‘‘మీ ఇద్దరికీ పెళ్ళై ఎన్నాళ్ళైంది?’’‘‘ఆరు నెలలు’’‘‘ఆరు నెలల్లో ఒక్కసారి కూడా...’’ కొద్దిగా ఆశ్చర్యపోయినట్టుగా అని, ఆగి మళ్ళీ అంది కౌన్సెలర్‌‘‘మీరేం చదువుకున్నారు?’’హర్షిత ముఖం అవమానంతోఎర్రబడిందా ప్రశ్నకి. తటపటాయిస్తూనెమ్మదిగా చెప్పింది ఇంగ్లీషులో, మీరు పొరబడుతున్నారు. శారీరక కలయిక గురించి కాదు నేను చెప్పేది, మానసిక తృప్తి గురించి’’.అర్థమైందన్నట్టుగా తలాడించింది కౌన్సెలర్‌. తను చెప్పిన విషయం ఆమెకి మొదటే అర్థమైనా, మరోసారి క్లియర్‌గా చెప్పించడానికి ఆ ప్రశ్న ఆమె అడిగిందేమోనన్న అనుమానం వచ్చింది హర్షితకి ఆమె ముఖం చూస్తే.‘‘మీది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళా?’’ హర్షిత ఆలోచనలని ముందుకు సాగనివ్వకుండా తర్వాత ప్రశ్న సంధించింది కౌన్సెలర్‌.‘‘పెద్దలు కుదిర్చిన వివాహమే. అయితే, ఇద్దరం ఇష్టపడే పెళ్ళి చేసుకున్నాం’’ చెప్పింది హర్షిత.‘‘కట్న కానుకల విషయాల్లో పొరపొచ్చాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? మీ వైపు వాళ్ళకీ అతడి వైపు వాళ్లకీ పెళ్ళిలో తగాదాలేమైనా....?’’‘‘లేదు. 

మా పెళ్ళి చాలా బాగా జరిగింది. మా వాళ్ళూ, వాళ్ళ వాళ్ళూ బాగా కలిసిపోయారు’’.‘‘మీకు కానీ, మీ వారికి కానీ ఉద్యోగంలో ఏమైనా సమస్యలున్నాయా?’’‘‘లేవు’’‘‘ఆర్థిక సమస్యలు?’’‘‘ఊహూ’’ తల అడ్డంగా ఆడించింది హర్షిత.ఒక్క నిమిషం కౌన్సెలర్‌ ఏమీ మాట్లాడలేదు. తన ముందర కూర్చున్న హర్షితని పరిశీలనగా చూసింది.‘‘మరింకేమిటి మీ సమస్య?’’ అని ప్రశ్నిస్తున్నట్టనిపించాయి ఆమె చూపులు హర్షితకి.‘‘శృంగారం ఒక అద్భుతమైన అనుభవమనీ, కొత్తగా పెళ్ళైన జంటలు దానికోసం పరితపించి పోతూ ఉంటారనీ, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత మోహావేశం కమ్మేస్తుందనీ పుస్తకాల్లో చదివాను. సినిమాల్లో చూపిస్తారు. కానీ మా మధ్య అదేమీ జరగడం లేదు. శృంగారం యాంత్రి కంగా, దాంపత్యం మొక్కుబడిగా అనిపిస్తోంది. అదే మా సమస్య’’ సూటిగా చెప్పింది హర్షిత.‘‘ఆయనకి కానీ మీకు కానీ ఉద్యోగాల్లో నైట్‌ షిప్టులు ఉంటూ ఉంటాయా?’’‘‘లేదు. ఇద్దరివీ నార్మల్‌ టైమింగ్సే. ఉదయం ఒకేసారి వెళ్ళి రాత్రి ఒకే సమయానికి ఇంటికి వస్తూ ఉంటాం’’.‘‘రోజూ సాయంత్రం ఇంటికి ఏ సమయంలో వస్తారు?’’