడం, గోళీలు ఆడటం, బొంగరాల ఆట, అబ్బో... ఒకటేమిటి ఎవరు ఏ ఆటలు ఆడితే అందులో దూరిపోయే వాడు.పనిమనిషి కొడుకు బిళ్ళ, కర్ర ఆడితే తను కూడా వాడితో సమంగా ఆట.‘‘ఔనురా! వాడి వయసు ఏమిటి? నీ వయసు ఏమిటి?’’ అంటే నవ్వు.‘‘వయసులు వేరయినా ఆట ఒకటే కదండీ!’’ అనేవాడు. ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.అంజలి పళ్ళెం నిండా మొగ్గలు, మరువం కలిపి కోసుకుని వచ్చింది. తండ్రి ప్రక్కన వచ్చి కూర్చుని అడిగింది.‘‘ఏమిటి నాన్నగారూ! మీలో మీరే నవ్వుకొంటున్నారు’’. ఆయన సమాధానమివ్వలేదు. ఆఖిల్‌, నిఖిల్‌ ఆటలో వాదన చేసుకొంటూంటే అంజలి ఆట చూసి ‘‘దెబ్బలాట లేకుండా ఆడుకోండి’’ అని హెచ్చరించింది. అప్పటికి ఆమెకి గుర్తు వచ్చింది.‘‘తమ్ముడు గుర్తు వచ్చాడా నాన్నగారూ?’’ మృదువుగా అడిగింది.ఆయన మౌనంగా తలూపారు.‘‘వాడిని చూసి రెండేళ్ళు ఔతోంది కదమ్మా?’’ అన్నారు.అంజలి మాట్లాడలేదు. ఆయనకి సంవత్సరాలు, నెలలు, రోజులు అన్నీ లెక్కే!ఎప్పుడైనా తను నెల అవగానే రాకపోతే ఆయన ‘‘అమ్మా! నువ్వు నచ్చి నెలా పది రోజులు అయిందమ్మా!’’ అంటారు. తను వెంటనే ప్రయాణమై వస్తుంది.