కాచిగూడ రైల్వేస్టేషన్‌.ఆ రోజు వసంత పంచమి కూడాను.బాసర మీదుగా వెళ్ళే నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరటానికి సిద్ధంగా ఉంది. బోల్డంత రద్దీవల్ల ప్రయాణికులు ఇంకా టికెట్‌ క్యూలోనే ఉండిపోయారు. జగన్నాథ్‌, శేషమ్మ దంపతులు తమ పిల్లలు రఘునాథ్‌, అనితలతో రైలెక్కి ఎలాగోఅలా సీట్లు సంపాదించారు. పిల్లలు అంటే చిన్న పిల్లలేం కాదు, రఘు ఆల్రెడీ పెళ్ళికి రెడీగా ఉన్నాడు. అనిత ఇంజనీరింగ్‌ చదువుతోంది. ప్రతియేడాదీ వసంత పంచమి రోజున బాసరవెళ్ళి సరస్వతీ పూజలు చేసి గోదావరినది చెంత సేదతీరడం ఆ కుటుంబానికి ఆచారం.ఐదు నెలల గర్భిణిగా బయల్దేరిన రైలు, సికింద్రా బాద్‌ స్టేషన్‌లో ఆగీఆగంగానే నిండుగర్భిణి రూపం దాల్చింది. నిల్చోడానికికూడా చోటులేని ఆ కంపార్ట్‌మెంట్‌లోకి హేండ్‌బ్యాగ్‌తో అలవోకగా మెలికలు తిరుగుతూ ఒక మెరుపుతీగలాంటి అమ్మాయివచ్చి జగన్నాథ్‌ ఎదురు సీట్లో ఉన్నావిడ పద్మాసనం విప్పదీసి బెత్తెడు జాగా సృష్టించి అందులో కూర్చుంటూ ఒడుపుగా నడుముతో తోసి జానెడు జాగాలో పాగా వేసింది.‘‘మీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పండాంటీ, నిలబడ్తా!’’ అందా మెరుపుతీగ తన సమ్మోహనమైన చిరునవ్వు సంధిస్తూ. ‘‘అబ్బే, పర్లేదమ్మా అడ్జస్టవుదాంలే’’ అందా పద్మాసనం పంకజం సీటును ఇంకో ఇంచి త్యాగం చేస్తూ. జగన్నాథ్‌ కుటుంబం అంతా ఆ అమ్మా యినే గమనిస్తోంది. ‘‘ఫేస్‌ వాల్యూ మరి! ఈజీగా పన్లౌతయ్‌’’ గొణిగింది అనిత తన తండ్రి చెవిలో.రైలు వేగం పుంజుకుంటున్న కొద్దీ జనాల కడు పుల్లో ఆకలి పురివిప్పుకుంటోంది. శేషమ్మ సంచీలోంచి మినపగారెలు, పులిహోర పొట్లాలు తీసి కాయితం ప్లేటులోకి సర్ది అనితకి ఇస్తుండగా అనిత వాటిని తన అన్నకి, తండ్రికి ఇచ్చింది. ఎదురుసీట్లో ఆకలిగా తమ కేసే చూస్తోన్న ఆ అమ్మాయి వంక తదేకంగా చూసింది. ‘‘హాయ్‌! అయామ్‌ రాధ. నైస్‌ మీటింగ్‌ యూ’’ పరి చయం చేసుకుందా అమ్మాయి అనితకి షేక్‌హ్యాండ్‌ ఇస్తూ. అనిత నవ్వి, తన వాళ్ళందర్నీ పరిచయం చేసింది.

 పులి హోర, వడల ప్లేటొకటి రాధకి కూడా తినమని ఇచ్చింది.‘‘టిఫిన్‌ తెచ్చుకోవడం మరిచిపోయా. ఆకలి అలారం కొడుతోంది లోపల. పొద్దున్న అలారం మోగంగానే లేచుంటే కనీసం బ్రెడ్‌ అయినా తెచ్చుకు నుండేదాన్ని. లేటైపోయింది!’’ అంది రాధ నొచ్చుకున్నట్టుగా.‘‘ఏం పర్లేదమ్మాయ్‌. బాసర వెళ్ళేదాకా తినగలి గేంత పులిహోర ఉంది మా దగ్గర. డోంట్‌ వర్రీ’’ అభయమిచ్చింది శేషమ్మ. ‘‘థాంక్సాంటీ. దేవునిదయ వల్ల మీరు నాకు దొరికారు’’ అంది రాధ చిరునవ్వు ప్రస రిస్తూ. కాసేపట్లో కంపార్ట్‌మెంట్‌ అంతా రెస్టారెంట్‌ లాగా మారిపోయింది. ఎటుచూసినా జనాలు ఏదో ఒకటి తింటూ కనిపించారు రాధకి.