‘సోగ్గాడు శోభన్‌బాబు ఇక్కడ - నేను ఇక్కడ, ఇప్పుడు మీకు నాకు ఉన్నంత ఎడం కూడా ఉండదు, అంత దగ్గరగా చూసేవోణ్ణి. ఒక్కరోజూ రెండు రోజులూ కాదు ఏకంగా పది రోజులుపైనే షూటింగు. అన్ని రోజులూ అందరం ఇక్కడే, ఈ మంటపాలు సెంటర్లోనే...’బయలుదేరిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నాడేమో, అతిథి కొంచెం ఆసక్తిగా తనను చూస్తున్నాడని గమనించాక, హనుమంతు తన మాటలు ఆపాడు.ఇంతలో ఫోను వచ్చింది.‘బాబు ఫోన్‌ చేశారండి, ఆరికి భోజనాలు లేటవుతుంది త్వరగా వచ్చెయ్యమని, వెళ్దాం పదండి’ అన్నాడు.ఇద్దరూ ఇంటివైపు నడుస్తున్నారు.డాక్యుమెంటరీ సినిమా డైరెక్టరు అరవిందరావు ఆ రోజు ఉదయమే ఆ ఊరు వచ్చాడు. ఒక మిత్రుడుతో తన ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నట్టు చెప్పాడు. అతనే ఈ హనుమంతు వాళ్ళ బాసు ప్రతాపచంద్ర ఇంట్లో తనకు బస ఏర్పాటు చేశాడు.‘ఒకసారి ఊరు చూసి వస్తాను’ అనడంతో - పనివాడు హనుమంతును ప్రతాపచంద్ర తనతో పంపాడు.

 అరవింద్‌ తాజా సినిమా- ‘క్రానికల్స్‌ ఆఫ్‌ ఎ టెంపుల్‌ స్కల్ప్చర్‌’కు నేషనల్‌ పనోరమాలో మూడు అవార్డులు వచ్చాయి. దాంతో, తర్వాత సినిమా కోసం సబ్జెక్టు వెతుకులాటలో ఈ ఊరు వచ్చాడు.జమిందారీ వంటిదేమీ లేదు గాని ప్రతాపచంద్ర కుటుంబ నేపథ్యం అటువంటిదే. అతని తాత నిర్మించిన భవంతి అది. వాళ్ళు మొత్తం తొమ్మిది మంది. మిగతా వాళ్ళంతా నగరాల్లో ఏవేవో వ్యాపారాల్లో తలమున్కలై ఉంటారు. ప్రతాప్‌ మాత్రం ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చేసినా, ఊళ్ళోనే ఉండి భూములు, వ్యవసాయం చూసుకుంటున్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళదే పెద్ద వ్యవసాయం. పిల్లలు ఇద్దరూ పెళ్ళిళ్ళ తర్వాత అమెరికాలో సెటిలైపోయారు. ఇంట్లో ఉండేది భార్యాభర్తలు ఇద్దరే, అయినా వచ్చేపోయే తోబుట్టువుల కోసం మూడు తరాలుగా ఆ ఇల్లు ఎప్పుడూ ఒకే మాదిరిగా ముస్తాబై ఉంటుంది. మధ్యాహ్నానికి కెమెరామ్యాన్‌ మణి, అసిస్టెంటు డైరెక్టరు వాసు కూడా వచ్చారు. పైన రెండవ అంతస్తులో ఉన్న గెస్ట్‌ రూంలో అతిథులకు బస ఏర్పాటు చేశారు. సాయంత్రం టీ తాగుతూ పై నుంచి పెరట్లో జరుగుతున్న హడావిడి చూసి ఆసక్తిగా కిందికి వెళ్ళారు.అక్కడ కొలిమి ఒకటి ఏర్పాటు చేసి కొడవళ్ళకు కక్కు (పదును) పెడుతున్నారు. ఓ ముస్లిం పెద్దాయన దగ్గర నలుగురు కుర్రాళ్ళు ఆ పని చేస్తున్నారు.అరవింద్‌ వాళ్ళను చూసి హనుమంతు కుర్చీలు తెచ్చివేశాడు. అప్పటికే అక్కడ ఓ అరవయ్యేళ్ళ వ్యక్తి అన్నీ తానై హడావిడి చేస్తున్నాడు. పువ్వుల లుంగీ కట్టుకుని చొక్కా గుండీల్లో మూడు దాకా తీసేసుకుని తిరుగుతున్నాడు.