‘‘దొంగ దొరికాడా విజయా’’ అడిగింది సుజన.బ్యాంకు రద్దీగా వుంది. క్యాష్‌ కౌంటర్లో డబ్బు సరి చూసుకుంటున్న విజయ తలతిప్పి పక్క కౌంటర్‌లోని సుజనవైపు చూసి నవ్వింది.సుజన ముందో క్యూ, విజయ ముందో క్యూ నిలబడిపోయి వుంది. తన ముందుకు చేయిచాపి నిలబడ్డ వ్యక్తిని చూస్తూ ‘‘లెక్క పెట్టుకోండి. ఇరవై మూడు వేలు’’ అంది డబ్బు అందిస్తూ విజయ.అతడి కుడి చేయి మరింత ముందుకు రావటం, డబ్బును అందుకునే సాకుతో విజయ చేతివేళ్ళను తడమటం క్షణాల్లో జరిగిపోయింది.ఉలికి పాటును కప్పి పుచ్చుకుంటూ షాక్‌ కొట్టినట్లు తన చేతిని గబుక్కున వెనక్కు లాక్కుంది విజయ.‘‘ఎన్నో పురుగు’’ లెడ్జర్‌లో లెక్క రాసుకుంటూనే తల పైకెత్తకుండా అడిగింది సుజన మెల్లగా.మామూలు పురుగు కాదే కందిరీగ. పళ్ళ బిగువున కోపాన్ని, ఛీత్కారాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ బదులిచ్చింది విజయ. కౌంటర్‌ ముందు వైపు చూస్తూ బిగ్గరగా ‘‘టోకన్‌ సెవెన్‌టీ’’ అంది క్యాష్‌ లెక్కపెడుతూ.మరో పది హేను నిముషాల తర్వాత కొంచెం తీరిక దొరకడంతో సుజన ఇందాకటి ప్రశ్నను అడిగింది.‘‘దొంగా’’ అని సాలోచనగా తల అడ్డం ఆడిస్తూ, ‘‘దొరకలేదు సుజనా’’ అంది విజయ.‘‘దొరికితే వాడు దొంగెలా అవుతాడే. అయినా వాడు దొరుకుతాడని నాకైతే ఎంత మాత్రం నమ్మకం లేదు. మరి, నీకు’’ విజయవైపు పరిశీలనగా చూస్తూ అడిగింది సుజన.

విజయ మొహంలో బాధ లీలగా కనపడుతోంది. ‘‘కష్టార్జితం కదా, ఎక్కడ పోతుందే,, ఖచ్చితంగా దొరుకుతుంది. చూస్తూ వుండు’’ అలోచిస్తూనే అంది విజయ. మధ్యాహ్నం లంచ్‌ బ్రేక్‌ వరకు ఇద్దరికీ మరి మాట్లాడుకోవటం కుదరలేదు.సుజన ఏదో మాట్లాడిస్తోంది. కాని భోంచేస్తున్నంత సేపూ విజయకు జరిగిన సంఘటన గుర్తొస్తోంది.రెండు వారాల క్రితం జరిగిందది.జీతం తీసుకున్న రోజు సాయంత్రం అనిల్‌కు ఫోన్‌ చేసింది. ‘‘పిల్లలకి పండక్కి బట్టలు కొనాలి కదండీ. మీరు మా ఆఫీసు దగ్గరకు వచ్చేయండి. ఇద్దరం కలిసి ఇట్నించి ఇటే షాపింగ్‌కు వెడదాం’’ అంది.‘‘నేను మీ ఆఫీస్‌ దగ్గరకు వచ్చి మళ్ళీ బజారుకు వెళ్ళాలంటే పెట్రోలు, టైం వేస్ట్‌ అవుతుంది కదా. నువ్వే బజార్లోకి వచ్చేసి నేతాజీ పార్క్‌ దగ్గరుండు. నేను అక్కడికొస్తా’’ లెక్కలు చెప్పుకొచ్చాడు అనిల్‌.కళ్ళెగరేస్తూ తల అడ్డంగా ఆడిస్తూ కుడి చేతిని చూసుకుంది విజయ. ఇవేవీ మొగుడికి కనిపించవు కదా అనుకుంటూ సరేనంది ఫోన్‌ పెట్టేస్తూ.పావుగంటకు పైగా పార్కు దగ్గర నిలుచుని ఎదురుచూస్తే అప్పుడొచ్చాడు అనిల్‌. ‘‘ఎంత సేపయ్యింది వచ్చి ఆలస్యం చేసానా’’ అని అంటాడేమో అని ఎదురు చూసింది. కానీ అటువైపు నుండి అలాంటి మాటలూ రాలేదు. జీతం డబ్బు కోసమన్నట్లు చేయి ముందుకు చాపాడు. అలా చాపే ఆ కుడి చేతిని చూసినప్పుడల్లా ఆమెకు తన కుడి చేతిని చూసుకోవడం అలవాటు.