సీతా సాయంత్రం రడీగా వుండు, టిక్కెట్లు తీసుకువస్తాను. సినిమాకెళ్దాం’’ అన్న రామబ్రహ్మం మాటలు గుర్తుకువచ్చి ఉలిక్కిపడి లేచి కూర్చుంది సీతామహాలకి్క్ష. టైం చూసేసరికి సరిగ్గా 3.30 గంటలు అయింది. ఊయల వైపు చూసేసరికి బాబు మంచి నిద్రలో వున్నాడు.హమ్మయ్య! వాడు లేచేసరికి పనులు తొందరగా చేసుకోవాలి అనుకొని, హడావిడిగా అటుఇటు పరుగెడుతూ, మధ్యమధ్యలో ఊయలలో వున్న బాబు లేచాడేమోనని చూస్తూ, సాయంకాలపు పనులను చకచకా చేస్తోంది. సందెకసులు తీయడం, గిన్నెలు కడగడం, ఆరిన బట్టలను తెచ్చి మడతపెట్టడం చేస్తూనే రాత్రికోసం ఏం కూరగాయలు వండాలా? అని ఆలోచించింది. మనసులోనే ఆ పొద్దున వండిన పప, చారూ కొద్దికొద్దిగా వున్నాయి, బంగాళాదుంప అయితే అయిపోయింది, అందుకని ఇపుడు త్వరగా ఏది అవుతుందో చూసుకుని చెయ్యాలి అనుకుంది. అనుకుందే తడవుగా ఫ్రిజ్‌లో వున్న కూరగాయలను తీసి, ఒకసారి చూసి, బెండకాయలైతే తొందరగా అవుతాయి అని బయటకు తీసింది.ఇంతలోపు గేటు దగ్గర ఏదో అలికిడి అయినట్లు అనిపించగానే, ఉలిక్కిపడి, అపడే వచ్చేశాడా? అయ్యో ఇంకా చాలా పనులున్నాయే? ఇంకా రడీ కాలేదని రామబ్రహ్మం కోప్పడతాడేమోనని అనుకుంటూ బయటకు వచ్చింది.

తీరా బయటకు వచ్చి చూస్తే, రామబ్రహ్మం ఆఫీసులో పనిచేసే ప్యూను అయిన గోవిందం కనిపించాడు. కొద్దిగా ఆశ్చర్యానికి గురయినా, ఏం సంగతో అడుగుదామని ‘‘గోపి ఏంటి మీ అయ్యగారు రాలేదా? ఈ టైంలో నిన్నెందుకు ఇక్కడికి పంపించారు?’’ అంది.అపుడు గోపి ‘‘అదేనండి అమ్మగారు, అయ్యగారికి ఆఫీసులో కొద్దిగా ఆలస్యం అవుతుందిట, నాచేత టిక్కెట్లుతెప్పించి పంపించారు. మిమ్మల్ని ఆటో ఎక్కి నేరుగా సినిమా థియేటరుకు వచ్చేయమన్నారండి’’ అని గబగబా చెప్పేసి, అంతే ఇదిగా టిక్కెట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు.ఇక అప్పట్నుంచి దడ మొదలైంది సీతామహాలకి్క్షలో. సమయం చూస్తే నాలుగు అయింది. సినిమా 6 గంటలకు మొదలవుతుంది. ఇంకా వంట చేయాలి, బాబుకు సెరెలాక్‌ తినిపించి, స్నానం పోయాలి. తనూ రెడీ అవ్వాలి అనుకుంటూ గబగబా బియ్యం కడిగి పొయ్యిమీద పెట్టి, బెండకాయలు తరిగి వేపుడు చేసింది. వంట అయ్యేలోపు బాబు లేచాడు. వాడికి సెరెలాక్‌ తినిపించి,గబగబా స్నానం పోసి రడీ చేసి టైం చూసేసరికి సరిగ్గా 5 గంటలు కొట్టింది. అమ్మో అనుకుంటూ, కనీసం 5.30 గంటలవరకైనా ఇంట్లోనుండి కదిలితే 6 వరకు అక్కడకు చేరుకోగలను అనుకుంది. అవునూ! ఇంతకీ ఏసినిమా థియేటరో అనుకోగానే గుండెల్లో మరోసారి దడపుట్టింది.