రాత్రి వాళ్లిద్దరూ గొడవపడ్డారు.అవును. నిజంగానే ఆ భార్యాభర్తలిద్దరూ రాత్రి తెల్లారేవరకూ, ఒకర్నొకళ్ళూ ఏవేవో అనుకుంటూ అరుచుకుంటూ, కీచులాడుకుంటూనే వున్నారు.వాళ్లసలు నిద్రపోలేదు, సరికదా వాళ్ళ పోట్లాటవల్ల నాకు కంటిమీద కునుకే రాలేదు. ప్రక్క గదిలో నివశిస్తున్న ఆ కొత్త జంట, నిన్నటి వరకూ హాయిగా, ఆడుతూ పాడుతూ, పిక్నిక్‌లకూ, బీచ్‌లకూ, చెట్టా పట్టా వేసుకుని తిరిగేరు. మరా యిద్దరే యిలా ఒకర్నొకళ్ళు కస్సుబుస్సులాడుకుంటూ వున్నారని అనుకుంటేనే ఎంతో బాధగ వుంది నా మనస్సుకు.సుఖానికి రెండే నోళ్ళంట. కాని బాధకో?...నాలుగు నోళ్ళండి.అసలు మొన్నమొన్నటి వరకూ ప్రక్కపోర్షన్‌ని ఎవరికీ అద్దెకివ్వలేదు. అద్దెకు యివ్వమని చాలామంది వచ్చి అడిగినా యివ్వలేదు. అద్దెకుండేవాళ్ళు సరైనవాళ్ళు కాకుంటే బోల్డంత తలనొప్పి అని నా ఉద్దేశం. అయితే యిన్ని సంవత్సరాల నా పట్టుదల మొట్టమొదటి సారిగా సడలిపోయింది ఆ అబ్బాయిని చూడగానే. 

అతను బుద్ధిమంతుడనిపించింది. పైగా బాగా చదువుకున్నాడు. ఇక్కడే జి.ఇ.లో కంప్యూటర్‌ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. అతని మాటల పొందిక వినయం, నాకు బాగా నచ్చేయి.‘‘నా పేరు నరేంద్ర. ఈమధ్యనే మేరేజి అయింది సార్‌! నా మిసెస్‌ కూడ పోష్టు గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఇన్నాళ్ళు ఆఫీసు గె స్ట్‌హౌస్‌లో వుండేవాడిని. మరిపడు నేను మేరీడ్‌ గాబట్టి, వేరే వుండాల్సి వచ్చింది. నావల్లగాని, నా ఫేమిలీ వల్లగాని మీకెటువంటి నష్టం గాని, కష్టం గాని రానీయం. ప్లీజ్‌!! కాదనకండి సర్‌... ఈ లొకాలిటీలో మీవంటి వాళ్ళ యింట్లో వుంటే మాకెంతో సేఫ్టీగా వుంటుంది.’’ అన్నాడు ఎంతో వినయంగా.వినచక్కటి సంభాషణ. చూడచక్కటి కదలిక గల మనిషి ఎక్కడి కెళ్ళినా విజయం సాధిస్తాడంటారు. అతని విన్నపం నా మనస్సును కరిగించింది.మూడోరోజే ఇంట్లోదిగిపోయేరు వాళ్ళు. అమ్మాయిపేరు రేఖ. పేరుకు తగినట్లే చంద్రరేఖలాగ కళకళ్ళాడుతోంది. నాకు కాఫీ-టిఫినూ ఆ పూట వాళ్ళింట్లోనే... శని, ఆదివారాలు శలవు రోజుల్లో కూడా వాళ్ళ గది తలుపులు వేసేసేవుండేవి. ఇంట్లో, ఇద్దరూ ఉన్నంతసేపూ, నవ్వులూ, కేరింతలూ... ఏమాత్రం ఖాళీ దొరికినా, బయటికెళ్ళి, ఎక్కడో, ఏదోటి తినేసి రావడం, వాళ్ళకలవాటు.ఇంట్లో నేను తప్ప యింకెవరూ లేకపోవడం కూడా వాళ్ళ స్వేచ్ఛకు మరింత ఊతం యిచ్చినట్లుయింది. నాకు ఒకే ఒక్క కూతురు. మేరేజ్‌ చేసేశాను. రాజమండ్రిలో వుంటున్నారు వాళ్ళు. ఇన్నాళ్ళుగా ఒంటరిగా ఆ ఇంట్లో గడుపుతున్న నాకు తోడుంటే ఎలా వుంటుందో అర్థమౌతోందిపడు.స్వేచ్ఛా విహంగాలంటే యిటువంటి చక్కటి జంటను చూసేకే అనుకుంటారు. మరటువంటి జంటకేమయింది? భార్యాభర్తల మధ్య ఏదో తీవ్రమైన సమస్య వస్తేనే తప్ప, అలా పోట్లాడుకోలేరెవ్వరూ...