నేనంటే మా ఊరోళ్లకీ, నా భార్య ఊరోళ్లకీ కూడా కోపమే. ఆఖరికి ప్రకృతికి కూడా కోపంలా ఉంది. నాకు ఇల్లు లేకుండా పోయిన రోజే ఈదురుగాలితో అది నన్ను ఈడ్చి ఈడ్చి కొడుతోంది. భూమి, ఆకాశం ఏకమైనట్లుగా వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. కరెంటు ఎప్పటి నుంచో లేదు. చిమ్మచీకట్లో ఎలిమెంటరీ స్కూలు వరండాలో ముడుక్కుని కూర్చుని ఉన్నాను.ఎంత మూలకి ఒదిగి కూర్చున్నా గాలి విసురుకి జల్లులు నామీదకి వచ్చి పడుతున్నాయి. పరిస్థితి చూస్తే ఈ వాన తుఫానుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. తెల్లవారితే టెంకాయల పండగ. నా పెళ్లాం, కొడుకూ ఇంట్లో ఉన్నట్లయితే ఎంత బావుండేది? ట్రాక్టర్‌ మామనడిగి డబ్బులిప్పిచ్చుకోని దానికి చీర, కొడుక్కి చొక్కాలాగూ కొనిచ్చేవాడ్ని కదా.ఇలా ఆలోచించే సమయానికి నేను ఇంకా చచ్చిపోలేదు. నాకే ఆశ్చర్యం వేసింది. బతికున్నపుడు నా పెళ్లానికి, బిడ్డకి ఏదైనా కొనివ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇదే మొదటిసారి. ఎందుకో దిగులుగా అనిపిస్తోంది కాని అప్పటి ఉద్రేకం ఇంకా నా మనసుని ఆక్రమించుకునే ఉంది.

 ఆ ఉద్రేకంతో కూడిన దిగులే నేను చావడానికి కారణమైందేమో!2చెత్తను ట్రాక్టర్‌ మీద వేసుకుని ఊరి శివార్లలో పారేయడం, మట్టి, ఇటుకలు, రాళ్లు, సిమెంటు లాంటివి కావాలన్న వాళ్లకి తోలడం లాంటి పనులు చేస్తాను నేను. ఏ పనైనా ఎంత కష్టమైన పనైనా, చేయగలను. ట్రాక్టర్‌ యజమాని నా భార్య చిన్నాన్నే. అందరికీ రోజుకూలీ మూడు వందలైతే నాకు ఓ యాభై ఎక్కువిస్తాడు. అల్లుడని ఇస్తాడనుకునేరు...డబ్బులకీ వాడికీ విడదీయరాని లంకె, బంధుత్వాలు చూసి ఇచ్చే రకమేమీ కాదు. నేను బాగా పని చేస్తానని, నన్ను సరిగ్గా చూసుకోకపోతే వేరే చోటకి పోతానని ఇస్తాడు.ఆకాశం ఉరిమింది. ఉరుముతో పాటు మెరుపు. వరండా అంతా తడిసిపోయింది. సుధక్క చెప్పినట్లు విని ఉంటే ఈ పాటికి వెచ్చగా పెళ్లాం పక్కలో పడుకుని ఉండేవాడిని. ఎక్కడికెళ్లిందో నా పెళ్లాం? వస్తుందో లేదో! ఆ రాకెక్కడికి పోతుంది? వస్తే నా కొడుకు అంజిగాడి సాక్షిగా దాన్ని నరికెయ్యాల... ఆ రోజే పరిగెత్తుతున్నప్పుడే దాని కాళ్లమీద ఏసేయాల్సింది వేటు. పారిపోకుండా ఇంట్లో పడి ఉండేది.ఛ! ఇంత జరిగినా మళ్లీ బుద్ధి లేకుండా ఆలోచిస్తున్నాను.

ఆ సుధక్క అంటానే ఉంటుంది...సుధక్కేందిలే...అందరూ అంటున్నారు...‘‘నువ్వు తాగితే మృగానివేరేయ్‌, నువ్వేం చే స్తన్నావో, ఏం మాట్లాడతన్నావో నీకే తెలియదు’’ అని. నిజమే కదా! అయితే తాగడం మానేదెట్లా? ‘‘మందులు ఇప్పిస్తానబ్బాయ్‌ డాక్టర్‌ దగ్గరకి పోదాం రా’’ అంటుంది సుధక్క. సరేనని ఒకసారెళ్లా...‘‘నీలో మారాలనే కోరిక గట్టిగా ఉండాలి, అప్పుడే మేమేమైనా చేయగలం’’ అన్నాడు ఆ డాక్టరు! ఆ ముక్క చెప్పేదానికి ఐదొందలు కొట్టేసాడు పాపం సుధక్క దగ్గర.