అందమైన మట్టితో చేసిన ఆకృతి, రంగులతో కనువిందు చేస్తుంది. చూపరులకు ఆనందం కలిగించే ఆ ఆకృతిలో లోపల చాలా పగుళ్ళున్నాయి. ఏ కుండపోత వర్షానికో తడిసి ముద్దయి పోవచ్చు. ఉధృతమైన గాలికి పగిలిపోనూవచ్చు. తీవ్రమైన ఎండకు మరింత బీటవారి పోవచ్చు. లేదా నిండు నూరేళ్లు మనుగడ సాగించనూవచ్చు.బద్దలవడానికి లక్షకారణాలు వున్నట్లుగానే, నిలిచి వుండడానికి లక్ష కారణాలు వున్నాయి.ఉత్తరం చదవడం పూర్తి చేసి మడత పక్కన పడేశాడు.ఊహించని ఈ సంఘటన నుండి ఇంకా తేరుకోలేకపోతున్నాడు.

కళ్లు ఎరుపు రంగులోకి మారి చాలా సేపయింది. ముఖం అంతా ఉబ్బిపోయింది.హూ...టీ పెట్టుకోవడం చాతకాదట. ఎంత మాట అంది. అదీ చూద్దాం...బయటకు వెళ్లి డబ్బులు పారేస్తే కావలసినంత టీ దొరుకుతుంది. ఈ మాత్రం దానికి అంత పొగరా...నిజమే! కానీ ఎక్కడకి వెళ్లాలి. ఇంటికి ఫర్లాంగు దూరంలో కానీ హోటల్‌ లేదు. అంత దూరం వెళ్తే కానీ టీ దొరకదు. అంత దూరం నడిచి వెళ్లాలి.బైక్‌ వుంటే బాగుండును. రోజూ వెళ్లి వచ్చేవాడిని.అమ్మో! రోజూనా, ఎంత బైక్‌ వుంటే మాత్రం. రోజూ ఎంతని వెళ్లగలం. బోలెడంత పెట్రోల్‌ ఖర్చు. ఇదంతా లెక్కవేసుకుంటే నెలకి ఎంత అవుతుంది? బండి వున్నా అయ్యే పని కాదు.లాభం లేదు. నడిచే వెళ్లాలి. నడక ఆరోగ్యానికి మంచిది కూడాను. అయినా రోజూ నడిచి వెళ్లడం అంటే అదీ కష్టమే.ఉదయాన్నే లేచిన వెంటనే బ్రష్‌ చేసేసి చాలా ఆనందంగా షేవ్‌ చేసుకొని చల్లగాలి పీలుస్తుంటే, పేపరు అందుకొని ఒక్కొక్క వార్తా చదువుతుంటే...వేడివేడిగా పొగలు కక్కుతూ భార్యామణి టీ అందిస్తుంటే... ఆ ఆనందమే వేరు.నిన్నటి వరకూ అలాంటి ఆనందాన్నే పొందాను. ఇంతలోనే ఏంవచ్చిందో, ఏవేవో ఉత్తరంలో రాసిందిగా.

అయినా ఉత్తరంలో రాసిందేమిటి? టీ పెట్టుకోవడం కూడా చేతకాని వాడివి అంటూ అంత నిర్భయంగా రాసి పారేసింది.టీ పెట్టుకొని చూపించాలి. అంతేకాదు. టీ నీకన్నా నేను బాగా పెట్టగలను అని నిరూపించాలి. నిరూపించాలంటే టీ పెట్టాలి. అనుకుంటూ వంటగదిలోకి వెళ్లాడు. చిన్న తపేళా తీసుకొని గ్లాసుడు నీళ్లు పోశాడు. స్టవ్‌ వెలిగించడం ఎలా? నాబ్‌ ఎడమ వైపు తిప్పాలా? కుడివైపు తిప్పాలా? కుడి ఎడమ అయితేపోరపాటు లేదోయ్‌ పాట జ్ఞాపకం వచ్చింది. పొరపాటు లేకపోవడం ఏమిటి? ఇంకేమైనా వుందా? గ్యాస్‌ లీకయిపోదూ...కుడి వైపు తిప్పాడు గాని తిరగలేదు. లేదు..లేదు.. ఎడమవైపుకి తిప్పేసరికి చిన్నగా శబ్దం చేస్తూ గ్యాస్‌ రాసాగింది.