సుభద్ర పెద్దగా చదువుకోలేదు.ఆమెకి మతిపోయినట్టుగా ఉంది.ఓ పక్క పక్షవాతంతో మంచానపడ్డ సూరపరాజు గారికి కుడి పార్శ్వం చచ్చుబడి పోవడంతో మాట కూడా పడిపోయింది.ఆయన గవర్నమెంటు హైస్కూల్లో హెడ్మాస్టరుగా పని చేసాడన్న మాటేగాని భార్యకే నాడూ ఆర్థిక విషయాలేవీ చెప్పేవాడు కాడు.కాయగూరల్తో సహా పదహారూ ఆయన తెచ్చిపడేస్తే వండి పెట్టడమే పరమావధిగా ఆవిడ జీవితం ఇంతవరకూ గడిచింది. ఇప్పుడు ఒక్కసారిగా ఆర్థిక వ్యవహారాలు నెత్తినపడే సరికి ఉక్కిరిబిక్కిరిగా ఉంది.ఎవరెవరో ప్రాంసరీ నోట్లు పట్టుకొచ్చి సూరపరాజుగారు బాకీ ఉన్నాడని చెప్తుంటే ఆమెకంతా అయోమయంగా ఉంది. ఆ నోట్లు చూపించి అవునా అని అడిగితే అవునంటూ తల ఊగిస్తున్నా డాయన.సూరపరాజు గారు చాలా మంచి వ్యక్తి, ఎవరే ఇబ్బందిలో ఉన్నా నేనున్నానంటూ నిలబడతారని అందరూ అంటూంటే మురిసిపోయేది తను. ఇందులో కొన్ని నోట్లు ఆ మంచితనం తాలూకు హామీ ఉన్నవని తెలిసి ఏడుపొస్తోందావిడకి.ఉన్న ఒక్క కూతుర్నీ అక్కర్లేని పరుగులుపెట్టి తలకు మించిన అప్పులు చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాడికిచ్చి పెళ్లి చేసి అంతదూరానికి పంపించారు. ఇప్పుడు తండ్రి మంచం పట్టాడని తెలిసినా రాలేని ఇబ్బందుల్లో ఉన్నానని ఫోన్‌ చేసినప్పుడల్లా ఏడుస్తుంది వెర్రిపిల్ల.దూరపుకొండలు నునుపు. 

అక్కడ మనకి తెలీని ఇబ్బందులు వాళ్లకేం ఉన్నాయో ఎవరికెరుక!అదేం ఖర్మమో, రిటైరైన రోజు స్కూల్లో జరిగిన సన్మానసభలో మాట్లాడుతూ అంతులేని యాంగ్జైటీతో విరుచుకుపడిపోయాడాయన. స్కూలు వాళ్లు టాక్సీలో తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్లేరు.కబురంది వచ్చిన చుట్టాలూ పక్కాలూ ఒకళ్లని మించి ఒకళ్లు ఖరీదైన హాస్పిటళ్ల పేర్లు చెప్పేరు ఆయన వైద్యానికి.తీరా చూస్తే బేంకు ఎకౌంటులో గాని, ఇంట్లోగాని ఆయన గారు దాచిన డబ్బులేమీ లేవు. ఇంట్లో ఉన్న నగా నట్రా తాకట్టు పెట్టి, బంధువుల దగ్గర అప్పులు తెచ్చి ఆయనకి వైద్యం చేయించింది. వచ్చింది గట్టిస్ర్టోకు కావడం వలన ప్రాణం నిలబడిందే తప్ప మనిషి లేచి తిరిగే పరిస్థితి పోయింది.నెలనెలా జీతంలాగే పెన్షనూ వచ్చేస్తుంది కాబోలనుకున్న సుభద్రకి హాస్పిటల్స్‌కి తిరగడం హడావుడి ముగిసి ఇంటికి వచ్చాక కనుక్కుంటే తెలిసింది ఏమిటంటే దానికి చాలా తతంగం ఉంటుందని.ఎన్నడూ ఆయన పనిచేసిన స్కూలు ముఖం ఎరగని సుభద్ర పెన్షను విషయం కనుక్కోడానికి స్కూలుకెళ్లింది. కొంగు నిండుగా కప్పుకొని బిడియపడుతూ గేటు లోపలికి అడుగు పెట్టిన ఆమెని మొదట ఎవరూ గుర్తు పట్టలేదు.ఎవర్ని పలకరించాలో, ఎవర్ని అడగాలో తెలీక గేటు పక్క ఓ మూల ఒదిగి నిల్చుంది.చాలాసేపటికి అటుగా వచ్చిన రికార్డు అసిస్టెంటు రమణ ఆమెని చూసి గుర్తుపట్టి దగ్గరకి వచ్చాడు ‘నమస్కారం’ అంటూ చేతులు జోడించి, అతను అర్జెంటు సంతకాలేవైనా కావాల్సి వచ్చినప్పుడు సూరపరాజుగారి కోసం ఇంటికి వచ్చేవాడు.