‘ఏవండీ ఇండియా నుంచినాన్నగారు ఫోను చేసారండి’ భర్తసురేష్‌తో చెప్పింది రాధ.‘ఆహా! ఏంటట విశేషాలు, అంతా కులాసాయేనా?’ బూట్ల లేసులు విప్పుకుంటూ అడిగాడు సురేష్‌.‘అన్నీ విశేషాలేనండి’ ఆనందంగా అంది రాధ.‘అబ్బో! నువ్వంత హుషారుగా ఉన్నావంటే, ఏదో పెద్ద విశేషమేనన్నమాట’ నవ్వుతూ అన్నాడు సురేష్‌.‘ఔనండి, వచ్చేనెల ఐదవ తారీఖున మా చిన్నాన్నగారి అమ్మాయి పెళ్ళట. మనల్ని రమ్మనమనినాన్నగారు మరీ మరీ చెప్పారు’ భర్తకు కాఫీ ఇస్తూ అంది రాధ.‘సరే మీరు వెళ్ళండి. ఎలాగూ పిల్లలకి వచ్చేనెలలో సెలవులే కదా’ కాఫీ సిప్‌ చేస్తూ అన్నాడు సురేష్‌.‘మీరు వెళ్లండి’ అంటున్నారు. అంటే మీరు ‘ఇండియాకి’ రారా? అతని పక్కనే కూర్చుంటూ అంది.‘ఎలా కుదురుతుంది రాధా! ఇప్పుడున్న ప్రాజెక్టు పూర్తై మరలా ఓ కొత్త ప్రాజెక్టు, వచ్చే నెలలో వస్తుందని చెప్పాను కదా! అందుచేత నువ్వు పిల్లలు వెళ్ళి హాయిగా కొంత కాలం ఇండియాలో ఎంజాయ్‌ చేసి రండి’ అంటూ అప్పటికప్పుడు నెట్‌లో న్యూయార్క్‌ నుంచి ఇండియాకి ఎయిర్‌ టిక్కెట్లు బుక్‌ చేసాడు సురేష్‌. సుమారు పదేళ్ళ తరువాత మాతృభూమికి వెళ్తున్నానన్న ఆనందం రాధ ముఖంలో కనిపించడంతో తృప్తిగా నవ్వుకున్నాడు సురేష్‌.్‌్‌్‌‘ఒరేయ్‌ రాఘవా త్వరగా కారు తియ్యరా’ అవతల రాధ వస్తున్న ఫ్లైటు వచ్చే టైమవుతోంది అంటూ కొడుకుని కంగారు పెట్టేసాడు పురుషోత్తమరావు.

‘అబ్బా ఎందుకంత కంగారు డాడీ! అది వస్తున్న ఫ్లైటు అరగంట లేటు, ఇప్పుడే ఫోను చేసి కనుక్కున్నాను’ చెప్పాడు రాఘవ.‘పోనీలేరా అరగంటే కదా! ఐనా బయలుదేరు. ఎందుకంటే ఎయిరుపోర్టుని ఊరుకి ఆ కొసని పెట్టారు,’ శంషాబాదుకి మార్చిన ఎయిరుపోర్టుని తల్చుకుంటూ అన్నాడు పురుషోత్తమరావు.తండ్రి ఇంక తనె ంత చెప్పినా వినిపించుకోడని తెలిసిన రాఘవ రాత్రి తాగిన మందు ప్రభావం పూర్తిగా దిగకుండానే హేంగోవరు స్థితిలోనే కారుని బయటకి తీసాడు. కొడుకు పరిస్థితి తెలిసిన పురుపోత్తమరావు కొడుకు నిర్వాకానికి మనసులోనే బాధపడతూ డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నాడు.్‌్‌్‌ఎదురుగుండా నిండు ముత్తైదువులా వస్తున్న కూతురు రాధని పోల్చుకోవడం కొంచెం కష్టమే అయింది పురుషోత్తమరావుకి. పదేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఇలా పక్కా భారతీయ స్త్రీలా వస్తున్న కూతుర్ని కించెత్తు గర్వంగా చూసాడు. ఆనందంగా విష్‌ చేస్తూ వారిని సమీపించింది రాధ. మనవలిద్దరూ తాతయ్యా, మావయ్యల పాదాలకు నమస్కరించారు. వారి సంస్కారాన్ని చూసిన పురుషోత్తమరావు మనసు ఆనందంతో పొంగిపోయింది.‘ఏం నాన్నా! కులాసానా? ఏం అన్నయ్యా! ఎలా ఉన్నావు. వదినా పిల్లలు ఎలా ఉన్నారు’ ఎంతో ఆప్యాయంగా అడిగింది రాధ.అన్నింటికీ ముక్తసరిగా జవాబిస్తున్న రాఘవ వంక, పురుషోత్తమరావు వంక మార్చి మార్చి చూసిన రాధ, అన్నయ్య పరిస్థితిని అర్ధం చేసుకుని మరింకేం మాట్లాడకుండా వెళ్ళి మౌనంగా కార్లో కూర్చుంది. ముందు సీట్లో తాతయ్య ప్రక్కకు చేరిన మనవలు చక్కగా స్పష్టమైన తెలుగులో మాట్లాడుతుండడంతో తృప్తిగా నవ్వుకుంది రాధ.