పూలతీగె కాళ్ళకు చుట్టుకుని కారెనుబోతు ఆగిపోయినట్టు ఆ వేణునాదం విని విశ్వనాథం ఆగిపోయాడు.జన ప్రవాహం పైనుంచి వంతెన. దాని మీద రైలు పట్టాలు.వంతెన గోడ కానుకుని ఒక గుడ్డి మనిషి.అతని బండ పెదవుల నానుకొని ఎప్పడూ ఒక మురళి.ఆ మురళి రంధ్రాల నుంచి కాటుక పొగలై, సర్పాలై జరజర పాకివచ్చే పాటలు.విశ్వనాథానికి మోటారు సైకిలు చప్పుడులో ఆ పాటలు ఎప్పుడూ వినిపించవు.వంతెనపై నుంచి వెళ్ళిపోయే రైలూ ఆలకించదు.వంతెన కిందనుంచి ప్రవహించే జనమూ ఆలకించరు. మోటారుసైకిల్‌ మీద వెళ్ళిపోయే విశ్వ నాథం ఎన్నడూ వినలేదు.గుడ్డివాడి పాటలు గరికపూలై ఆ రోడ్డు నిండా గుట్టలు గుట్టలైతే విశ్వనాథం వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు.గుడ్డివాడి పాటలు సీతాకోక చిలుకలై మబ్బుల్లాగ వీధినంతా ఆవరిస్తే విశ్వనాథం వాటిని చీల్చుకొని వెళ్ళిపోతాడు.ఒక రోజు వంతెన దగ్గర అతని మోటారు సైకిల్‌ ఆగిపోయింది.చీదరించుకుంటూ ఆ సైకిలుకు స్టాండు వేసి నిల్చున్నాడు.పై నుంచి చండాలంగా చప్పుడు చేస్తూ రైలింజన్‌ ఒకటి వెళ్ళిపోయింది.దూరంగా వున్న ఏదో ఒక చెట్టుమీద ఒక కోకిల ‘న్యూసెన్సు’గా కూస్తున్నది. దానికి తోడు. ఈ గుడ్డిగాడిద కొడుకొకడు. ఫ్లూటు అంటారు గావోసు - ఖాకీపేంటు జేబులోంచి అతను ఖాకీ సిగరెట్టు తీసి వెలిగించి ఖాకీ పొగ వదిలాడు.గుడ్డిమనిషి వేణువులోంచి ఒక పామొచ్చి విశ్వనాథాన్ని చటుక్కున కుట్టింది.

ఉలిక్కిపడ్డాడతను.గుడ్డి లంజికొడుకు వాయిస్తున్నది ఏ పాట?గద్దరుగాడి పాట!అమ్మ నాకొడకనక్సలైటు నాకొడకదోపిడీ చెయ్యటం కాడ్నించి అడుక్కునే పన్లో కూడా మీరే చొచ్చుకు పోయేరన్న మాట.విశ్వనాథం చరచర నడుస్తూ ముసలాడి దగ్గరకు వెళ్ళాడు.‘‘ఏం రోయ్‌... గుడ్డి నా కొడకా...’’ అని పిలిచాడు.గుడ్డిమనిషి అది వినలేదు.‘‘నీ పాటా పాడుతున్నమూనీ ఆట ఆడుతున్నామూ...’’ అంటోంది మురళి.వంగి అతని చేతిలోని మురళి లాక్కుందామనుకుని - మనకి దేవుడిచ్చిన కాళ్ళుండగా చేతు లెందుకు పాడు చేసుకోవాలి - అనుకొని ఎర్రబూటుతో ఆ మురళిని కదిపేడు.ఆ బూటు మడమ గుడ్డిమనిషి గడ్డానికి తగిలింది.గుడ్డి కళ్ళ గుహల నుంచి చీకటి చిమ్ముకొచ్చింది.అతను భయంగా కంగారుగా లేచి నిల్చున్నాడు.చేయిముందుకు చాస్తూ---‘‘ఎవరది... ఎవరిది...’’ అని పిరికిగా, భయంగా అన్నాడు.‘‘నీ అమ్మా మొగుడ్ని... గుడ్డి నాకొడకా... ఏంపాటలు పాడుతున్నావురా? కాల్జేతులు విరిచీగల్ను..’’గుడ్డిమనిషి నిజానికి పుట్టుగుడ్డి. వాడికి వెలుతురంటే తెలీదు. మనుషుల ఆకారం తెలీదు. జంతువుల ఆకారం తెలీదు. కాని కుక్కొస్తే, పోలీసొస్తే అతనికి ఎలాగోగాని తెలిసి పోతుంది. వచ్చిన వాడు పోలీసని అతనికి తెలిసిపోయింది.‘‘పోలీసా?’’ అని అతను భయంగా అడిగాడు.విశ్వనాథానికి అనుమానం గట్టిపడిపోయింది.‘‘నన్ను చూడగానే పోల్చేసేవు... అంటే నువ్వు నిజంగా గుడ్డోడివి కాదన్నమాట...’’ అన్నాడతను.