నేను అందంగా లేనా?’’ అంది సాధన అతన్ని కవ్వించేలా చూస్తూ.మసక మసకగా వెన్నెల పరుచుకున్నట్టు-మత్తుగా ఉన్న ఆ దీపకాంతిలో-విలాసవంతంగా మెరుస్తున్న ఆ హోటల్‌గదిలో-ఏసీ పూర్తిగా ఉన్నా, వాతావరణం అప్పటికే వేడెక్కింది.

అంత వరకూ స్కాచ్‌తోపాటు ఆమె సొగసుల్ని ఆస్వాదిస్తున్న ప్రతాప్‌, ఆ మాటలకు చిన్నగా నవ్వాడు.‘‘సినిమాలో నటించాలంటే, అమ్మాయిలకి అందం ఒక్కటే చాలదు బేబీ...’’ అతని గొంతులో ఒకరకమైన జీర ధ్వనించింది.‘‘మరింకేం కావాలి?’’ చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ను పక్కనున్న చెయిర్‌ మీద తన హ్యాండ్‌ బ్యాగ్‌ పక్కనే పెట్టి రెండు చేతులూ పైకెత్తి ముఖం మీద పడుతున్న తన జుత్తును విలాసంగా వెనక్కి మళ్ళించింది సాధన.ఆ ఒక్క క్షణం ప్రతాప్‌లో మళ్ళీ కలవరం చెలరేగింది. తను ఎంతోమంది అమ్మాయిల్ని చూశాడు కానీ ఈమెలో ఏదో చెప్పలేని ఆకర్షణ.... తనను అయస్కాంతంలా లాగేస్తోంది. గ్లాసు అందుకుని మత్తుగా మరో గుటక వేశాడు.ప్రతాప్‌ తెలుగు చిత్రసీమలో ప్రముఖ ప్రతినాయకుడు. అతన్ని ‘రొమాంటిక్‌ విలన్‌’ అంటారు. చూడ్డానికి అతను కొందరు హీరోలకంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాడు కానీ అతనికి ఎందువల్లో ‘విలన్‌’ బ్రాండ్‌ పడిపోయింది.ఆ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో అతనికి ఓ పర్మినెంట్‌ సూట్‌ ఉంది. 

షూటింగ్‌ లేని సమయాల్లో ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడాలంటే, ఆ హోటల్‌ సూట్‌కే రమ్మంటాడు. ఎవరినీ ఇంటికి ఆహ్వానించడు. ఆ హోటల్‌ సూట్‌లో అతనికి అన్ని సదుపాయాలూ లభిస్తాయి. బైట రెడ్‌లైట్‌ వెలుగుతూ ఉంటే, అప్పుడు డిస్టర్బ్‌ చేయడానికి అక్కడ ఎవరూ సాహసించరు.ఆ రోజు సాధనను - రాత్రి ఎనిమిది గంటలకు అక్కడికి రమ్మని చెప్పాడు ప్రతాప్‌. సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చేలా తనకు సాయం చేయమని అతన్ని నెలరోజులుగా చేజ్‌ చేస్తూ ఉందామె. సినిమా ఛాన్సులకోసం ఎందుకు తనవెంట పడుతోందో అర్థంకాక విషయం తేల్చుకుందామని ఆ రోజు రమ్మన్నాడు. పైలా పచ్చీసులో ఉన్న సాధన ఆకర్షణీయమైన గ్లామరస్‌ దుస్తుల్లో ముస్తాబై వచ్చింది. పెద్ద అందగత్తె కాకపోయినా, ఆమెలో రెచ్చగొట్టే సొగసులు అతన్ని కట్టిపడేశాయి. ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ఽధారాళంగా మాట్లాడుతోంది. ఆమెమాటల్లో అప్పుడప్పుడు కొంటెతనం కూడా తొంగి చూస్తోంది. ఆమె ప్రవర్తన చూస్తూంటే, తేలిగ్గా ముగ్గులోకి దించవచ్చుననే అభిప్రాయానికి వచ్చాడు ప్రతాప్‌. అందుకే ఉత్సాహంగా సంభాషణ కొనసాగిస్తున్నాడు.‘‘నువ్వు ఫిలిమ్‌ఫీల్డ్‌ గురించి తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు’’ అన్నాడు ప్రతాప్‌ నవ్వుతూనే.‘‘ప్రతాప్‌జీ...నిజంగా నాకేమీ తెలియదు. మీరేదైనా కుండబద్దలుకొట్టినట్టు, ‘ఫ్రాంక్‌’ గా మాట్లాడతారని, మీ ఇంటర్వ్యూలవీ చూసి, మిమ్మల్ని అప్రోచ్‌ అయ్యాను. మీరైతే నాకు తప్పక హెల్ప్‌ చేస్తారని నాకు అనిపించింది. అందుకే మీ అప్పాయింట్‌మెంట్‌ కోసం నెలరోజులుగా ప్రయత్నిస్తూ వచ్చాను’’ అంది సాధన.